- జగన్ ‘జనభేరి’కి పోటెత్తిన జనం
- ఉదయం నుంచే హిందూపురం వీధులన్నీ కిటకిట
- జన ప్రభంజనాన్ని చూసి బయటకు రాని బాలకృష్ణ
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు రెండ్రోజుల ముందే నందమూరి నటసింహం చేతులెత్తేసింది. ‘జనభేరి’కి పోటెత్తిన జనాన్ని చూసి కనీసం బయటకు వచ్చే సాహసం కూడా చేయలేదు. ఇప్పటికే పార్టీ నేతల గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతున్న బాలయ్య.. జగన్ ప్రభంజనం ముందు వెలవెలబోవాల్సిన పరిస్థితి నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం హిందూపురం వచ్చారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం బహిరంగ సభ ఉంటుందని తెలియడంతో ఉదయం నుంచి పుర వీధులన్నీ కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడాయి. ఈ జన ప్రభంజనాన్ని చూసి హిందూపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు ముచ్చెమటలు పట్టాయి. కనీసం పట్టణంలో ప్రచారం చేసే సాహసం చేయలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తుండడంతో బాలయ్య ప్రచారానికి స్పందన కరువైంది. ప్రచారానికి వెళ్తున్నా ప్రతి రోజూ ఓటర్ల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ‘జనభేరి’కి తరలివచ్చిన అశేష జనవాహినిని చూసి ఇక తాను ప్రచారానికి వెళ్తే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని గ్రహించి ప్రచారానికి ఆఖరి రోజని తెలిసినా వెళ్లలేదు.
ప్రచారం చేయలేదనే సంకేతాలు బయటకు వెళ్తే బగోదని చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. జన స్పందన కన్పించకపోవడంతో తిరుగు ముఖం పట్టారు. పట్టణంలోని మురికివాడల్లో బాలయ్య సతీమణి వసుంధరా దేవి, కుటుంబ సభ్యులు ఉదయం మాత్రమే ప్రచారం చేసి ఆ తర్వాత కన్పించలేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ మాత్రం ప్రచారంలో దూసుకెళ్లారు. ఎక్కడకు వెళ్లిన ఆయన్ను ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానికంగా ఉంటున్న నాయకుడికే పట్టం కడతామని ఓటర్లు స్పష్టం చేస్తుండడంతో బాలయ్య గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక గ్రూపుల వారీగా తెలుగుదేశం పార్టీ నేతలు విడిపోవడం కూడా బాలయ్యకు తలనొప్పిగా మారింది. పైగా ఆయనపై స్థానికేతరుడి ముద్ర ఉండడంతో ఈ ఎన్నికల్లో విజయం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాగా ‘జనభేరి’ సభ అనుకున్న సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా జరిగినా ఒక్కరు కూడా పక్కకు వెళ్లకుండా జగన్ రాకకోసం ఎదురు చూశారు. ‘అన్నీ ఉచితంగా ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఆ హామీలు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు అమలు చేయలేదో మీకు ఓట్లు అడిగేందుకు వస్తున్న బాలకృష్ణను నిలదీయండి’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభలో ప్రజలకు సూచించారు.
యువకుడు, ఉత్సాహవంతుడు, మంచివాడు అయిన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డిని, గట్టివాడయిన హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి నవీన్ నిశ్చల్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. జగన్ ప్రసంగం సాగుతున్నంత సేపు ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో ఈలలు, కేకలు వేశారు.
చివరి రోజూ బాలయ్య చిందులు
చివరి రోజు ప్రచారంలో కూడా బాలయ్య అభిమానులపై చిర్రుబుర్రలాడారు. బ్రహ్మేశ్వరంపల్లిలో జనం ఎవరూ కనిపించక పోవడంతో నాయకులందరూ ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి పూలదండ వేసేందుకు ప్రచార రథం వద్దకు రాగా.. నీ దండ అక్కర లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుచన్నంపల్లి వద్ద రోడ్ షో ముగించుకుని ప్రచార రథం నుంచి కారులోకి మారుతుండగా స్థానిక నేతలు పలుకరించేందుకు వె ళ్లగా ‘ఏయ్ వెళ్లండి’ అంటూ బాలయ్య కస్సుబుస్సులాడారు.