
గాలిలో యముడు
వాయు కాలుష్యం
పూర్ణాయుష్షు అనేది అదృష్టం అనే చెప్పాలి. ఆహారం, నీరు, పని విధానం, వత్తిడి ఎంత ఆయుష్షును హరిస్తున్నాయోగాని ఊరికే రోడ్డు మీదకు వచ్చి గాలి పీలిస్తే మాత్రం భారతదేశంలో మూడు నుంచి నాలుగేళ్ల ఆయుష్షు కోల్పోక తప్పదని తాజా అధ్యయనం తెలుపుతోంది. పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటెరాలజీ తాజా అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యానికి ఆయుష్షు కోల్పోతున్నవారు దేశవ్యాప్తంగా న్యూఢిల్లీలో మొదటి స్థానంలో ఉన్నట్టుగా తేలింది. ఢిల్లీలోని వాయు కాలుష్యానికి అక్కడి ప్రజలు కనీసం ఆరు నుంచి ఏడు సంవత్సరాల ఆయుష్షును కోల్పోతున్నారట.
మన దేశంలో ఏటా వాయు కాలుష్యం పరోక్షంగా ఐదున్నర లక్షల మందిని బలిగోరుతుండగా నేరుగా శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడి 31,000 మంది మృత్యువాత పడుతున్నారు. ఇటీవల ప్రపంచంలోని 100 దేశాల్లో మూడు వేల నగరాల్లో కాలుష్య ప్రమాణాలను పరీక్షించగా న్యూ ఢిల్లీ పదకొండో స్థానంలో నిలిచిందంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాలిలో ప్రమాదకరమైన విషకారకాలు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండగా తర్వాతి స్థానం మహారాష్ట్ర, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత బీహార్ ఉన్నాయి. ఇక ఓజోన్ విషకారకాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. పర్యావరణం పట్ల జాగరూకులై ఉండటం వృక్ష వికాసం దీనికి విరుగుడు అని గ్రహించాలి.