మిస్సవుతారు... మీ ఇష్టం మరి! | And will miss you | Sakshi
Sakshi News home page

మిస్సవుతారు... మీ ఇష్టం మరి!

Published Mon, Oct 26 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

మిస్సవుతారు... మీ ఇష్టం మరి!

మిస్సవుతారు... మీ ఇష్టం మరి!

పాప్‌కార్న్... భలే ఉంటుంది. కరకర... ఆలూ... ఎలా వండినా... ఊ.. లలలా! ఆవకాయ... కారం, కమనీయం. మంచూరియా... ఓ మారియా! ఓ మారియా! పరాఠా... పొరల పొరలుగా.. హాట్ హాట్‌గా.. సూప్... స్మూత్ అండ్ స్వీట్.  వీటన్నిటినీ... క్యాలీఫ్లవర్‌తో చేస్తే? క్యాలీఫ్లవర్‌తోనా!! అవును కాలీఫ్లవర్‌తోనే. బాగుంటాయ్ చేసుకోండి. బాబోయ్ వద్దు అంటారా? మిస్సవుతారు.. మీ ఇష్టం మరి.
 
గోబీ మంచూరియా

కావలసినవి: క్యాలీఫ్లవర్ - 1, మైదా పిండి - కప్పు, కార్న్ ఫ్లోర్ - కప్పు, పచ్చి మిర్చి - 6, అల్లం తురుము - టీ స్పూను, వెల్లుల్లి ముద్ద - టీ స్పూను, ఉప్పు - తగినంత, ఉల్లి తరుగు - కప్పు, ఉడికించిన బఠాణీ - కప్పు, సోయా సాస్ - టీ స్పూను, అజినమోటో - అర టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, ఉల్లికాడల తరుగు - పావు కప్పు తయారీ:  ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా నీళ్లతో కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉడికించాలి.  మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా చేయాలి.  పెద్ద పాత్రలో క్యాలీ ఫ్లవర్ తరుగు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద, ఉడికించిన బఠాణీ, ఉల్లి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.  కార్న్‌ఫ్లోర్, మైదా పిండి వేసి పకోడీల పిండిలా కలపాలి (నీళ్లు పోయకూడదు)  బాణలిలో నూనె కాగాక క్యాలీఫ్లవర్ మిశమ్రన్ని చిన్న చిన్న మంచూరియాలుగా వేసి దోరగా వేయించి కిచెన్ న్యాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.  వేరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి కాడల తరుగు వేసి వేయించాలి.  తయారయిన మంచూరియాలను వేసి అన్నీ కలిసేలా కలుపుతుండాలి.  చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్‌ఫ్లోర్, తగినన్ని నీళ్లు వేసి పల్చగా పిండి కలిపి, బాణలిలోని మంచూరియాల మీద వేసి కలపాలి.  సోయాసాస్, అజినమోటో వేసి మరోమారు కలిపి రెండు నిమిషాలలో దింపేసి, టొమాటో సాస్‌తో సర్వ్‌చేయాలి.
 
ఆలూ గోబీ
కావలసినవి: నూనె - టేబుల్ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, అల్లం తురుము - టీ స్పూను, ఆలుగడ్డలు - 2 (ఉడికించి తొక్క తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి), పసుపు - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, జీలకర్ర పొడి - టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, క్యాలీఫ్లవర్ - చిన్నది (1), కొత్తిమీర తరుగు - టీ స్పూను,
 తయారీ:  బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము వేసి వేయించాలి.  ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కలపాలి.  పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, కరివేపాకు వేసి క లిపి, సుమారు ఆరేడు నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతుండాలి.  క్యాలీఫ్లవర్, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి.  మూత పెట్టి పది నిమిషాలు ఉడికించి దింపేయాలి.
 
క్యాలీఫ్లవర్ చరిత్ర

ఈ పూలు క్రీ.పూ.6 వ శతాబ్దానికి చెందినవి. ఈ పదం కాలిస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. కాలిస్ అంటే క్యాబేజీ అని అర్థం. ఈ పువ్వు భారతదేశంలోకి1822లో ఆంగ్లేయుల ద్వారా ప్రవేశించింది. క్యాలీఫ్లవర్‌ను ఉడికించుకోవచ్చు, వేయించుకోవచ్చు, ఆవిరి మీద ఉడికించనూ వచ్చు. పచ్చిగానూ తినచ్చు.
 
పాప్‌కార్న్ క్యాలీఫ్లవర్

కావలసినవి: పంచదార - 4 టీ స్పూన్లు, పప్పు - టీ స్పూను, కారం - టీ స్పూను, పసుపు - టీ స్పూను, ఉల్లి పొడి - అర టీ స్పూను, వెల్లుల్లి పొడి - అర టీ స్పూను, క్యాలీఫ్లవర్ - చిన్న పువ్వు, కుకింగ్ స్ప్రే - తగినంత (ఇందులో పదార్థాలు సూపర్ మార్కెట్లలో కాని బేకరీలలో కాని దొరుకుతాయి) తయారీ:  ముందుగా అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్‌హీట్ దగ్గర వేడి చేసుకోవాలి.  బేకింగ్ షీట్ మీద అల్యూమినియం ఫాయిల్ వేయాలి.  ఒక పాత్రలో పంచదార, ఉప్పు, కారం, పసుపు, ఉల్లి పొడి, వెల్లుల్లి పొడి వేసి బాగా కలపాలి.  క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేడి నీళ్లలో శుభ్రంగా కడిగి తడిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి.  బేకింగ్ షీట్ మీద క్యాలీ ఫ్లవర్ తరుగు పల్చగా పరవాలి.  కుకింగ్ స్ప్రేను అన్నిటి మీద తేలికగా స్ప్రే చేయాలి.  కలిపి ఉంచుకున్న మసాలాను వీటి మీద చల్లాలి.  సుమారు 30 నిమిషాలు అవెన్‌లో ఉంచి తీసి వేడివేడిగా అందించాలి.  క్యాలీఫ్లవర్ పాప్‌కార్న్ సిద్ధమయినట్లే.
 
క్యాలీఫ్లవర్ పరాఠా
కావలసినవి: క్యాలీఫ్లవర్ - చిన్నది-1, పచ్చి మిర్చి ముద్ద - టీ స్పూను, ధనియాల పొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - తగినంత, గోధుమపిండి - 3 కప్పులు. తయారీ:  ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి, గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు ఉంచి తీసేయాలి.  తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మెత్తగా ఉడికించాలి.  పెద్ద పాత్రలో గోధుమపిండి, ఉడికించిన క్యాలీఫ్లవర్, పచ్చి మిర్చి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు వేసి చపాతీలా కలపాలి (అవసరమనుకుంటేనే నీళ్లు జత చేయాలి).  పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి పక్కన ఉంచాలి.  ఒక్కో ఉండను పరాఠాలా జాగ్రత్తగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి కాల్చాలి.  కుర్మాతో కాని, పెరుగుతో కాని తింటే రుచిగా ఉంటాయి.
 
క్యాలీఫ్లవర్ ఆవకాయ
కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు - మూడు కప్పులు, ఆవాలు - ఒకటిన్నర టీ స్పూన్లు, మెంతులు - అర టేబుల్ స్పూను, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, కారం - 100 గ్రా., నువ్వుపప్పు నూనె - పావు కేజీ, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, వెల్లుల్లి రేకలు - 10. తయారీ:  ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడగాలి.  ఉప్పు జత చేసిన నీళ్లు గోరు వెచ్చని నీళ్లలో క్యాలీఫ్లవర్ తరుగును సుమారు పది నిమిషాలు ఉంచాక, నీళ్లను వడకట్టాలి.  తడి పూర్తిగా పోయేవరకు క్యాలీఫ్లవర్‌ను నీడలో ఆరబెట్టాలి.  బాణలిలో నూనె పోసి కాగాక, క్యాలీఫ్లవర్ తరుగు వేసి సన్న మంట మీద సుమారు ఐదు నిమిషాలు వేయించి, నూనె తీసి పక్కన ఉంచాలి. (నూనెలోనే ఉంచితే ముక్కలు మెత్తబడిపోతాయి)  బాణలిలో నూనె లేకుండా మెంతులు వేయించి, చల్లారాక పొడి చేసి పక్కన ఉంచుకోవాలి.  ఆవాలను ఎండ బెట్టి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.  పెద్ద పాత్రలో క్యాలీఫ్లవర్ ముక్కలు, పక్కన ఉంచిన నూనె వేసి కలపాలి.  ఆవ పొడి, మెంతి పొడి, కారం, ఉప్పు, పసుపు, మెత్తగా చేసిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి.  నిమ్మరసం వేసి మరోమారు కలపాలి.  తడి లేని జాడీలో నిల్వ చేసుకోవాలి.  ఫ్రిజ్‌లోఉంచితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది.  విడిగా ఉంచితే 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది.  వేడివేడి అన్నంలో, కమ్మటినెయ్యితో క్యాలీఫ్లవర్ ఆవకాయ అందిస్తే రుచిగా ఉంటుంది.
 
ఉల్లిపాయ క్యాలీఫ్లవర్ సూప్

కావలసినవి: రౌండ్ బ్రెడ్ - 1 స్లైసులు, వెన్న-2 టేబుల్ స్పూన్లు (కరిగించాలి)
 సూప్ కోసం: ఉల్లితరుగు - కప్పు, క్యాలీఫ్లవర్ తరుగు - కప్పు, వెల్లుల్లి రేకలు - 2 (సన్నగా తరగాలి), బటర్ లేదా ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, మైదా పిండి - టేబుల్ స్పూను, ఉడికించిన కూరగాయల నీళ్లు (వెజిటబుల్ స్టాక్) - 2 కప్పులు, పాలు - కప్పు (చిక్కటివి), కుంకుమ పువ్వు - చిటికెడు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - 2 టీ స్పూన్లు. తయారీ:  బ్రెడ్ బౌల్, బ్రెడ్ పై భాగంలో గుండ్రంగా కట్ చేసి బౌల్ మాదిరి చేసుకోవాలి.  కరిగించిన బటర్‌ను బ్రెడ్ లోపలి భాగమంతా పూతలా పూయాలి.  అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసి, బ్రెడ్ బౌల్స్‌ను సుమారు 20 నిమిషాలు బేక్ చేయాలి. సూప్ తయారీ:  పాన్‌లో బటర్ లేదా ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి వెల్లుల్లి రేకలు వేసి కొద్ది సేపు వేయించాలి.  ఉల్లి తరుగు, క్యాలీఫ్లవర్ తరుగు జత చేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి.  మైదా పిండి వేసి బాగా కలపాలి.  వెజిటబుల్ స్టాక్ జత చేసి బాగా కలపాలి.  పాలలో కలిపిన కుంకుమ పువ్వు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, మరిగాక సన్నని మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచితే సూప్ బాగా చిక్కబడుతుంది.  సూప్‌ను బ్రెడ్ బౌల్స్‌లో వేసి వేడివేడిగా అందించాలి.  (బ్రెడ్ బౌల్స్ అవసరం లేదనుకుంటే, మామూలు పాత్రలో సూప్ సర్వ్ చేసుకోవచ్చు)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement