దుప్పట్లకు కావాల్సిందే ఇక చప్పట్లు!
మన తెలుగువారు దేనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యం దానికి ఇవ్వరని ప్రతీతి. కాస్తంత స్థిమితంగా ఆలోచిస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే... దుప్పటికంటే చిన్న సైజులో ఉంటే శాలువాకు సన్మానాల సమయంలో ఎనలేని సభా గౌరవం ఉంది. ఆ మాటకొస్తే అంతకంటే చిన్నదైన ఎరుపురంగులో ఉండే కొత్త కండువా సైతం శుభకార్యాల్లో యజమాని భుజానికెక్కుతుంది. ఆఖరికి తుండుగుడ్డ కూడా సామాన్య రైతుల తలమీదికెక్కి తైతక్కలాడుతుంది. ఇక గొంగళి మాట చెప్పేదేముంది.
అభ్యుదయ గేయకర్తలు, జానపద కళాకారులూ దానికి ఎనలేని ఖ్యాతి తెచ్చారు. విప్లవాన్ని కాంక్షించే ప్రజాకళాకారుడెవరైనా గొంగళి కప్పుకోవాల్సిందేనంటూ ఫత్వాలాంటి అప్రకటిత ఆదేశిక సూత్రాన్ని అలిఖిత రాజ్యాంగం ద్వారా ప్రకటించారు. ఆ డ్రెస్‌కోడ్‌ను కంపల్సరీ చేసేసి, గద్దరులాంటి వాగ్గేయకారులు దానికి ఎనలేని గ్లామరు తెచ్చారు. ఎంత ముతకగా ఉంటేనేం... అభ్యుదయానికి ఆటపట్టు గొంగళి. కానీ అటు శాలువా/తువ్వాళ్లకూ, ఇటు గొంగళికీ సెంటర్లో ఉండే దుప్పటి మాత్రం.... పాపం ఎటూగాకుండా అన్యాయమైపోయింది.
కానీ దుప్పటిని ఒకసారి శ్రద్ధగా పరిశీలించండి. దాని గొప్పదనం తెలుస్తుంది. తెలుగు సినిమా రంగానికి ఇతోధికంగా సేవ చేసింది దుప్పటేనంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమాలో అనేక సింబాలిక్ సీన్లకు ప్రతీక దుప్పటి. ఓ క్యారెక్టర్ యాక్టరు భుజాల వరకు దుప్పటి కప్పుకుని దగ్గుతూ పడుకున్నాడు/పడుకున్నదంటే... సదరు ఆసామి జబ్బుమనిషి అని అర్థం. అక్కినేని లాంటి అగ్రశ్రేణి తారలంతా శాలువాను భుజాలకెక్కించుకున్నారు గానీ... సపోర్టింగ్ యాక్టర్లు ఎన్నిసార్లు కప్పుకున్నా పాపం... దుప్పటికి సరైన గౌరవం దక్కలేదు.
ఇక ఆ జబ్బుమనిషి దగ్గరికి డాక్టర్ వచ్చి ‘‘అయామ్ సారీ!’’ అంటూ భుజాల వరకు ఉన్న దుప్పటిని తల మీదికి పాకించేశాడంటే... సదరు వ్యక్తి ఎలాంటి నటననూ ప్రదర్శించకపోయినా... దుప్పటే ఆ లోటును భర్తీ చేసి సన్నివేశాన్ని రక్తికట్టిస్తుంది. ఇలా దుప్పటి తెలుగు సినీ రంగానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇక సినీ గేయ రచయితలు సైతం ‘దుప్పట్లో దూరాక దూరమేముంది’ లాంటి అనేక గేయాలు రచించి దాని పట్ల తమ అభినివేశాన్ని చాటుకున్నారు. ఇంతటి ఖ్యాతి గడించిన దుప్పటి తరతరాలుగా మన తెలుగువారి నిర్లక్ష్యానికి లోనవుతూనే ఉంది.
ఇక మన తెలుగువాళ్లు గుర్తించని దాన్ని పొరుగువాళ్లు గుర్తించి గౌరవించడం మామూలే కదా. చిన్నది కప్పుకునే ఓణీకి చున్నీ అని చిన్ని పేరు పెట్టుకుని... ఇది చాల్లే అని సరిపెట్టేశాం. కాని మన దక్షిణభారత దుప్పటి జ్ఞాపకార్థం వింధ్యకు ఆ వైపు ఉన్న ఉత్తర భారతదేశస్తులంతా మూకుమ్మడిగా తాము ఓణీలా ధరించే వస్త్రవిశేషానికి ‘దుపట్టా’ అని పేరు పెట్టి మనం నిత్యం కప్పుకునే దుప్పటిని వాళ్లు నిత్యం స్మరిస్తున్నారు. పొరుగువాళ్లు గుర్తించారు కాబట్టి ఇకనైనా దానికి సరైన గౌరవం దక్కుతుందేమో అని నేనంటే... నువ్వే కదా దాని టాలెంట్‌ను ‘తొక్కేస్తుంటావ్’ అన్నాడు మా ఫ్రెండు. అదెప్పుడ్రా అని నేను తెల్లబోతే... ‘రోజు రాత్రి పక్క మీద’ అంటూ దుప్పటి కప్పి చుట్టుముట్టి కొట్టిన ఫీలింగ్ తెచ్చేశాడు.
- యాసీన్