
వాంకోవర్ విజేత మన్ కౌర్ (ఫైల్ ఫొటో)
కెనడాలోని వాంకోవర్ నగరంలో వంద మీటర్ల రన్నింగ్ ట్రాక్ అది. ఒకటిన్నర నిమిషంలో లక్ష్యాన్ని పూర్తి చేశారు మన్ కౌర్. తోటి అథ్లెట్లు అందరూ చప్పట్లతో ఆమెను అభినందించారు. విశేషం ఏంటంటే.. ఆమెతో పోటీ పడిన వాళ్లు డెబ్బై, ఎనభైలలో ఉన్నారు. మన్ కౌర్ ఒక్కరే నూరేళ్లు దాటినావిడ! అదీ ఆ ప్రత్యర్థుల ఆనందం. వందేళ్లు దాటిన పెద్దావిడ తమతో పోటీ పడటమే పెద్ద విజయం అనుకుంటే, తమ కంటే ముందే లక్ష్యాన్ని చేరడం వారిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ఇక మన్ కౌర్‌ను అభినందిస్తూ చప్పట్లు కొట్టిన వాళ్లలో మన్ కౌర్ తనయుడు గురుదేవ్ సింగ్ కూడా ఉన్నాడు. అప్పటికి అతడి వయసు 78 ఏళ్లు. వాంకోవర్‌లో 2016లో జరిగిన ‘అమెరికాస్ మాస్టర్స్ గేమ్స్’లో వంద మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు మన్ కౌర్. ఇప్పుడు ఆమె వయసు 102 ఏళ్లు.
పరుగొక్కటే కాదు కౌర్ ప్రతిభ
మన్ కౌర్‌కి అది తొలి విజయం కాదు. అంతకు ముందు.. రెండు వందల మీటర్ల పరుగు, షాట్ పుట్, జావెలిన్ త్రో, స్కైవాక్‌లలో కూడా పతకాలను సొంతం చేసుకున్న చరిత్ర ఆమెది. ‘ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్’, ‘ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్’ మొదలైన 20 పతకాలను అందుకున్నారు. మనదేశంతో పాటు న్యూజిలాండ్, అమెరికా, కెనడా, తైవాన్‌లలో జరిగిన అథ్లెటిక్స్‌లో పాల్గొన్నారు. గత ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆమె పేరు నమోదైంది. ఈ ఏడాది కూడా ‘వైశాఖి 5కె రన్’లో పాల్గొని, అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు.
తల్లి అసలు స్వీట్లే తినరు
వయసు పెరిగే కొద్దీ.. ముఖ్యంగా మహిళలు, యాభై దాటినప్పటి నుంచి మరింత చురుగ్గా, ఆడుతూ పాడుతూ ఉండడానికి ప్రయత్నించాలని అంటారు మన్ కౌర్. రోజూ నడక, పరుగెత్తడంతోపాటు ఆహారం తీసుకోవడంలో క్రమశిక్షణ పాటించాలంటారు. కౌర్ దినచర్య కూడా చాలా క్రమశిక్షణతో ఉంటుంది. రోజూ సాయంత్రం తప్పనిసరిగా కొంత దూరం రన్నింగ్ చేస్తారు. తల్లీకొడుకులు రోజూ ఉదయాన్నే సోయా పాల మిల్క్‌షేక్ తాగుతారు. పగలు మొలకెత్తిన గోధుమల పిండితో చేసిన చపాతీలు ఆరు, గింజలు, పెరుగు, తాజా పండ్లు, పండ్ల రసాలు, గోధుమ గడ్డి రసం, రాత్రికి మళ్లీ సోయా పాలు తీసుకుంటారు. కొడుకు గురు దేవ్ ఎప్పుడైనా స్వీట్లు, నూనెలో వేయించిన ఆహారం తింటాడేమో కానీ మన్ కౌర్ వాటి జోలికి వెళ్లరు. అమెరికా పౌరసత్వం ఉన్న మన్ కౌర్, గురుదేవ్ సింగ్‌లు ఏడాదిలో కొన్ని నెలలు సొంతూరు చండీగఢ్‌లో ఉండిపోతుంటారు. తొమ్మిదేళ్లుగా తల్లీకొడుకులిద్దరూ ఎక్కడ పోటీలు జరిగినా తప్పకుండా హాజరవుతుంటారు. కలిసి పరుగెత్తుతుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పెయిన్‌లో జరిగే స్ప్రింట్ రన్‌లో కూడా ఇద్దరూ పాల్గొనబోతున్నారు.
నడవలేని వయసులో క్రీడల్లోకి!
మన్ కౌర్ క్రీడా జీవితం ఆమెకి 93వ ఏట మొదలైంది! కొడుకు గురుదేవ్ ఒక రోజు ఆమెతో ‘‘అమ్మా! నీకు వయసు రీత్యా వచ్చే మోకాళ్ల నొప్పులు, గుండె సమస్యల్లేవు. ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవు. నాతోపాటు రన్నింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు కదా’ అన్నాడు. అలా కొడుకుతోపాటు ట్రాక్ మీద అడుగుపెట్టారు మన్ కౌర్. తొలి ప్రయత్నంగా నాలుగు వందల మీటర్ల లక్ష్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇక ఆమె వెనుదిరిగి చూడనేలేదు.
Comments
Please login to add a commentAdd a comment