కొడుకనే పదానికి మచ్చ తెచ్చాడు
బాలకృష్ణపై ధ్వజమెత్తిన షర్మిల
తండ్రిని వెన్నుపోటు పొడిచిన బాబుతో చేతులు కలిపాడు
అన్నంపెట్టిన నిర్మాతపైనే కాల్పులు జరిపిన ఘనుడు
మతిస్థిమితం లేదని సర్టిఫికెట్ తెచ్చుకున్న వాడికి పోటీచేసే అర్హతుందా?
అలాంటి పిచ్చోడిని గెలిపిస్తే... ప్రజలకు కూడా పిచ్చెక్కిస్తాడు
{పజాసేవంటే మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం కాదు
ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చూపించారు వైఎస్సార్
జగనన్నను గెలిపించండి... జీవితాన్ని అంకితం చేస్తాడు.
అనంతపురం: ‘‘వైఎస్సార్ కోసం మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుతానని నల్లకాలువలో ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం జగనన్న అధికారం వదులుకున్నాడు.. చేయని నేరానికి జైలుపాలయ్యాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెరవకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుని కొడుకనే పదానికి సార్థకత చేకూర్చాడు. సొంత తండ్రిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని డ్యుయెట్లు పాడుతూ సినీ హీరో బాలకృష్ణ కొడుకనే పదానికి మచ్చ తెచ్చాడు. ఆయనకు వైఎస్సార్ కొడుకు గురించి మాట్లాడే అర్హత ఉందా? బాలకృష్ణకు, జగనన్నకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విరుచుకుపడ్డారు.
ఒక మంచి కొడుకు కాలేని వాడు యాక్టర్ కాగలడేమోకాని, ప్రజలు మెచ్చే నాయకుడు కాలేడని చెప్పారు. ప్రజాసేవ అంటే మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం కాదని తెలిసొచ్చేలా బాలకృష్ణను తరిమి కొట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు. జనం కోసం మడమ తిప్పకుండా పోరాడుతోన్న జగనన్నకు ఓటేస్తే ఐదు సంతకాలతో రాష్ట్రం దశ, దిశ మార్చేస్తారని హామీ ఇచ్చారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా షర్మిల శనివారం పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి, బహిరంగసభల్లో మాట్లాడారు. షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
పిచ్చోడికి ఓటేస్తే పిచ్చెక్కిస్తాడు
మాది ఫ్యాక్షనిస్టు కుటుంబమని బాలకృష్ణ ఆరోపిస్తున్నారు. మీ బావ చంద్రబాబు మనుషులు మా సొంత అబ్బ(తాత)నే హత్యచేశారు. హత్యకు హత్య పరిష్కారం కాదనే భావనతో మా తాతను హత్య చేసిన వారిని శిక్షించే బాధ్యతను దేవుడి చేతిలో పెట్టిన కుటుంబం మాది.మద్యం మత్తులో అన్నం పెట్టిన నిర్మాతపైనే ఆరు రౌండ్లు కాల్పులు జరిపి.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మతి స్థిమితం లేదని సర్టిఫికెట్ తెచ్చుకుని కేసు నుంచి తప్పించుకున్న ఘనుడు బాలకృష్ణ. ఆ పిచ్చోడు ప్రజాసేవ చేస్తానంటూ ఎన్నికల్లో నిలబడుతున్నాడు. అసలు మతిస్థిమితంలేని ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? వారిని ఓట్లేసి గెలిపిస్తే.. ప్రజలకు కూడా పిచ్చెక్కిస్తారు.
నాయకుడికి కష్టం విలువ తెలిసుండాలి... అప్పుడే ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించాలన్న తపన పుడుతుంది. నాయకుడికి ఆకలి రుచి తెలిసుండాలి... అప్పుడే ప్రజల ఆకలి తీర్చే మనసు పుడుతుంది. నాయకుడికి కన్నీటి విలువ తెలిసుండాలి... అప్పుడే ప్రజల కన్నీళ్లు తుడవగలరు. నాయకుడు పదవుల నుంచి కాదు.. ప్రజల్లోంచి పుట్టాలి. చంద్రబాబు, బాలకృష్ణ ఏనాడైనా ప్రజలకోసం పోరాటం చేశారా? ప్రజల కష్టాలేంటో వాళ్లకు తెలుసా?
ఆదర్శ ముఖ్యమంత్రి దివంగత వైఎస్..
వైఎస్సార్ అనే ఒక్కపదం రాష్ట్ర గతినే మార్చేసింది. రాజకీయాలకే కొత్త అర్థం చెప్పింది. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చూపింది. సంక్షేమ రాజ్యం ఎలా ఉండాలో చూపించింది. మహానేత వైఎస్సార్ పాలనలో విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, పేదలు.. అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందారు. ఐదేళ్ల పాలనలో ఒక్కపైసా అంటే ఒక్క పైసా పన్నులు పెంచకుండా.. చార్జీలు పెంచకుండా అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి.. ప్రపంచంలోనే రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో 16లక్షల మందికే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్‌లు ఇచ్చేవారు. కానీ వైఎస్ సీఎం అయ్యాక 71 లక్షల మందికి పెన్షన్‌లు ఇచ్చారు. వైఎస్ హయాంలో దేశంలో ఐదేళ్లలో 47లక్షల ఇళ్లు కట్టిస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల ఇళ్లు కట్టించారు.
పేదరికంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే ధ్యేయంతో లక్షలాదిమంది నిరుపేదలను ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంసీఏ, ఎంబీఏ వంటి చదువులు వైఎస్ ఉచితంగా చదివించారు. ఇప్పుడు ఆ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలతో కలిసి హాయిగా జీవిస్తున్నారు.
పేదవారికి కార్పొరేటు వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతోనే వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారు. లక్షలాది మంది పేదలకు ఉచితంగా కార్పొరేటు వైద్యాన్ని అందించారు. ఫోన్ చేసిన 20 నిముషాల్లోగా 108 వచ్చేది.
వైఎస్ వెళ్లిపోవడం రాష్ట్రానికి శాపం..
వైఎస్ మరణం రాష్ట్రానికి శాపం. ఆయన వెళ్లిపోయాక సీల్డ్ కవర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఊడిపడ్డాడు.. వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను నీరుగార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. విద్యుత్ చార్జీలు, సర్‌చార్జీల రూపంలో రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. ప్రజా వ్యతిరేక దుర్మార్గపు పాలన సాగిస్తోన్న ప్రభుత్వంపై విపక్షాలు అన్నీ ఒక్కటై అవిశ్వాస తీర్మానం పెడితే.. చంద్రబాబు విప్‌జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలబడ్డారు. ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే చంద్రబాబు వారి తరఫున ఒక్క పోరాటమూ చేయలేదు. ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్పిప్రజలతో ఓట్లేయించుకోవడం.. ఆ తర్వాత మోసం చేయడం చంద్రబాబుకు రివాజు.