తండ్రిని మించిన తార | Alia Bhatt Good Actors In Bollywood Industry | Sakshi
Sakshi News home page

తండ్రిని మించిన తార

Published Sat, Nov 2 2019 4:39 AM | Last Updated on Sat, Nov 2 2019 7:40 AM

Alia Bhatt Good Actors In Bollywood Industry - Sakshi

ఆలియా భట్‌ ఒక ఇంటర్వ్యూలో తనను తాను ‘డఫర్‌’గా పేర్కొంది. అంటే ‘చవటాయి’ అని అర్థం. అవును. ఆమెకు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు. తమిళనాడు చీఫ్‌ మినిస్టర్‌ ఎవరో తెలియదు. తలసరి ఆదాయం ఎంతో తెలియదు. ఇవన్నీ తెలిసినవారి మీద, ఆమె మీద జోకులు కట్‌ చేసే వారి మీద కెమెరా పెట్టి యాక్షన్‌ అంటే వాళ్లు కూడా ‘డఫర్‌’లు అవుతారు.

ఆమె ‘జీనియస్‌’ అవుతుంది. నటనకు సంబంధించిన ముఖకవళికలకు ఒక ఎన్‌సైక్లోపిడియా ఉంటే ఆలియా ఒక ఎన్‌సైక్లోపిడియా. నటిని నటన అడగాలి. భావోద్వేగం అడగాలి. మంగళయాన్‌ను సక్సెస్‌ చేసిన శాస్త్రవేత్త పేరు కాదు.

ఇవాళ ఆలియా భట్‌ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఒకరు. ఆమె డేట్స్‌ కోసం బాలీవుడ్‌ పడిగాపులు గాస్తోంది. డైరెక్టర్లు స్క్రిప్ట్‌లు పట్టుకొని చక్కర్లు కొడుతున్నారు. హీరోలు ఖాళీగా కూర్చుని ఉన్నారు. అయితే ఈ స్థితికి ఆలియా అంత సులువుగా రాలేదు. ఆమె వెండి స్పూన్‌ నోట్లో పెట్టుకొని పుట్టి ఉండవచ్చు. అయితే కెమెరాకు ఆ చరిత్ర అక్కర్లేదు. అది కేప్చర్‌ చేసేది ముఖాన్ని. ఆ ముఖంలో అందం, ప్రతిభ ఉండాలి. అవి ఉన్నాక కూడా కష్టపడి తన దగ్గరకు చేరుకుంటేనే అది కటాక్షించేది.

ఓటమి ఎరగని పాప
ఆలియా భట్‌ మహేష్‌ భట్‌ కుమార్తె. మహేష్‌ భట్‌ రెండు వివాహాలు చేసుకున్నాడు. మొదటి భార్య కిరణ్‌ భట్‌. రెండో భార్య బ్రిటిష్‌ మూలాలు ఉన్న నటి సోని రాజ్దాన్‌. ఆలియా మహేష్‌భట్‌కు–సోని రాజ్దాన్‌ల రెండో కూతురు. చిన్నప్పుడు ఆలియా పేరు ‘ఆలూ’ (బంగాళాదుంప). ఇప్పటికీ కొందరు ముద్దుగా ‘ఆలూ’ అనే పిలుస్తారు. దాని కారణం ఆలియా చాలా బొద్దుగా ఉండేది. చాలామంది ఆ అమ్మాయిని అబ్బాయి అనుకునేవారు. ‘ఈ బాబు ఎంత ముద్దొస్తున్నాడో’ అని బుగ్గలు పుణికితే ‘నేను అమ్మాయిని’ అని ఉడుక్కునేది. చిన్నపిల్ల కాబట్టి తల్లిదండ్రులు ముద్దు చేయడంతో లోకం తన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందని అనుకునేది.

నాలుగో క్లాస్‌లో స్కూల్లో తల మీద పుస్తకాలు పెట్టుకొని పరిగెత్తే పోటీ పెడితే అందరి కంటే ముందు ఉండాలని పరిగెత్తితే పుస్తకాలు కింద పడిపోయాయి. పోటీలో ఫెయిల్‌ అయిపోయింది. ఆ చిన్న వయసులో ఆలియాకు ఓటమి అంటే ఏమిటో మొదటిసారి తెలిసింది. ఆ రోజంతా ఇంట్లో ఏడుస్తూనే ఉంటే తల్లిదండ్రులకు తాము చేసిన తప్పు అర్థమైంది. అప్పుడు తండ్రి అన్నాడు ‘ఓటమి గెలుపుకు మొదటి మెట్టు. ఈసారి గెలువు పట్టుదలగా. గెలుపు పెద్ద అసాధ్యమైన విషయం కాదు’ అని. అది తండ్రి నుంచి అందుకున్న మొదటి పాఠం.

‘ఏమీ నేర్పించని తండ్రి’
ఆలియా చిన్నప్పుడు గోవిందా ఫ్యాన్‌. గోవిందా పాటలు టీవీలో చూసి గోవిందా, కరిష్మా కపూర్‌లు విదేశాలలో రోడ్లమీద, బిల్డింగ్‌ల మీద, పార్కులలో డాన్సులు చేస్తుంటే ఇదేదో బాగుందే... నేనూ సినిమా యాక్టర్‌ అవుతా అనుకుంది. వయసు పెరిగే కొద్దీ మెల్లగా అర్థమైంది.. యాక్టింగ్‌ అంటే పాటలు మాత్రమే కాదు... డైలాగులూ ఎక్స్‌ప్రెషన్‌లూ ఉంటాయని. ‘అవి కూడా చేసేస్తాలే’ అని తండ్రితో అంది. ‘అయితే నువ్వు నా దగ్గర చేయొద్దు. వేరే డైరెక్టర్‌ దగ్గర చెయ్‌.

నా దగ్గర చేస్తే నా మీద డిపెండ్‌ అయిపోతావ్‌’ అన్నాడు మహేష్‌ భట్‌. అంతేకాదు ‘నిన్ను నమ్మే ఒక డైరెక్టర్‌ దొరికేంత ప్రతిభ నీలో ఉందో లేదో నీకు తెలియాలి’ అని కూడా అన్నాడు. ఆలియాకు పట్టుదల వచ్చింది. బరువు తగ్గింది. యాక్టింగ్‌ మీద శ్రద్ధ పెట్టింది. అందరూ కొత్తవాళ్లు తిరిగినట్టే తానూ దర్శకుల దగ్గరకు అవకాశాల కోసం తిరిగింది. చివరకు కరణ్‌ జోహర్‌ ఆమెకు ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’లో బ్రేక్‌ ఇచ్చాడు. ఆ సినిమా మొదటిరోజు షూటింగ్‌కు వెళ్లేటప్పుడు ఆలియాకు చాలా భయం వేసి తండ్రికి మెసేజ్‌ చేసింది ‘నాన్నా... భయంగా ఉంది’ అని. ఆయన మెసేజ్‌ పెట్టాడు ‘వెంటనే ఆఫీస్‌కు రా’ అని. ఆఫీసుకు వెళితే తండ్రి అనునయిస్తాడని వెళ్లింది.

కాని అక్కడ పెద్ద దర్బార్‌లాగా అందరినీ కూచోబెట్టి ‘ఇప్పుడు చెప్పు... అందరికీ నీకెందుకు భయం వేస్తోందో’ అనేసరికి ఆలియా ఒకటే ఏడుపు. ఏడ్చి ఏడ్చి మెల్లగా తేలిక పడింది. ‘సెట్‌లో ఏడవకుండా ఇక్కడే ఏడ్చేశావ్‌. ఇక పోయి హాయిగా యాక్టింగ్‌ చేసుకో’ అని చెప్పి పంపాడు. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పెద్ద హిట్‌ అయ్యింది. ఆలియా స్టార్‌గా అవతరించింది. మహేష్‌ భట్‌ వచ్చి తొలి ఆటోగ్రాఫ్‌ అడిగితే ‘థ్యాంక్యూ నాన్నా... ఏమీ నేర్పకుండా నన్ను కాపాడినందుకు’ అని రాసి సంతకం పెట్టింది. దానిని మహేష్‌భట్‌ దాచుకున్నాడు.

నటిగా ఎదిగింది
సినిమా పరిశ్రమలో తారగా ఉద్భవించడం వేరు... నటిగా ఆవిష్కృతం కావడం, ఎదగడం వేరు. ఏదో గ్లామర్‌ డాల్‌గా ఉన్న ఆలియాను దర్శకుడు ఇంతియాజ్‌ అలీ ‘హైవే’ కోసం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ సినిమాలో డబ్బున్న అమ్మాయి ఆలియాను కొంతమంది కిడ్నాప్‌ చేస్తారు. కిడ్నాప్‌ అయ్యాక ఆ అమ్మాయి ఒక లారీ ప్రయాణంలో తనను తాను కనుగొనడమే సినిమా. ఆ సినిమా కోసం ఆలియా నిజంగానే ఒక లారీ క్లీనర్‌ స్థాయి మనిషిలా ఉండటం నేర్చుకుంది. రోడ్డు ప్రయాణాల్లో ఉండేవారు వ్యవహరించినట్టే వ్యవహరించడం మొదలుపెట్టింది. రోడ్డు మీదే తినడం, రోడ్డు పక్కనే నిద్రపోవడం ఆ శ్రమ స్క్రీన్‌ మీద కనపడింది. సినిమా రిలీజయ్యాక జనం ఆలియాకు బ్రహ్మరథం పట్టారు. తండ్రి నిశ్శబ్దంగా గర్వపడ్డాడు.

హిట్‌ సినిమాలు
‘టూ స్టేట్స్‌’, ‘హంప్టీ శర్మకి దుల్హనియా’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘డియర్‌ జిందగీ’, ‘‘బదరీనాథ్‌ కీ దుల్హనియా’, ‘రాజీ’, ‘గల్లీ బాయ్‌’.... ఆలియా చేసిన సినిమాలలో తొంభై శాతం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. ఆమె పాకిస్తాన్‌లో భారతీయ గూఢచారిగా నటించిన ‘రాజీ’ మహిళా ప్రధాన పాత్రగా విడుదలైన హిందీ సినిమాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. ఇది ఆలియా ఘనత. ఈ స్టార్‌ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తుండటం వల్ల తెలుగువారు ఆమె నటనను మన మాట పలుకుతుండగా చూడనున్నారు.

ఆలియా వయసు ఇప్పుడు 26 సంవత్సరాలు. ఎప్పుడూ ఆమె వార్తలలో ఉంటుంది. ఆమె ఉన్న చోట మీడియా వార్త సృష్టిస్తుంటుంది. ఆమె ఆకర్షణ శక్తి అలాంటిది. చుట్టూ ఎన్ని జరిగినా ఏకాగ్రత నటన నుంచి మరల్చకపోవడం, కష్టపడటం మానకపోవడం ఆమె నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. ఆలియాను నిన్నమొన్నటి దాకా మహేష్‌భట్‌ కుమార్తె అనేవారు. ఇవాళ మహేష్‌భట్‌ను ఆలియా తండ్రి అంటున్నారు. ఆలియా కచ్చితంగా తండ్రిని మించిన తార.

– సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement