అజాన్ సంప్రదాయం ఏర్పడిందిలా!
ప్రజలకు ఏదైనా విషయం చెప్పాలన్నా, ఎటువంటి ప్రకటన చెయ్యాలన్నా ప్రవక్త మహనీయులు మసీదునే వేదికగా చేసుకునేవారు. ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ప్రసంగ వేదిక (మింబర్ ) మొదటి మెట్టుపై నిలబడి ప్రసంగించేవారు. సంభాషణ అయితే ’మింబర్ ’ రెండవ మెట్టుపై కూర్చుని మాట్లాడేవారు.
ప్రారంభంలో ఎవరికివారు నమాజు వేళకు మస్జిదుకు చేరి ప్రార్థన చేసేవారు. కాని అందరూ ఫలానా సమయానికి మస్జిదుకు రావాలని పిలిచే పద్ధతేదీ లేదు. అందుకని ప్రవక్తమహనీయులు సహచరులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దూరాన ఉన్నవారికి తెలియడం కోసం ఏదో ఒకవిధానం రూపొందించాలన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమైంది. కొందరు బాకా ఊదడం గాని, గంట మోగించడం గాని చేద్దామన్నారు. మరికొందరు శంఖం పూరిస్తే బాగుంటుందన్నారు. ఈవిషయంపై ఏకీభావం కుదరగానే శంఖాన్ని ఏర్పాటు చేయమని ప్రవక్తవారు హజ్రత్ ఉమర్ గారికి పురమాయించారు. ఇవే ఆలోచనలతో ఇంటికి వెళ్ళిన ఉమర్ ఆ రాత్రి ఒక కలగన్నారు. ’గంటలు, బాకాలు కాదు ‘అజాన్ ’ పలకండి’ అని ఆ కల సారాంశం.
ఈ ‘అజాన్ ’ ఏమిటీ? తెల్లవారిన తరువాత ఈ విషయం ప్రవక్తకు తెలియజేద్దామని, అసలు ‘అజాన్ ’ అంటే ఏమిటీ అని ఆలోచిస్తూ మసీదువైపు బయలుదేరారు. అంతలో మసీదు పక్కనే ఓ ఇంటికప్పుపై హజ్రత్ బిలాల్ నిలబడి ’అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అష్ హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్...’ అని పలుకుతున్న మధురవచనాలు చెవిన పడ్డాయి. అజాన్ అంటే ఇదేనేమో... మరి బిలాల్‌కు ఎవరు చెప్పారీ పలుకులు అనుకుంటూ వడివడిగా అడుగులేశారు. అప్పటికే అక్కడ కొంతమంది విశ్వాసులు ఈ విచిత్ర పలుకుల్ని వింటున్నారు.
అక్కడికి చేరుకున్న ఉమర్ , బిలాల్ నుద్దేశించి, ‘ఎవరు చెప్పారు ఇలా చదవమని?’ అంటూ ప్రశ్నించారు సంభ్రమాశ్చర్యాలతో..
ఇప్పుడే హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ వచ్చి, తనకు ఎవరో కలలో కనిపించి, అజాన్ ఇలా పలకాలని చెప్పినట్లు తనకు చెప్పారన్నారు బిలాల్. అక్కడినుండి హజ్రత్ ఉమర్ నేరుగా ప్రవక్త వారి వద్ద కెళ్ళి, ’దైవప్రవక్తా! రాత్రి నాకు, అబ్దుల్లాబిన్ జైద్ ఇద్దరికీ ఒకేలాంటి కల వచ్చింది’ అని అంతా పూసగుచ్చినట్లు చెప్పారు. ఇదంతా విన్న దైవప్రవక్త, ‘ఉమర్! ఇది అల్లాహ్ మహదానుగ్రహం. నా వద్దకు కూడా ఇలాంటి సందేశమే వచ్చింది’. అన్నారు సంతోషంగా.
ఈ విధంగా ప్రార్థన (నమాజ్ ) కోసం మసీదుకు రమ్మని పిలిచే సంప్రదాయం ఏర్పడింది. అప్పటినుండి మసీదు పక్కనే ఉన్న ఇంటికప్పుపై నిలబడి హజ్రత్ బిలాల్ (ర) అజాన్ పలికేవారు. అదేవిధానం యావత్ ప్రపంచంలో కొనసాగుతోంది. ప్రళయకాలం వరకూ ఇన్షా అల్లాహ్ ఇదే పద్ధతి కొనసాగుతుంది.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మరికొన్ని విశేషాలు వచ్చేవారం)