సిస్టర్‌ లినీ ప్రాణ తర్పణం! | 10 deaths confirmed in Kerala, symptoms suspected in 2 Karnataka patients | Sakshi
Sakshi News home page

సిస్టర్‌ లినీ ప్రాణ తర్పణం!

Published Wed, May 23 2018 12:03 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

10 deaths confirmed in Kerala, symptoms suspected in 2 Karnataka patients - Sakshi

లినీ పుత్తుస్సెరీ

నిపా వైరస్‌ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న కేరళ నర్సు అదే వైరస్‌ సోకి మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి  వృత్తి ధర్మం నిర్వర్తించిన సిస్టర్‌ లినీ పుత్తుస్సెరీకి అంజలి ఘటిస్తోంది. 

చనిపోయే ముందు లినీ (31) తన భర్తకు రాసిన ఉత్తరాన్ని బట్టి.. మరణానికి సిద్ధపడే, నర్సుగా ఆమె తన సేవలను కొనసాగించడానికి నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది!‘‘నేను నిన్ను మళ్లీ కలుసుకుంటానని అనుకోవడం లేదు. పిల్లలు జాగ్రత్త. నీతో పాటు గల్ఫ్‌ తీసుకెళ్లు. ఎవరికి వారుగా ఒంటరిగా ఉండకండి’’ అని ఉత్తరంలో రాసిన కొద్ది రోజులకే లినీ తన కుటుంబ సభ్యులందరినీ ఒంటరివారిని చేసి, మొన్న సోమవారం మృత్యువు ఒడిలోకి వాలిపోయింది.లినీతో కలిపి ఇప్పటి వరకు ఇండియాలో నిపా వైరస్‌ సోకి మృత్యువాత పడిన వారి సంఖ్య 10కి చేరింది. విషాదం ఏమిటంటే.. నిపా రోగులకు సేవలు అందించడానికి కోళికోడ్‌ దగ్గరి పెరంబ్రా ఆసుపత్రిలో నర్సుగా చేరిన లినీ కూడా రోగుల నుంచి ఆ వ్యాధి సోకి మరణించడం! లినీకి ఇద్దరు చిన్నపిల్లలు. భర్త గల్ఫ్‌లో ఉంటాడు.  ఆదివారంనాడు నిపా వైరస్‌తో కోళికోడ్‌లో ఇద్దరు, మలప్పురం జిల్లాలో నలుగురు మరణించడంతో అప్పటి వరకు సంభవించిన మూడు నిపా మరణాలతో కలిపి ఈ సంఖ్య తొమ్మిదికి చేరగా, పెరంబ్రా ఆసుపత్రిలో కొన్నాళ్లుగా నిపా రోగులకు సేవలు అందిస్తున్న లినీ మృతితో ఆ జాబితా పదికి చేరింది. నిపా వైరస్‌కు మనిషి నుంచి మనిషికి వ్యాపించే స్వభావం ఉండడంతో నర్సు లినీ మృతదేహాన్ని పెరువన్నముళి సమీపంలోని చెంబనోడా ప్రాంతంలో ఉన్న ఆమె స్వగ్రామానికి తరలించలేకపోయారు.

కుటుంబ సభ్యుల అనుమతితో కేరళ ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుని కోళికోడ్‌లోనే ఒక విద్యుత్‌ శ్మశానవాటికలో లినీ అంత్యక్రియల్ని నిర్వహించింది. లినీ జబ్బున పడిందన్న సంగతి తెలిసిన ఆమె భర్త సజీశ్‌ రెండు మూడు రోజుల క్రితమే కేరళ వచ్చాడు కానీ, వైద్యులు అతనిని లినీని కలవనివ్వలేదు. పిల్లలు సిద్ధార్థ్‌ (5), రితుల్‌ (2) కూడా అమ్మ ముద్దుకైనా నోచుకోలేదు. నిపా వైరస్‌తో చంగరోత్‌ ప్రాంతం నుంచి పెరంబ్రా ఆసుపత్రిలో చేరిన ఒక యువకుడికి మాత్రమే అతడి చివరి రోజులలో నర్సుగా లినీ ఆప్యాయత అందింది. ఆ తర్వాతి నుంచీ లినీలో ఆ జబ్బు లక్షణాలు కనిపించడం మొదలైంది. లినీకి కూడా ఈ వైరస్‌ సోకిందని నిర్ధారించుకున్న వెంటనే ఆమె భర్తకు వైద్యాధికారులు సమాచారం పంపించారు. అయితే అంతకంటే ముందే లినీ తన అంతిమ ఘడియల్ని పసిగట్టి భర్తకు ఉత్తరం రాశారు. నిపా వైరస్‌ నాలుగు నుంచి పద్దెనిమిది రోజుల వ్యవధిలో మానవదేహంలో వృద్ధి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు అతి సమీపంలో ఉండి సేవలు అందించిందన్న కనికరం కూడా లేకుండా లినీని కూడా ఒక మామూలు రోగిలానే మృత్యువు కబళించింది. 

లినీ అంత్యక్రియలకు కేరళ పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ హాజరయ్యారు. లినీ తన భర్తకు రాసిన ఉత్తరాన్ని ఆయనే తన ఫేస్‌బుక్‌లో పెట్టారు. లినీ మొదట కోళికోడ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. గత సెప్టెంబరులో పెరంబ్రా తాలూకా ఆసుపత్రి కాంట్రాక్టుపై ఆమెను నియమించుకుంది. లినీ మరణానికి సంతాపంగా సోమవారం నాడు పెరంబ్రా ఆసుపత్రి సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ‘యునైటెడ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌’ లినీ త్యాగనిరతిని ఆవేదనతో స్మరించుకుంది.

నిద్రలేచిన మహమ్మారి
నిపా వైరస్‌ (Nipah Virus) 
►కొత్తవ్యాధి కాదు కానీ, కొత్తగా తలెత్తిన వ్యాధి.
►జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.
► ముఖ్యంగా పందుల నుంచి, గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుంది. 
►ప్రస్తుతం నిపా భయం ఇండియాను ఒణికిస్తోంది.
►దీనికి మందులు గానీ, వ్యాక్సిన్‌లు గానీ లేవు. 
►జ్వరం, తలనొప్పి, తల తూలడం, వాంతులు.. ప్రధాన లక్షణాలు.
►వ్యాధి తీవ్రం అయినప్పుడు శ్వాస కష్టం అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement