
పుంగనూరులో టీడీపీ ఘోర పరాజయం
పుంగనూరు, న్యూస్‌లైన్: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బ కు వెంకటరమణరాజు కుటుంబం చతి కిలపడింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణరాజు సోదరుడు రామక్రిష్ణంరాజు, ఆయన సతీమణి చంద్రకళ కౌన్సిలర్లుగా ఓడిపోయారు. చంద్రకళను టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా నిలపాల ని వెంకటరమణరాజు కలలుకన్నారు. ఆయన ఆశలు నెరవేరకపోగా ఆమె కౌన్సిలర్‌గా కూడా విజయం సాధించలేకపోయారు.
పట్టణంలోని 24వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇబ్రహీం చేతిలో రామక్రిష్ణంరాజు 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన సతీమణి చంద్రకళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లలిత చేతిలో 266 ఓట్ల తేడాతో ఓటమి పాల య్యారు. అలాగే పట్టణంలో ప్రముఖ నేతలుగా ఉన్న మూడవ వార్డు అభ్యర్థి చనకంటి సాంబమూర్తి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎండి.రహంతుల్లా చేతిలో 334 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 9వ వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆవుల అమరేంద్ర చేతిలో టీడీపీ నాయకుడు కేశవమూర్తి సోదరుడు క్రిష్ణమూర్తి 198 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.