కేరింతల దేవాలయం | 500 Women Given Birth To Children With Covid 19 Positive At Mumbai | Sakshi
Sakshi News home page

కేరింతల దేవాలయం

Published Thu, Jul 23 2020 2:49 AM | Last Updated on Thu, Jul 23 2020 2:49 AM

500 Women Given Birth To Children With Covid 19 Positive At Mumbai - Sakshi

తమ హాస్పిటల్‌లో జన్మించిన 500వ బిడ్డను ఎత్తుకున్న డాక్టర్‌ అనురూప నాయక్‌

కోవిడ్‌ కాలంలో మామూలు తలనొప్పి వస్తేనే లోపలికి రానివ్వడం లేదు. మామూలు డెలివరీ కేసులను కూడా వెనక్కు పంపిస్తున్నారు. మరి కోవిడ్‌ పాజిటివ్‌ గర్భిణుల సంగతి ఏం కాను? ముంబైలోని నాయర్‌ హాస్పిటల్‌ వారి పట్ల దేవాలయంగా మారింది. మంగళవారం ఉదయానికి అక్కడ 500 కోవిడ్‌ పాజిటివ్‌ తల్లులు సురక్షితంగా పిల్లలకు జన్మనిచ్చారు.

మంగళవారం (జూలై 21) ఉదయం 10.04 గంటలకు ముంబైలోని నాయర్‌ హాస్పిటల్‌లోని ప్రసూతి వార్డు కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అప్పుడే జన్మించిన పసికందును చేతుల్లోకి తీసుకున్న డాక్టర్‌ అనురూప నాయక్‌ పెదాల మీద ఒక సంతృప్తికరమైన చిరునవ్వు కనిపించింది. దానికి కారణం ఆ పసికందు ఆ హాస్పిటల్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ తల్లులకు జన్మించిన పిల్లల వరుసలో 500వ వాడు కావడమే. ఈ లాక్‌డౌన్‌ కాలం లో తల్లుల ఇక్కట్లను తీర్చి వారి ఒడిలో పిల్లలను ఉంచుతున్న ఆ హాస్పిటల్, అందులోని సిబ్బంది ప్రశంసలకు పాత్రమవుతున్నారు. కోవిడ్‌ వ్యాప్తి తర్వాత మార్చి– ఏప్రిల్‌ కాలానికి చాలా స్థానిక క్లినిక్స్, నర్సింగ్‌ హోమ్‌లు మూత పడ్డాయి. గర్భిణులకు ప్రసవాలు సందిగ్ధంలో పడ్డాయి. ఇక కోవిడ్‌ సోకిన గర్భిణుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.

ఈ నేపథ్యంలో ముంబైలోని బి.వై.ఎల్‌. నాయర్‌ చారిటబుల్‌ హాస్పిటల్‌ కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన తల్లుల ప్రసవాలకు ముందుకు వచ్చింది. దానికంటే ముందు అది స్పెషల్‌ కోవిడ్‌ హాస్పిటల్‌గా మారినా గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌ కోవిడ్‌ పాజిటివ్‌ తల్లులకు తమ అవసరాన్ని గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లతో రంగంలో దిగింది. అక్కడ కోవిడ్‌ లేని తల్లుల కోసం ఒక లేబర్‌ రూమ్, కోవిడ్‌ ఉన్న తల్లుల కోసం ఒక లేబర్‌ రూమ్‌ విడిగా ఏర్పాటు చేశారు. ‘ఒక తల్లి నుంచి మరో తల్లికి కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా చూడటం మా ముఖ్య లక్ష్యం’ అని ఆ హాస్పిటల్‌ పీడియాట్రిక్స్‌ హెడ్‌ డాక్టర్‌ సుష్మ మలిక్‌ చెప్పారు.

గత మూడు నెలలుగా నాయర్‌ హాస్పిటల్‌లో 723 కోవిడ్‌ పాజిటివ్‌ గర్భిణులు చికిత్స పొందారు. వీరిలో 656 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వీరిలో ప్రసవాలు జరిగిన 500 మందిలో 467 మంది తమ పిల్లలతో ఇంటికి చేరుకున్నారు. ఈ మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ ప్రసవాల్లో ఎనిమిది జతల కవలలు. ఒక ట్రిప్లెట్‌ కూడా ఉన్నారు. 191 సిజేరియన్లు అవసరమైనా వెనుకంజ వేయకుండా చేశారు. పుట్టిన అందరు పిల్లల్లో కేవలం 10 మంది పిల్లలకే కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత వారు నెగెటివ్‌ అయ్యారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి సమయంలో మాతృభిక్ష పెడుతున్న ఈ డాక్టర్లు ఉన్నది హాస్పిటల్‌ అనడానికి వీల్లేదు. అది దేవాలయమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement