రోజూ మిల్క్‌ సెంటరే | Rajahmundry Rose Milk is in demand from Visakhapatnam to Hyderabad | Sakshi
Sakshi News home page

రోజూ మిల్క్‌ సెంటరే

May 17 2019 11:42 PM | Updated on May 18 2019 12:05 AM

1 - Sakshi

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి మీదుగా గలగల పారే గోదావరి మీదుగా రాజమండ్రి చేరుకున్నవారు, మెయిన్‌ రోడ్‌లోకి ప్రవేశిస్తారు. నల్లమందు సందు చివరగా ఉన్న కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ని అనుకుని చిన్న షాపు కనిపిస్తుంది. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం  చేతుల్లో రోజ్‌మిల్క్, సేమ్యా, కోవాలతో తయారయిన గ్లాసులు కనువిందు... కాదు కాదు... నోటికి విందు చేస్తుంటాయి. ఎక్కడెక్కడ నుంచో షాపింగుకి వచ్చినవారు తమ లిస్టులో విధిగా రోజ్‌మిల్క్‌ను చేర్చుతారు. ఒక్క గ్లాసుడు సేవించగానే షాపింగ్‌ అలసట పోయిందనుకుంటారు.

ఇదీ కథ...
గుబ్బా సింహాచలం రాజమండ్రి వాస్తవ్యులు. 1950 నాటికి రోజ్‌ మిల్క్‌ అంటే రాజమండ్రిలోనే కాదు, రాష్ట్రంలోనే ఎవరికీ తెలియదు. మంచి ప్రమాణాలతో కూడిన రోజ్‌ మిల్క్‌ తయారు చేసి, వినియోగదారులకు నిత్య విందు అందించాలన్న అభిలాష కలిగింది ఆయనకు.  పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న సింహాచలం నాటిన మొక్క ఇంతై, ఇంతింతై, మరియు తానంతై అన్నట్లుగా రోజ్‌ మిల్క్‌ వ్యాపారం వృద్ధి చెందింది. మూడు తరాలుగా ఆయన వారసులకు కల్పవృక్షంగా నిలబడుతోంది.

నగరవాసులకు హాట్‌ ఫ్యావరేట్‌...
కూల్‌ డ్రింక్‌ అనగానే కేవలం వేసవిలో మాత్రమే తీసుకునే పానీయం అనుకుంటారు. ఇక్కడకు వచ్చేవారికి ఋతువులు, కాలాలతో పని లేదు. ఏడాది పొడవునా ఈ ‘రోజ్‌ మిల్క్‌’ ప్రజలకు హాట్‌ ఫ్యావరేట్‌గానే ఉంటుంది. నిత్యం ఈ దుకాణం ముందు జనం గుంపులుగా చేరి, రోజ్‌మిల్క్‌ సేవించడం సర్వసాధారణం. 

రెండో తరం...
గుబ్బా సింహాచలం తరువాత, 1982 నుంచి ఆయన కుమారులు రామచంద్రరావు, శ్రీనివాస్‌లు ఈ వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు మూడో తరానికి చెందిన రామచంద్రరావు కుమారులు రిషిక్, వంశీలు కూడా ఈ వృత్తిలోనే స్థిరపడ్డారు.

ఇదే విజయ రహస్యం...
రుచికరమైన రోజ్‌ మిల్క్‌ కోసం వీరు స్వంత డెయిరీని నిర్వహిస్తున్నారు. కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలను మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే అంత రుచి. ఈ పాలలో బాదం, సుగంధి (చలువ కోసం) కలుపుతారు. శుద్ధిచేసిన నీటితో తయారు చేసిన ఐస్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ రోజ్‌మిల్క్‌ను ఒక్కసారి రుచి చూస్తే, ఇక జన్మలో ఎవరూ వదిలిపెట్టరు. డయాబెటిక్‌ వారి కోసం ప్రత్యేకంగా సుగర్‌ ఫ్రీ రోజ్‌ మిల్క్‌ను తయారు చేస్తూ, వారిక్కూడా రుచి అందిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎసెన్స్‌ సీసాలకు డిమాండ్‌...
రాజమండ్రి రోజ్‌ మిల్క్‌కు విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌ వరకు డిమాండ్‌ ఉంది. రాజమండ్రి రోజ్‌మిల్క్‌కు మాత్రం ఎక్కడా బ్రాంచీలు లేవు.

ఎందరో సెలబ్రిటీలకు ఎంతో ఇష్టమైనది..
‘దివిసీమ ఉప్పెన బాధితుల కోసం విరాళాలు సేకరించిన సమయంలో నాటి అగ్రనటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు నా చేతితో ఈ పానీయాన్ని అందించాను. ఇది నాకు గర్వకారణం. దివంగత ముఖ్యమంత్రి వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా, బూరుగుపూడి వచ్చినప్పుడు ఈ పానీయాన్ని అందించాను. ఆ సమయంలో ఆయన కొద్దిపాటి అస్వస్థులుగా ఉన్నారు.

ఈ రోజ్‌మిల్క్‌ను ఆయన ఎంతగానో ఇష్టపడ్డారు. వైయస్సార్‌ పార్టీ అధ్యక్షుడు వై.యస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల పాదయాత్రలో ధవళేశ్వరం వచ్చినప్పుడు, రోజ్‌ మిల్క్‌ను పంపాను. జమున, ఆలీ, అనంత్, రవితేజ, వినాయక్, రాజబాబు వంటి సినీ ప్రముఖులు మా రోజ్‌ మిల్క్‌ను రుచి చూశారు. ఏడు దశాబ్దాలుగా మా రోజ్‌ మిల్క్‌ను ఆస్వాదిస్తున్నావారూ ఉన్నారు. మాకు ఇంతకు మించిన తృప్తి వేరే ఏముంటుంది?
– గుబ్బా రామచంద్రరావు (సింహాచలం కుమారుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement