జనభేరి సక్సెస్
సాక్షి, నెల్లూరు : ‘దొరా మారాజన్న బిడ్డవు నువ్వు. ఈ దారిన పోతుండవని తెలిసి నిన్ను చూడాలని పొద్దున్నుండీ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తాండం. బస్సు ఆపక పోయింటే దానికి అడ్డంగా పడుకుని అయినా నిలబెట్టి నిన్ను చూసేవాళ్లం. కడుపు నిండింది స్వామీ. మీ నాయనకు మా గిరిజనులంటే పాణం. నువ్వుకూడా మమ్మల్ని అట్టే చూసుకోవాల’ అంటూ 70 ఏళ్లకు పైబడిన గిరిజన మహిళ పోలమ్మ నెల్లూరు,ప్రకాశం సరిహద్దులోని వరికుంటపాడు గిరిజన కాలనీవద్ద అర్ధరాత్రి జగన్‌ను ఆప్యాయంగా తడిమి ఉబ్బి తబ్బిబ్బయింది. గిరిజనుల ఆప్యాయతకు జగన్ కరిగి పోయారు.
అందరినీ పేరుపేరునా పలకరించారు. ఇదివేలకు వేలు డబ్బులిస్తేనో, అరేంజ్ చేస్తేనో గిరిజన మహిళ నోటి నుంచి వచ్చిన మాటలు కాదు. వైఎస్సార్ కుటుంబంపైన ఉన్న ప్రేమానురాగాలతో రాజన్న బిడ్డను అతిదగ్గరగా చూసిన ఆనందంలో గుండెలోతుల నుంచి ఎగదన్నుక వచ్చిన మాటలు. జగన్ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అర్ధరాత్రి వరకూ జగన్‌ను చూసేందుకు వేలాదిమంది మహిళలు, చిన్నపిల్లు సైతం నిద్ర వదలి రోడ్లవెంట ఎదురు చూపులు చేశారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శని,ఆదివారాల్లో జిల్లాలోని వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారానికి ఘనస్వాగతం లభించింది. తొలిరోజు వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరులలో సభ,రోడ్‌షోలు జరిగాయి. రెండోరోజు ఆత్మకూరులో సభ,అనంతరం రోడ్‌షో, ఉదయగిరి నియోజక వర్గంలో రోడ్‌షో, వింజమూరులో జరిగిన సభలో జగన్ పాల్గొన్నారు.
రోడ్‌షోలకు అపూర్వ స్పందన లభించింది. గ్రామగ్రామాన జగన్‌కు జనం నీరాజనాలు పలికారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు అన్న తేడా లేకుండా జనం రోడ్లపై బారులుదీరారు. మండే ఎండలను సైతం లెక్కచేయక గంటల తరబడి జగన్ కోసం ఎదురు చూశారు. జగన్‌కు మంగళహారతులతో స్వాగతం పలికారు. కొందరు బూడిద గుమ్మడికాయలతో జగన్‌కు దిష్టితీసి అభిమానాన్ని చాటారు. జనాన్ని చూసిన జగన్ అడుగడుగునా కాన్వాయ్ ఆపి కిందకు దిగి వచ్చి అందరినీ పేరుపేరునా పలకరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి రాజన్న రాజ్యం తెచ్చుకుంటామంటూ జగన్‌ను ఆశీర్వదించారు.
రాపూరు, ఆత్మకూరు, వింజమూరు సభలకు జనం పోటెత్తారు. జగన్ ప్రసంగం జనాన్ని ఉత్తేజితులను చేసింది. రైతుల కోసం ప్రత్యేకనిధి, మహిళలకు డ్వాక్రా రుణాలు రద్దు, విద్యార్థులకు ఉచిత విద్య, పేదలకు ఉచిత వైద్యం, తదితర పథకాలను జగన్ వివరించినపుడు జనం హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానంటూ జగన్ హామీలు ఇవ్వడంతో జనం మరింత సంతోషించారు.
తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినప్పుడు జనం బాబు పాలనలో అష్టకష్టాలు పడ్డామంటూ కేకలు వేశారు. చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తంగా జిల్లాలో జగన్ రెండు రోజులు ఎన్నికల ప్రచారం విజయవంతమైంది. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టించింది.