
కొన్నాళ్లకు షార్క్‌లు కనపడవు
షార్క్ చేపల్లో ఇంతవరకూ తెలిసి 21 రకాలు ఉంటే వాటిలో 16 జాతులు అంతరించిపోతున్నాయని తాజా పరిశోధనల్లో వెల్లడయింది.
శోధన
షార్క్ చేపల్లో ఇంతవరకూ తెలిసి 21 రకాలు ఉంటే వాటిలో 16 జాతులు అంతరించిపోతున్నాయని తాజా పరిశోధనల్లో వెల్లడయింది.సముద్రజలాల్లో షార్క్, రే జాతులలోని గ్రేట్ వైట్ షార్క్, వేల్ షార్క్, క్రొకడైల్ షార్క్, బిగ్ ఐ థ్రెషర్స్, బాస్కింగ్ షార్క్స్, షార్ట్‌ఫిన్ మాకోస్, లాంగ్‌ఫిన్ మాకోస్, సల్మోన్ షార్క్స్, సిల్క్ షార్క్స్, సిల్కీ షార్క్స్ వంటి జాతులెన్నో ఉన్నాయి. అయితే, షార్క్ చేపల మొప్పల కోసం, మాంసం కోసం ఇటీవల వాటిని క్రూరంగా వేటాడుతున్నారని తేలింది. షార్క్ మొప్పల (ఫిన్) తో చేసిన సూప్ ఆసియా దేశాలలో కొత్త క్రేజ్. షార్క్ చేపలు, రేస్ వంటివి పిల్లల్ని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ కాలం తీసుకుంటాయి. అందువల్ల వాటిని భారీగా వేటాడటం వల్ల అనేక షార్క్ జాతులు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని ఐయుసిఎన్ షార్క్ స్పెషలిస్ట్ గ్రూప్ వెల్లడించింది.
వివిధ దేశాలకు చెందిన 15 మంది సైంటిస్టులు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు.జీవరాశి కాలక్రమంలో అంతరించిపోవడానికి సహజంగా చాలా కాలం పడుతుంది. అంతరించిపోతున్న ఇతర జీవులతో పోలిస్తే షార్క్ జాతి క్షీణత వంద రెట్లు వేగంగా జరుగుతుండటం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. షార్క్ జాతి పరిరక్షణకు ఐయుసిఎన్ పరిశోధకులు కొన్ని సూచనలు చేస్తున్నారు. శాస్త్ర సంబంధమైన పరిశోధనలకు మాత్రమే సొరచేపలను పట్టుకోవాలి. వాటి మాంసాన్ని, మొప్పలను తొలగించిన తరువాత వాటి శరీరాన్ని సముద్రంలో వదిలివేస్తున్నారు. సొర చేపల వేటగాళ్లను నియంత్రించాలి. ఎప్పటికప్పుడు సొరచేపల గణాంకలను సేకరిస్తుండాలి. సముద్రతీర దేశాలన్ని షార్క్‌ల పట్ల బాధ్యతను వహించాలని పరిశోధకులు కోరుతున్నారు.