
ఏబీసీ ఫార్ములా..
స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు సరైన సాధనాన్ని ఎంచుకోవాలి. కాస్త ఒడిదుడుకులు వచ్చినా.. అప్పుడే నిశ్చింతగా ఉండొచ్చు. ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌కి అనేక సాధనాలు ఉన్నాయి. లక్ష్యాలు, రాబడులు, రిస్కులు తదితర అంశాలు బట్టి వాటిని వర్గీకరించుకుని, మనకు అనువైనవి ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలవుతుంది.
A-వడ్డీనిచ్చే సాధనాలు
సేవింగ్స్ అకౌంట్ లాంటివి ఇందుకు మంచి ఉదాహరణలు. ఇలాంటి వాటిలో గొప్పతనమేమిటంటే.. అసలుకు ఢోకా ఉండదు. పైగా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఠక్కున తీసుకోగలిగే వెసులుబాటు ఉంటుంది. అయితే, మిగతా అన్ని సాధనాలతో పోలిస్తే .. వీటి ద్వారా వచ్చే ఆదాయం చాలా నెమ్మదిగా పెరుగుతుంది. స్వల్పకాలికమైన లక్ష్యాల కోసం లేదా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఏం చేయాలో ఆలోచించుకునేందుకు సమయం కావాల్సినప్పుడో ఇలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఎక్కువ వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో చూసుకుని ఎంచుకోవడం మంచిది.
B-డివిడెండ్లు ఇచ్చే సాధనాలు..
షేర్లు వంటివి ఈ కోవలోకి వస్తాయి. పెట్టుబడులపై స్థిరంగా ఆదాయం రావాలనుకుంటే ఇది కూడా మంచి సాధనమే. అయితే, ఆయా కంపెనీల పనితీరుపై డివిడెండ్లు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా తరచూ డివిడెండ్లు ఇచ్చే కంపెనీల నిర్వహణ మెరుగ్గానే ఉంటుంది. కానీ, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు కాబట్టి.. ఆయా కంపెనీలు ఏటా ఇచ్చే నివేదికలపై ఒక కన్నేసి ఉంచడం మంచిది. తద్వారా ఊహించని పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు సాధ్యపడుతుంది.
C- బంగారం, రియల్టీ
దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉపయోగపడే సాధనాల్లో బంగారం, రియల్ ఎస్టేట్ మొదలైన వాటిని కూడా చేర్చుకోవచ్చు. బంగారాన్ని ఆభరణాల కోణంలోనే కాకుండా ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా కూడా పరిగణించే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే ఫ్లాట్లు, ప్లాట్లు వంటి రియల్టీ సాధనాల్లో కూడా ఇటీవల పెట్టుబడి ఆసక్తి పెరుగుతోంది. పరిస్థితులను బట్టి ధరలు హెచ్చుతగ్గులకు లోనైనా దీర్ఘకాలంలో ఇవి మెరుగైన రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.