చెప్పులకు బ్యాగ్ మ్యాచ్ అయ్యిందా?
చాలామంది దుస్తులమీదే దృష్టి పెడతారు. కొంతమంది దుస్తులతో పాటు మేకప్‌పై కూడా ఆసక్తి చూపిస్తారు. కాని చాలా మంది పట్టించుకోని యాక్ససరీ ఒకటుంది. అదే బ్యాగ్! అలంకరణలో హ్యాండ్‌బ్యాగ్ ప్రధాన భూమిక పోషిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. భుజానికి వేలాడే అతి చిన్న బ్యాగ్ కూడా మీ అలంకరణలో భాగమే. హ్యాండ్‌బ్యాగ్ ఎంపికలో ఫ్యాషన్ డిజైనర్స్ ఏమంటున్నారంటే.. ‘ధరించే దుస్తులకు మ్యాచ్ అయ్యే బ్యాగ్ కాదు, ధరించే చెప్పులకు, చేతపట్టుకునే బ్యాగ్‌కి సమన్వయం ఉండేలా చూసుకోవాలి’ అని చెబుతున్నారు.
సాయంకాలం పార్టీకి పువ్వుల ప్రింట్లు ఉన్న డ్రెస్ ధరించాలని అన్ని వయసుల వారూ అనుకుంటారు. దాంట్లో మీరు వైవిధ్యం చూపించేదేమీ ఉండదు. అదే ముదురుపసుపు రంగు సాదా డ్రెస్ ధరించి, పువ్వుల ప్రింట్లు ఉన్న బ్యాగ్ దానికి మ్యాచ్ అయ్యే చెప్పులు వేసుకున్నారనుకోండి. పార్టీలో మీరే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు.
యానిమల్ ప్రింట్లు (జంతుచర్మాలపై చారలను పోలినవి) మీకు అత్యంత ఇష్టమైతే సాధారణంగా కనిపించే డెనిమ్ డ్రెస్ ధరించి, ప్రింట్లు ఉన్న ఎత్తుమడమల చెప్పులు వేసుకొని, అదే రంగు క్లచ్‌బ్యాగ్ చేత పట్టుకోండి. ఎత్తుమడమల చెప్పులు ఇష్టపడని వారు ఫ్లాట్స్ వేసుకోవచ్చు. ఏవైనా ఈ తరహా మ్యాచింగ్ చూసుకున్నప్పుడు అతి ఎక్కువగా అలంకరణలు చేసుకోకుండా ఉండటం మేలు.
సంప్రదాయ తరహాలో కనిపించాలనుకునేవారు క్లాసిక్ కలర్స్ అయిన నలుపు, ఎరుపు, ముదురు రంగు దుస్తులను ధరిస్తుంటారు. ఇలాంటప్పుడు బ్యాగ్ ఎంపికలో ఏమాత్రం అలసత్వం చూపవద్దు. చేతికి తగిలించుకునే బ్యాగ్, అందుకు మ్యాచ్ అయ్యే చెప్పులు బాగుండేలా జాగ్రత్తపడాలి.
అన్నివేళలా చెప్పులు-బ్యాగ్ మ్యాచ్ అవ్వాలనుకోకూడదు. తెల్లటి బ్యాగ్ వెంట తీసుకెళ్లాలనుకుంటే నీలం, నారింజ, పసుపు రంగు చెప్పులు లేదా షూస్ ప్రయత్నించవచ్చు. అలాగే సాధారణ దుస్తులకు దృఢంగా ఉండే బ్యాగులు నప్పవు. కొద్దిగా వేలాడుతుండే లెదర్ లేదా క్లాత్ బ్యాగ్‌లు వేసుకొని అదే రంగు, మెటీరియల్ గల చెప్పులు ధరించాలి.
ప్యాంట్, షర్ట్, చెప్పులతో పాటు బ్యాగ్ కూడా ఒకే రంగులో ఒకే ప్రింట్లలో ఉంటే అలంకరణ మరీ అతిగా కనిపిస్తుంది. ప్యాంట్ లేదా టాప్ ఏదైనా ఒక రంగును పోలి ఉండే బ్యాగ్‌ను ఎంచుకోవచ్చు.
మీరు ధరించే దుస్తులు ప్లెయిన్‌గా ఎలాంటి ప్రింట్ లేకుండా ఉన్నాయనుకోండి. అప్పుడు ఎక్కువ ప్యాటర్స్ ఉన్న బ్యాగ్ లేదా షూ ధరించవచ్చు. కాని గుర్తుంచుకోవాల్సిందేంటంటే... షూ, బ్యాగ్ మిమ్మల్ని మరింత అందంగా చూపించాలి.