ఆ బస్సులో 1200 మంది ప్రయాణించొచ్చు
రోడ్డుకు మధ్యలో వేసిన పిల్లర్ల సాయంతో పైనుంచి మెట్రోట్రైన్‌లు వెళ్లడం మనం చూశాం. కానీ పిల్లర్ల సాయం లేకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ట్రాక్ సాయంతో ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ (టీఈబీ) వెళుతుంది. టీఈబీని సొంత టెక్నాలజీతో చైనా ఇంజినీర్లు రూపొందించారు. రోడ్డుపై ఉన్న వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ ఎలివేటెడ్ బస్ ప్రయాణిస్తుంది. 19వ చైనా బీజింగ్ అంతర్జాతీయ హైటెక్-ఎక్స్‌పోలో దీని బ్లూప్రింట్‌ను ప్రదర్శించారు. టీఈబీలో ప్రయాణికులకోసం పైభాగంలో ప్రత్యేకంగా ఓ కంపార్ట్‌మెంట్ ఉంటుంది. కింది భాగాన రోడ్డుపై వెళ్లే వాహనాలు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్‌ను రోడ్డును పూర్తి స్థాయిలో వాడుకునే అవకాశం ఉంటుంది.
‘ఎలివేటెడ్ బస్‌లో 1200 మంది ప్రయాణించే అవకాశం ఉంది. మెట్రో రైలులో ఉండే అన్ని సదుపాయాలు ఇందులో ఉంటాయి. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు, మెట్రో నిర్మాణానికి అయ్యే ఖర్చులో కేవలం ఐదోవంతు మాత్రమే అవుతుంది. దీని నిర్మాణ పనులు కూడా వేగంగా చేయొచ్చు’ అని టీఈబీ ప్రాజెక్ట్ ఇంచార్జ్ ఇంజనీర్ జిమింగ్ అంటున్నారు. ఉత్తర చైనాలోని క్విన్ హువాంగడో సిటీలో 2016 ఏడాది చివరి కల్లా ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ ట్రయల్ రన్‌ను చేసి పని తీరును చూడనున్నారు.