ట్రిగ్వేలీ (నార్వే) ఐరాస తొలి ప్రధాన కార్యదర్శి
ఆ నేడు 24 అక్టోబర్, 1945
‘ఐక్యరాజ్య సమితి’ ఆవిర్భావానికి ముందు ‘నానాజాతి సమితి’ ఉండేది. అయితే ఆ సమితి మాట ఏ దేశమూ వినకపోవడంతో ఈ సమితి ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితిని ప్రపంచ దేశాలు ఉమ్మడిగా నెలకొల్పుకున్నాయి. భవిష్యత్తులో ఇక ప్రపంచ యుద్ధాలు జరక్కూడదని అవి నిర్ణయించుకున్నాయి. 51 దేశాల సభ్య త్వంతో ప్రారంభమైన ఐరాసలో నేడు 193 దేశాలు ఉన్నాయి. సమితి ప్రధాన కార్యాలయం మాన్‌హట్టన్ (న్యూయార్క్ నగరం)లో ఉంది.
మిగతా ముఖ్యమైన కార్యాలయాలు జెనీవా, నైరోబీ, వియెన్నాలలో ఉన్నాయి. ప్రపంచ దేశాల స్వచ్ఛంద విరాళాలలో నడుస్తున్న ఐరాస.. ప్రధానంగా ప్రపంచ శాంతి కోసం పాటుపడుతుంటుంది. మానవహక్కులను, పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటుంది. ప్రకృతి వైపరీత్యాలలో ఆయా దేశాలకు సహాయ సహకారాలు అందిస్తుంటుంది. ఎక్కడ సాయుధ పోరాటం మొదలైనా ఆపేందుకు, అంతకన్నా ముందు ఆ పోరాటాన్ని నివారించేందుకు కృషి చేస్తుంటుంది.