మూడేళ్ల వ్యవధి ఉంటేనే మేలు!
కొందరు తల్లులు చంకలో ఒక బిడ్డ, కడుపులో ఒక బిడ్డతో కనిపిస్తుంటారు. అయితే అది ఆమె ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు వైద్యనిపుణులు. ఇద్దరు బిడ్డల మధ్య కనీసం మూడేళ్లు వ్యవధి లేకపోతే అటు మొదటి బిడ్డకీ, ఇటు రెండవ బిడ్డకీ కూడా తగినన్ని తల్లిపాలు లభించక తల్లడిల్లాల్సి వస్తుందనీ, దానికితోడు వెంట వెంటనే గర్భం ధరించడం వల్ల తల్లి ఆరోగ్యానికి కూడా హానికరమని అంటున్నారు అటు గైనకాలజిస్టులు, ఇటు సైకాలజిస్టులు కూడా!
అలాగని బిడ్డకూ బిడ్డకూ మధ్య మరీ ఎక్కువ వ్యవధి వుండటం కూడా అంత అభిలషణీయం కాదు. ఎందుకంటే తోబుట్టువులు ఒకరితో ఒకరు అంత త్వరగా కలసిపోలేరు. ఆడుకోలేరు. అదే రెండు మూడు సంవత్సరాల వ్యవధి ఉంటే మాత్రం పిల్లలిద్దరూ స్నేహంగా మెలుగుతారు. ఒకరి దుస్తులు మరొకరు షేర్ చేసుకుంటారు. ఆటవస్తువులు కూడా ఒకరివి ఒకరు పంచుకుంటారు.
బిడ్డలిద్దరి మధ్య కనీసం రెండు సంవత్సరాలయినా వ్యవధి ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు. హెచ్. ఒ) అంటే, భారత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ మాత్రం బిడ్డకూ బిడ్డకూ మధ్య మూడేళ్ల వ్యవధి ఉండాలని గట్టిగా చెబుతోంది. అయితే బిడ్డలిద్దరికీ మధ్య ఎంత వ్యవధి ఉండాలి అనేది తల్లి ఆరోగ్యం, తండ్రి ఆర్థిక స్థితిగతుల మీద కూడా ఆధారపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. తగినంత వ్యవధి లేకపోతే మొదటి బిడ్డ ఆలనాపాలనా పూర్తి కాకుండానే, రెండవ బిడ్డ బాధ్యత వచ్చి మీద పడటం వల్ల తల్లి ఇద్దరికీ న్యాయం చేయలేదు.
మొదటిబిడ్డకు ఆరు నుంచి 17 నెలల మధ్యలోనే తల్లి రెండవసారి గర్భం ధరిస్తే... రెండవ బిడ్డ తల్లి గర్భంలో పూర్తిగా ఎదగకముందే పుట్టవచ్చు బరువు బాగా తక్కువగా పుట్టవచ్చు పోషకాహార లేమి వల్ల బిడ్డ బలహీనంగా ఉండవచ్చు లేదా ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఉండవచ్చుతల్లిలో బాలింత వైరాగ్యం తలెత్తవచ్చు ప్రసవ సమయంలో రకరకాల ఇబ్బందులు చోటు చేసుకోవచ్చు.
గర్భధారణకూ గర్భధారణకూ మధ్య కనీసం నాలుగేళ్లయినా వ్యవధి లేనిదే తల్లికి అటు శారీరకంగానూ, ఇటు మానసికం గానూ కూడా విశ్రాంతి లభించదు. దాంతో ఆమె ఎవరి పనులు చేయాలో తేల్చుకోలేక సతమతం అవుతుంది. మొదటి బిడ్డ కూడా తల్లి తనను పక్కన పెట్టేసిందని భావించి, తనలో తనే బాధపడుతుంటాడు. అందువల్ల వెంట వెంటనే గర్భం ధరించడం అటు తల్లికీ, ఇటు మొదటి బిడ్డకూ కూడా మంచిది కాదని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు.
కాబట్టి రెండవ గర్భధారణ విషయంలో తల్లితండ్రులు తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించడం మంచిది.