విజయాల బాటలో...! | Accomplishments on the way ...! | Sakshi
Sakshi News home page

విజయాల బాటలో...!

Published Wed, May 7 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

విజయాల బాటలో...!

విజయాల బాటలో...!

అ అమ్మాయి పేరు సుమన స్నిగ్ధ... ఆరెంజ్, గ్రీన్, బ్రౌన్ బెల్టులు దాటి బ్లాక్‌బెల్ట్‌కు చేరింది.ఇటీవల బ్లాక్‌బెల్ట్‌లో రెండో రౌండ్ పూర్తి చేసింది... మూడో రౌండ్‌లో పోటీ పడడానికి సిద్ధమే అంటోంది... కానీ అందుకు ఇంకా మూడేళ్లు ఆగాలంటున్నాయి నిబంధనలు.
 
 మన రాష్ట్రంలో పన్నెండేళ్లలోపు వయసులో బ్లాక్‌బెల్ట్‌లో రెండవ లెవెల్‌కు చేరిన తొలి అమ్మాయి స్నిగ్ధ. ఐదేళ్ల పాపాయిగా ఉన్నప్పుడు మొదలు పెట్టిన కరాటే సాధనలో ఇప్పటికి ఆమె సాధించిన బంగారు పతకాలు పందొమ్మిది. వీటికి తోడు రజత, కాంస్య పతకాలు అన్నీ కలిసి పాతిక దాకా ఉంటాయి.
 
 స్నిగ్ధ డైలీ రొటీన్ ఇలాగ!

 ఉదయం నాలుగుంపావుకి నిద్ర లేచింది మొదలు రాత్రి తొమ్మిదింటికి నిద్రపోయే వరకు స్నిగ్ధ టైమ్‌టేబుల్‌లో ఏమాత్రం ఖాళీ కనిపించదు. ఐదున్నరకు తల్లితో కలిసి వాకింగ్, ఆరు నుంచి ఏడుగంటల ఇరవై ఎనిమిషాల వరకు కరాటే సాధన చేస్తుంది. తర్వాత స్కూలు మొదలవుతుంది, మధ్యాహ్నం మూడు యాభైకి ఇంటికి వస్తుంది. మరో గంటలో ట్యూషన్‌కెళ్లి రాత్రి ఏడున్నరకు ఇంటికి వస్తుంది. హోమ్‌వర్కు, భోజనం తర్వాత తొమ్మిదికి ఎట్టిపరిస్థితుల్లోనూ నిద్రకుపక్రమించేలా చూస్తారు స్నిగ్ధ తల్లి సుధ. ఆదివారం ఈ రొటీన్ మొత్తానికీ సెలవు ప్రకటించేసి టీవీ చూడడం, బయటకు వెళ్లడంలో గడిపేస్తారు. గోల్కొండ, చార్మినార్‌లతోపాటు నగరంలో చారిత్రక ప్రదేశాలన్నింటినీ చూపిస్తున్నానంటారు సుధ. వేసవి సెలవులకు తప్పనిసరిగా అందరూ కలిసి కేరళ, ఊటీలాంటి ప్రదేశాలకు టూర్‌కి వెళ్తారు.
 
 పుస్తకాలే నేస్తాలు!


 ‘‘స్మార్ట్ ఫోన్ వాడడం, ల్యాప్‌టాప్, ఫేస్‌బుక్‌లో గడపడం అంటే అమ్మకు చిరాకు. ఇ-మెయిల్, ఇంటర్నెట్ వంటి వాటిని అవసరాలకు మాత్రమే అనుమతిస్తుంది. బుక్స్ మాత్రం అడిగినవన్నీ కొనిస్తుంది. బుక్‌ఫెయిర్‌లకు తీసుకెళ్తుంది. కొన్నింటిని నేను అడగకపోయినా సరే ‘ఇవి చాలా బాగుంటాయి పెద్దయ్యాక చదువు’ అని మాల్గుడి డేస్ వంటి ఆర్‌కె నారాయణ్ పుస్తకాలు కొనిచ్చింది. ఇలాంటివి నా రూమ్‌లో నాలుగు ర్యాక్‌ల నిండా పుస్తకాలున్నాయి’’ అన్నది స్నిగ్ధ డ్రాయింగ్‌రూమ్‌లో ఉన్న బుక్ రాక్‌ని చూపిస్తూ. స్నిగ్ధని విజేతను చేయడంలో తల్లి సుధపాత్ర అపారం.

‘‘పిల్లలు ఏదైనా సాధించాలంటే తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల కోసమే అంకితం కావాలి. అందుకే ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆపరేషన్స్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేశాను. టీవీ ముందు కూర్చోవడానికి నేను వ్యతిరేకిని. టీవీ ముందు కాలం గడపడం పిల్లలకు అలవాటు కాకూడదని ఏదో ఒక పనిలో నిమగ్నం చేయాలనుకున్నాను. దీనికి తోడు స్నిగ్ధ చిన్నప్పుడు బొద్దుగా ఉండేది. శరీరానికి శ్రమను కలిగిస్తూ ఆత్మరక్షణకు కూడా దోహదం చేసే యాక్టివిటీ అయితే మంచిదని కరాటేలో చేర్చాను.

కరాటేలో ఇంతగా రాణిస్తుందని ఊహించి కానీ, రాణించాలని ఆశించి కానీ చేర్చలేదు. కానీ స్నిగ్ధ పాల్గొన్న ప్రతి పోటీలోనూ బంగారు, రజత పతకాలు తెచ్చుకోసాగింది. దాంతో ఈ రంగంలో కొనసాగిద్దామనే ఆలోచన కలిగింది. కొంతకాలం బాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంది. కానీ తాను కరాటేలోనే బాగా రాణిస్తున్నట్లు అనిపించింది. దాంతో బాడ్మింటన్ శిక్షణ కొనసాగించలేదు. స్నిగ్ధ రక్షణరంగంలో కానీ ఐపిఎస్‌గా కానీ దేశానికి సేవ చేయాలని, మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకోవాలని నా కోరిక.

నేను చేయలేకపోయాను, తనైనా చేస్తే బావుండని ఆశ. అయితే ఇంత చిన్న వయసులోనే తన వృత్తి గురించి ఆలోచించడం సరి కాదేమో! అలాగే నా అభిప్రాయాన్ని, నా ముచ్చటను తన మీద రుద్దను. స్నిగ్ధ కూడా కోరుకుంటే దానికి తగిన కోచింగ్ ఇప్పించడంతోపాటు నేను చేయగలిగినంత సపోర్టునిస్తాను’’ అంటారు స్నిగ్ధ తల్లి సుధ.
 
 కరాటే ఫీజులు తక్కువే కానీ..!
 ‘‘కొన్ని పాఠశాలలు విద్యేతరకార్యక్రమాల్లో భాగంగా కరాటే క్లాసులు నిర్వహిస్తుంటాయి. అలా కాకుండా విడిగా కోచింగ్ తీసుకోవడం అంటే ఖర్చుతోకూడిన అంశం అనుకుంటారు. కానీ కరాటే శిక్షణకు నెలకు వెయ్యి రూపాయలు చాలు. అసలు ఖర్చు టోర్నమెంట్‌లకు హాజరుకావడంలోనే ఉంటుంది. పిల్లలతో తల్లి కానీ తండ్రి కానీ వెళ్లాలి, కోచ్‌తోపాటు పంపించవచ్చు కానీ నేనింత వరకు అలా పంపలేదు’’ అన్నారు సుధ.
 
కరాటేలో వెపన్ ట్రైనింగ్, కటాస్, కుమితే విన్యాసాలన్నింటిలో మంచి పట్టు సాధించి డాన్ టెన్ స్థాయిని చేరడమే తన లక్ష్యం అంటోంది స్నిగ్ధ. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తండ్రి ప్రోత్సాహం, అడుగడుగునా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న తల్లి సహకారంతో స్నిగ్ధ కోరుకున్న శిఖరాలను చేరుతుందని ఆశిద్దాం.
 
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: లావణ్యకుమార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement