
మృతుడు బండి సుధాకర్ భార్య, పిల్లలు
వ్యవసాయాన్నే జీవనాధరం చేసుకొని కుటుంబ పోషణ కోసం రేయింబవళ్లు కష్టపడినా.. కాలం కలసి రాక పేరుకుపోయిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. బంగి సుధాకర్ ఆత్మహత్య పాలై 16 నెలలు గడిచినా పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని తెలుసుకుంటే ఎవరికైనా గుండె గొంతుకలోకి వస్తుంది.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండల కేంద్రానికి చెందిన సుధాకర్(35) అనే రైతు అప్పుల పాలై 2017 ఆగస్టు 24న పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తండ్రి సోమన్న పేరు మీద∙రెండు ఎకరాల పొలం ఉంది. దీనికి తోడు మరో 13 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. అయితే, సొంత పొలం కేవలం రెండు ఎకరాలే ఉందన్న సాకుతో బ్యాంకులో అప్పు ఇవ్వలేదు. దీంతో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి సాగు కోసం రూ.5 లక్షలు అప్పులు చేశాడు. కొండంత ఆశతో సాగు చేసిన పంటలు వర్షాల్లేక సరిగ్గా పండకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. చేసిన రూ.5 లక్షల అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో కలవరం మొదలై పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అనుమంతమ్మ, 4గురు పిల్లలు ఉన్నారు. కుమార్తె స్ఫూర్తి(11) ఆరో తరగతి, గణేష్(9) నాలుగో తరగతి, కవల పిల్లలు రాజు, రాజేష్ (5) యూకేజీ చదువుతున్నారు.
ఆర్డీఓ విచారణ చేసి వెళ్లారు.. సాయం అందలేదు..
భర్త ఆత్మహత్య చేసుకోవడంతో నలుగురు పిల్లల పోషణ తనకు కష్టంగా మారిందని అనుమంతమ్మ అన్నారు. కూలీ నాలీ చేసి పిల్లల ను పోషిస్తున్నారు. ఆదోని ఆర్‌డీఓ వచ్చి విచారణ చేసి వెళ్లారని, అయినా తమకు ఎలాంటి సహయం చేయలేదన్నారు.
– పి. గోపాల్, సాక్షి, పత్తికొండ, కర్నూలు జిల్లా