జనం బాగోగులే జగనన్నకు ముఖ్యం
వైఎస్సార్ జనభేరి సభల్లో షర్మిల
అవకాశమిస్తే మీకోసం జగనన్న జీవితాన్నే ధారపోస్తారు
ఓట్లకోసం చంద్రబాబు ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్నారు
వైఎస్ అమలు చేసినయ పథకాలన్నీ తానూ అమలు చేస్తానంటున్నారు
ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే.. ఎన్నటికీ పులి కాలేదు
,కడప/ తిరుపతి: ‘‘రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా రైతుల కోసం, విద్యార్థుల కోసం, చేనేతల కోసం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం పోరాటం చేసింది వైఎస్సార్‌సీపీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. జనం బాగోగులే జగనన్నకు ముఖ్యం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను సమర్థంగా అమలు చేయగలిగే సత్తా ఒక్క జగనన్నకు మాత్రమే ఉంది. ఒక్క అవకాశం ఇస్తే.. మీ సంక్షేమం కోసం తన జీవితాన్నే అంకితమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐదు సంతకాలతో రాష్ట్రం దిశ, దశ మార్చి చూపిస్తాడు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలిపారు. ‘‘మరోవైపు చంద్రబాబు ప్రజావ్యతిరేక కాంగ్రెస్ సర్కారుకు అండగా నిలిచారు. కాలర్ పట్టుకుని నిలదీయడం మరచి భుజాన ఎత్తుకుని మోశారు. విప్ జారీ చేసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కాపాడారు.
ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏవేవో చేస్తానంటూ అడ్డగోలుగా వాగ్దానాలు చేసేస్తున్నారు.అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉచిత కరెంటు ఇస్తామని చెబితే ఈ చంద్రబాబు కరె ంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని హేళన చేశాడు. ఈరోజు నిస్సిగ్గుగా అదే వాగ్దానం, అదే ఉచిత కరెంటు నేనూ ఇస్తానని చెబుతున్నాడు. రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్ ఇస్తే.. చంద్రబాబు నేను కూడా ఉచితంగా విద్యనందిస్తానంటున్నాడు. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పెడితే... ఇప్పుడు చంద్రబాబు నేను కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తానంటున్నాడు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా... నక్కనక్కే... పులి పులే’’ అని దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వాగ్దానాలు చేయడం... వాటిని మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి రాష్ట్రాన్ని కొబ్బరి ముక్కల్లా విడగొట్టడానికి చంద్రబాబు ఇచ్చిన లేఖే కారణమని విమర్శించారు.
వైఎస్సార్ జనభేరిలో భాగంగా ఆమె సోమవారం వైఎస్సార్‌జిల్లా రాజంపేట, సుండుపల్లె, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలలో ప్రసంగించారు. రాజంపేట పార్లమెంటు అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథరెడ్డిలతో కలిసి రాజంపేట, సుండుపల్లెలో రోడ్‌షో నిర్వహించారు. శ్రీకాళహస్తి సభలో ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.