పొగాకు...ఆరోగ్యాన్ని పొడిచే టొబాకు | 25 percentage to 30 percentage of cancers are caused by tobacco alone | Sakshi
Sakshi News home page

పొగాకు...ఆరోగ్యాన్ని పొడిచే టొబాకు

Published Fri, May 31 2019 2:35 AM | Last Updated on Fri, May 31 2019 5:13 AM

25 percentage to 30 percentage of cancers are caused by tobacco alone - Sakshi

భూతాల గురించి కథల్లో చదువుతుంటాం. హారర్‌ సినిమాల్లో చూస్తుంటాం. వాటిలో భూతాలూ, దెయ్యాలూ పొగ రూపంలో ఉంటాయి. వాస్తవానికి ఆ దెయ్యాలూ, భూతాలన్నీ కల్పితం. కానీ ఈ లోకంలో నిజంగానే పొగరూపంలో ఉండే భూతప్రేతపిశాచాలున్నాయి. అవే... సిగరెట్లు, బీడీలు, చుట్టలు, హుక్కాలు. మరికొన్ని ఆరోగ్యాన్ని పీల్చిపిప్పిచేసే పిశాచాలు మనం తినేందుకు వీలుగా పాన్‌మసాలా డబ్బాల్లో దాగుంటాయి. ఇంకొన్ని పీల్చే నశ్యం డబ్బాల్లో ఉంటాయి.ఈ ఉత్పాదనలన్నింట్లోనూ వాడే ఆకే ‘పొగాకు’. ఆ కల్పిత భూతాలున్నాయో లేదో, అవి హాని చేస్తాయో లేదో తెలియదు.

కానీ... ఈ పొగభూతాలు మాత్రం నిజంగానే ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఆర్థికంగానూ నష్టం చేస్తాయి. నేడు (ఈ నెల 31న) ‘వరల్డ్‌ నో టొబాకో డే’. ఈ సందర్భంగా పొగాకు గురించీ, అది చేసే హాని గురించీ తెలుసుకుందాం. ఆ అవగాహనతో ఎన్నో రకాల ప్రమాదకరమైన జబ్బులతోపాటు అనేక రకాల క్యాన్సర్ల నుంచి విముక్తమయ్యేందుకు గాను... బోలెడన్ని ఆసక్తికరమైన అంశాలను మీ ముందుకు తెస్తున్నాం.చాలా ఆకులు చాలా మేళ్లు చేస్తాయి. మామిడాకులు మంగళప్రదం. శుభకార్యాలకు తోరణాలుగా కడతాం. తాటాకులూ, కొబ్బరాకులూ అంతే. పెళ్లిళ్లకు పందిళ్లుగా వేస్తాం. అరిటాకులను వేడుకలకూ, వేదికలకూ ప్రవేశమార్గాల ఆర్చీలకు ఇరువైపులా కడతాం.

అరిటాకుల్లో భోజనాలు ఆరగిస్తాం. బాదం ఆకుల్లో చిరుతిండ్లూ పెట్టుకుని తింటాం. తామరాకుల్లో ఫలహారాలు పెట్టుకుని భోంచేస్తాం. ఇక విస్తరాకులు సరేసరి.ఇంతా చేసి పొగాకు ఏమాత్రం ఆకర్షకరంగా ఉండదు. దాని వాసన వెగటు. పైగా విపరీతమైన ఘాటు. పైన కనువిందు చేసే ఎన్నో ఆకుల గురించి చెప్పుకున్నాం కదా. పైగా అన్నీ ఆరోగ్యకరమే. అయినా దేన్నీ మన ఒంట్లోకి ఆహ్వానించం. కానీ... అదేమిటో... అల్లంతదూరం నుంచి ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేసే ఆ పొగాకును మాత్రం మనిషి కోరి కోరి ఆహ్వానిస్తాడు. నోట్లోకి తీసుకుంటాడు. ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుంటాడు. పేరుకు పొగాకు... కానీ ఆరోగ్యానికి ‘పగాకు’ అది. టొబాకో కాదది... మీ హెల్త్‌లోకి కసుక్కున దిగే... టొ‘బాకు’!

ఇదీ పొగాకు విస్తృతి!
మీకు తెలుసా...? ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తంలో 1.1 బిలియన్ల మంది (110 కోట్ల మంది) సిగరెట్లు తాగేవాళ్లున్నారు. వీళ్లు  ప్రతిరోజూ సిగరెట్లు తాగుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం కోటి సిగరెట్లు అమ్ముడవుతుంటాయి. పొగరాయుళ్లు ప్రతిరోజూ 15 బిలియన్లు (1500 కోట్ల) సిగరెట్లను తగలేస్తూ, ఈ పొగధారావ్రతాన్ని అలా కొనసాగి...స్తూ ఉంటున్నారు. ఇదే ధోరణి గనక కొనసాగితే... డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల అంచనాల ప్రకారం 2025 నాటికి ఈ పొగరాయుళ్ల సంఖ్య 1.6 బిలియన్లు (160 కోట్లకు) పెరుగుతుంది. ఇది కేవలం ఒక్క పొగతాగేవారి సంఖ్య మాత్రమే. దీనికి తోడు గుట్కా, ఖైనీ వంటి పొగాకు నమిలే అలవాట్లు ఉన్నవారూ, పొగాకుని నశ్యంలా పీల్చేవారి సంఖ్యనూ దీనికి కలుపుకుంటే... పొగాకు వినియోగించే వారి సంఖ్య ఇంకా చాలా ఎక్కువ.అందుకే ఇంతటి విస్తృతమైన పొగాకు వినియోగంతో...  కేవలం ఈ దురలవాటు కారణంగానే  ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 లక్షల మంది చనిపోతున్నారు.

అంతేకాదు... ప్రపంచంలో చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం స్మోకింగ్‌ తాలుకు దుష్ప్రభావాల వల్లనే మరణిస్తున్నారన్నది నమ్మలేని పచ్చి వాస్తవం. స్వయంకృత అపరాధంగా వాళ్లు ఎలాగూ చచ్చిపోతున్నారు సరే... పక్కవాళ్లు తాగకపోయినా, ఈ పొగరాయుళ్ల కారణంగా ఒక అంచనా ప్రకారం ఏడాదికి దాదాపు 8.9 లక్షల మంది ఎలాంటి అలవాటు లేకపోయినా మరణిస్తున్నారు. వాళ్లల్లో ఎక్కువ మంది కుటుంబసభ్యులైన మహిళలూ, చిన్నారులే. అంటే ఇదే మరోరకంగా చెప్పాలంటే... స్మోకర్లు సిగరెట్‌ అనే ఆయుధంతో ఏటా దాదాపు 9 లక్షల మంది అమాయకులను హత్య చేస్తున్నారు. తమ పాపమేమీ లేకపోయినా వీళ్లు అమాయకంగా మొహమాటానికి స్మోకర్లకు బలవుతున్నారు. ఇలా పొగకమ్మేసినట్టే ఈ దురలవాటూ లోకాన్ని కమ్మేసింది.

పొగాకు నిండా విషాలే!
సిగరెట్‌ పొడవు దాదాపు నాలుగు అంగుళాలు మాత్రమే కదా. కానీ దాన్లో ఉండే హానికరమైన రసాయనాల సంఖ్య మాత్రం 4,800. మళ్లీ అందులోని 50 నుంచి 69 రసాయనాలు క్యాన్సర్‌ను తప్పకుండా కలగజేసేవే! వీటినే నిపుణులు గ్రూప్‌–1 కార్సినోజెన్స్‌ అని వర్గీకరించారు.మనం ఒక్క కాలకూట విషం గురించి భయం భయంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ పొగాకులో ఎన్ని రకాల కాలకూట విషాలున్నాయో తెలుసా? ఆర్సినిక్, బెంజీన్, కార్బన్‌మోనాక్సైడ్, హైడ్రోజన్‌ సయనైడ్, పొలోనియమ్‌ 210... ఇలాంటి ఎన్నో ఎన్నో విషాలు సిగరెట్‌లో ఉంటాయి.

నికోటిన్‌ అనే పదార్థమూ ఉంటుంది. ఆర్సినిక్‌ అనేది ప్రపంచంలోనే చాలా వేగంగా పనిచేసే శక్తిమంతమైన విషం. పైగా పైన పేర్కొన్న వాటిల్లో ఏ ఒక్కదాన్నైనా కాస్తంత ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనిషి తక్షణం చనిపోతాడు. ఒక అధ్యయనం ప్రకారం ఐదు సిగరెట్లలోని నికోటిన్‌ చాలు మనిషిని చంపేయడానికి! ఈ అధ్యయన వివరాలు ‘ఆర్కైవ్స్‌ ఆఫ్‌ టాక్సికాలజీ’లో నమోదై ఉన్నాయి కూడా.ఒకేసారి పెద్దసంఖ్యలో టోకున మనుషులను చంపేయడానికి రెండో ప్రపంచయుద్ధ సమయంలో హిట్లర్‌ హైడ్రోజన్‌ సయనైడ్‌ను (జెనోసైడల్‌ ఏజెంట్‌గా) ఉపయోగించాడట.

దాన్ని మనం స్వచ్ఛందంగా రోజూ సిగరెట్‌ రూపంలో తీసుకుంటూ ఉంటాం. అలాంటి విషాలను మనం రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉంటామని గుర్తుంచుకుంటే సిగరెట్‌ మానడం చాలా తేలిక. సిగరెట్లు ఎంత ప్రమాదకరమైనవో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఈ విషయమై మనం ఇంకాస్త తమాషా ఉదాహరణ చెప్పుకుందాం. ఆపిల్‌ కంప్యూటర్ల దగ్గర సిగరెట్లు తాగితే... ఆ సిస్టమ్‌లకు గ్యారంటీ ఉండదంటూ ఆ కంపెనీ వారంటీ నిబంధనల్లో పొందుపరచారు. అదీ సిగరెట్లకు ఉన్న అపకీర్తి!  

అలవాటయ్యేలా చేసే నికోటిన్‌!
పొగాకులోని నికోటిన్‌ అనే పదార్థం ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. ఫ్రెంచ్‌ జాతీయుడైన జీన్‌ నికోట్‌ అనే వ్యక్తి పేరుమీద నికోటిన్‌ అనే మాట ఆవిర్భవించింది. ఇతడు 1560లో మొదటిసారి ఫ్రాన్స్‌కు పొగాకును పరిచయం చేశాడు. అతడి పేరిటే పొగాకులోని హుషారునిస్తుందని పేరున్న ఆ విష పదార్థానికి నికోటిన్‌ అని పేరుపెట్టారు. నిజానికి మనం సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్‌ మెదడును చేరుతుంది.

మెదడులో కొన్ని రిసెప్టర్‌లు ఉంటాయి. నిజానికి మనమేమైనా సంతోషం కలిగే పనిచేసినప్పుడు అవి స్పందించి డోపమైన్‌ అనే రసాయనాన్ని వెలువడేలా చేస్తాయి. నికోటిన్‌ మన మెదడును చేరగానే ఈ రిసెప్టార్‌లు డోపమైన్‌ ద్వారా మనకు హాయిగా, రిలాక్స్‌డ్‌గా, సంతోషంగా ఉన్న భావనను కలగజేస్తాయి. దాంతో ఈ ఆనందాన్ని తరచూ పొందేందుకు ఆ పొగాకుకు అలవాటైపోతాం. మాటిమాటికీ డోపమైన్‌ను స్రవింపజేసేందుకు పొగాకును ఆశ్రయిస్తాం. అలా పొగాకు అలవాటైపోతుంది. ఈ నికోటిన్‌ వ్యసనం ఎంతో బలమైనది.

నికోటిన్‌ బానిసత్వం...ఎంతో బలీయం
నికోటిన్‌ మనిషిని ఎంతగా బానిసను చేసుకుంటుందో తెలుసుకునేందుకు రెండు ఉదాహరణలు చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌కు క్యాన్సర్‌ సోకింది. ఆ క్యాన్సర్‌ వల్ల అతడికి దాదాపు 30కి పైగా సర్జరీలు అయ్యాయి. దవడను, సైనస్‌నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్‌ మానేయలేదు.ఇంకా చెప్పుకోవాలంటే... హిండెన్‌ బర్గ్‌ అనేది ఒక జర్మన్‌ పాసెంజర్‌ ఎయిర్‌షిప్‌. మనందరికీ టైటానిక్‌ షిప్‌కు జరిగిన ప్రమాదం గురించే తెలుసు. కానీ ఇది ఆ స్థాయికి తగ్గని దుర్ఘటన. కాకపోతే అంతమంది చనిపోలేదంతే. హిండెన్‌బర్గ్‌ అనే ఈ పాసెంజర్‌ ఎయిర్‌షిప్‌ చాలా ప్రతిష్ఠాత్మకమైనది.

ఈ లాంగెస్ట్‌ క్లాస్‌ ఫ్లయింగ్‌ మెషిన్‌ వాడుక తర్వాత్తర్వాత అమిత ధనవంతుల ప్రయాణాలన్నీ ఇలాంటి ఎయిర్‌షిప్స్‌లోనే  జరుగుతాయనేది ఆ రోజుల్లో ఒక ఊహ. అయితే 1937 మే 3న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి బయలుదేరిన అది మే 6న యూఎస్‌ న్యూజెర్సీలోని మాంఛెస్టర్‌ టౌన్‌షిప్‌ దగ్గర దగ్ధమైపోయింది. చిన్న స్పార్క్‌ కారణంగా మొత్తం ఇంధనం అంటుకొని ప్రమాదం జరిగింది. దాంతో ఆ ఎయిర్‌షిప్‌లోని 97 మంది ప్రయాణికుల్లో 35 మంది  మరణించారు. ఈ ప్రమాదాన్ని టైటానిక్‌ ఆఫ్‌ స్కైస్‌ అంటారు. ఆ ఎయిర్‌షిప్‌లో 70 లక్షల క్యూబిక్‌ అడుగుల హైడ్రోజన్‌ ఇంధనం ఉంది.

చిన్నపాటి నిప్పు స్పార్క్‌ చాలు... అదంతా అంటుకుని తగలబడిపోవాడానికి. అంతటి ప్రమాదం ఉందని తెలిశాక కూడా... అంతమంది ప్రయాణం చేసే ఆ మెగాఎయిర్‌షిప్‌లోనూ ఒక స్మోకింగ్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకున్నారు పొగతాగడాన్ని అమితంగా ఇష్టపడే ఆనాటి  ప్రయాణికులు. ఆ ప్రమాదానికి ఎలక్ట్రిక్‌ స్పార్క్‌ వల్ల ఇంధనం మండిపోవడం కారణం కావచ్చని ఊహిస్తున్నా... పొగతాగే సమయంలోని నిప్పురవ్వ వల్లే జరిగిందని నిర్ధారణగా చెప్పలేకపోయినా... నిప్పు కణిక వల్ల తామంతా భస్మమైపోయేంతటి ప్రమాదం పొంచిఉన్నా కూడా ప్రయాణికులు స్మోకింగ్‌ రూమ్‌ను ఏర్పాటు చేసుకున్నారంటే... పొగతాగే అలవాటు ఎంతటి పెద్ద వ్యసనమో మనకు అర్థమవుతుంది.

ఒకటా రెండా... ఎన్నెన్నో జబ్బులు
దాదాపు 25% నుంచి 30% క్యాన్సర్లు కేవలం పొగాకు వల్లనే కలుగుతున్నాయి. వీటిల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువ. ఆ తర్వాత పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్లూ ఎక్కువగానే వస్తాయి. ఇక పొగాకు వినియోగం వల్ల స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు (కొలోన్‌), మలద్వార (కోలోరెక్టల్‌) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, క్లోమగ్రంథి క్యాన్సర్లు, మూత్రాశయ క్యాన్సర్లు చాలా ఎక్కువ. ఇక ప్రోస్టేట్‌(పౌరుషగ్రంథి) క్యాన్సర్‌కూ, పొగతాగడానికీ సంబంధాలు చాలా చాలా ఎక్కువ. బెంజీన్‌ అనే రసాయనం అక్యూట్‌ మైలాయిడ్‌ లుకేమియా (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్‌)ను కలగజేస్తుంది.

వీటితో పాటు గుండెజబ్బులు (కరొనరీ హార్ట్‌ డిసీజెస్‌), పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా ఒకటేమిటి... శరీరంలోని ప్రతి అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుందన్నది అతిశయోక్తి కాని వాస్తవం. ఇక మీకు తెలియని విషయం ఏమిటంటే... ప్రతి సిగరెట్‌లోనూ 20 శాతం చక్కెర ఉంటుంది. అందువల్ల సిగరెట్‌ తాగగానే ఒంట్లో చక్కెరపాళ్లు పెరుగుతాయి. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఇక డయాబెటిస్‌ ఒంట్లోని రోగనిరోధకతను దెబ్బతీస్తుందన్నది తెలిసిందే. దాంతో వరసగా క్యాన్సర మొదలు ఎన్నో వ్యాధులు, వాటివల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉంది.

పొగమానేస్తే ఎన్నో ప్రయోజనాలు...
పొగతాగడం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వెంటనే సమకూరడం మొదలవుతుంది. ఉదాహరణకు మీరు చివరి సిగరెట్‌ తాగిన 20 నిమిషాల్లో మీ గుండె వేగం తగ్గి, మళ్లీ దాని నార్మల్‌ వేగంతో కొట్టుకోవడం మొదలవుతుంది. 12 గంటల తర్వాత మీ కార్బన్‌మోనాక్సైడ్‌ మోతాదులు తగ్గడం ప్రారంభమవుతుంది. దాంతో రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గడం మొదలవుతుంది. మూడు నెలల్లో మీ ఊపిరితిత్తులు నార్మల్‌కు రావడానికి ఉద్యుక్తమవుతాయి. ఆ తర్వాత వాటి పనితీరు క్రమంగా నార్మల్‌కు వస్తుంటుంది. ఏడాది తర్వాత హార్ట్‌ఎటాక్‌ వచ్చే ముప్పు (రిస్క్‌) సగానికి తగ్గిపోతుంది. 15 ఏళ్లలో మీరంతా నార్మల్‌ అయిపోయి నాన్‌స్మోకర్‌లో ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో అలాంటి ప్రయోజనాలూ ఒకప్పటి మాజీస్మోకర్స్‌కూ కలుగుతాయి.

చాలామంది పొగ మానేయడానికి ఇష్టపడేవాళ్లే!
 వాస్తవానికి పొగతాగేవాళ్లలో 69 శాతం మంది ఇష్టం లేకుండానే పొగతాగుతుంటారట. ఎందుకంటే... వాళ్లెప్పటికప్పుడు తమ దురలవాటు సిగరెట్‌ మానాలని అనుకుంటూనే, తమకం ఆపుకోలేక మళ్లీ మళ్లీ సిగరెట్‌ ముట్టిస్తూ ఉంటారు. వీళ్లలో చాలామంది సోమవారం రోజున తమ సిగరెట్‌ అలవాటుకు స్వస్తిచెప్పాలనుకుంటారు. ఆదివారం సెలవు రోజున తమ మనసుతీరా సిగరెట్‌ తాగేసి, సోమవారం నుంచి ఆ అలవాటుకు గుడ్‌–బై చెప్పాలనుకుంటార్ట. కానీ వీళ్లలో చాలామంది మళ్లీ పొగభూతానికి లొంగిపోతారు.

ప్రపంచవ్యాప్తంగా అందరూ పొగతాగడం మానేశారనుకుందాం. ఇప్పుడున్న క్యాన్సర్‌ రోగుల సంఖ్యలో తక్షణం 30% కేసులు తగ్గుతాయి. క్రమంగా 50 శాతానికి పైగా క్యాన్సర్‌తో సంభవించే మరణాలూ తగ్గుతాయని ఒక అంచనా.

పొగాకుఉత్పాదనల కోసం అసహ్యకరమైన రంగు
పాంటోన్‌ 448–సి అనేది ఒక రంగు. ఇది ఒకరకమైన గోధుమరంగు వంటిది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు (ద అగ్లియెస్ట్‌ కలర్‌) అని అంటారు. ఈ రంగును చావును సూచించే రంగుగా చెబుతారు. జీఎఫ్‌కే అనే పరిశోధన సంస్థ ఈ రంగుమీద అనేకరకాల పరిశోధనలు చేశాక... ఈ అసహ్యకరమైన రంగును ‘పొగాకు ఉత్పదనలకు’ వాడితే బాగుంటుందని సూచించింది. అయితే ఇదేరంగును మరింత ఆకర్షణీయంగా చేసి సిగరెట్‌ పెట్టెలకు వాడుతుంటారు.

యూరప్‌ తొలి స్మోకర్‌కు ఏడేళ్ల జైలు!
యూరప్‌కు పొగాకును పరిచయం చేసిన మరొక వ్యక్తి రోడ్రిగో డి జెరెజ్‌. ఇతడు  అమెరికాను కొనుగొన్న కొలంబస్‌ నావికుల బృందంలోని సభ్యుడు. శాంటామారియా నౌక మీద ప్రయాణం చేస్తూ 1492లో వీళ్లు బహమాస్‌లోని శాన్‌సాల్వడార్‌ ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడి గౌనహని అనే తెగకు సంబంధించిన వారు పొగతాగడాన్ని చూశాడు రోడ్రిగో డి జెరేజ్‌. వారి నుంచి పొగతాగడం నేర్చుకున్నాడు.

యూరప్‌లోని స్వదేశానికి తిరిగి వచ్చాక మరికొంతమందికి కూడా అతడు స్మోకింగ్‌ అలవాటు చేశాడు. అప్పట్లో నోటినుంచి అలా పొగను వెలువరించడం అనేది ‘దెయ్యపు చర్య’ అనీ, దెయ్యాలు చేసే ఆ పని చేసినందుకు ‘స్పానిష్‌ ఇంక్విజిషన్‌’కు చెందిన అక్కడి మతపెద్దలు అతడికి ఏడేళ్లు కారాగార శిక్ష విధించారు. కానీ... ఏడేళ్ల తర్వాత అతడు విడుదలయ్యేనాటికి పొగతాగే అలవాటు యూరప్‌ అంతటా విస్తరించింది.

అది అపోహ మాత్రమే...
చాలామంది పొగతాగేవాళ్లు భోజనం చేశాక ఒక దమ్ము లాగితే... తిన్నది వేగంగా జీర్ణమవుతుందని అనుకుంటారు. తమ అనుభవం వల్ల ఆ అపోహనే వాస్తవంగా భ్రమిస్తుంటారు. కానీ నిజానికి సిగరెట్‌ జీర్ణప్రక్రియను చాలా ఆలస్యం చేస్తుంది. అరిగే ప్రక్రియ అతి నెమ్మదిగా కొనసాగేలా చూస్తుంది. ఎందుకంటే... సిగరెట్‌ తాగగానే తమ ఒంట్లోకి ప్రవేశించే విషాలను బయటకు తరమడానికి శరీర వ్యవస్థ ప్రాధాన్యం ఇస్తుంది.

ఆ విషాలు మెదడును చేరితే అది చాలా ప్రమాదకరం కాబట్టి మన శారీరక జీవక్రియల వ్యవస్థ అంతా తమ దృష్టిని విషాలను నిర్వీర్యం చేసే పనిమీద కేంద్రీకరిస్తుంది. దాంతో ఈ ప్రాధాన్యక్రమం వల్ల జీర్ణప్రక్రియ ఆలస్యమవుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థలో క్యాన్సర్లు మొదలుకొని మళ్లీ ఎన్నో అనర్థాలు. అందుకే ఈసోఫేజియల్‌ క్యాన్సర్లు మొదలుకొని, పెద్దపేగు (కొలోన్‌) క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల క్యాన్సర్లకు పొగతాగే అలవాటే ఒక ప్రధాన కారణం.
Dr. Ch.Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421,
Kurnool 08518273001

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement