మిడతలకు చెవులున్నాయా?
మిడుతలకు మనలాగ చెవులుండవు. కాని వాటి జీవితంలో శబ్దానికి చాల ప్రాముఖ్యముంది. అసలు చెప్పాలంటే వాటికి తోడు కావలసిన మిడతల్ని కనుక్కునేందుకు ఈ శబ్దమే ముఖ్యమైన సాధనం. మగ మిడతలను ఒక గాజు గిన్నెలో ఉంచినపుడు, వాటిని గురించి ఆడ మిడతలు అసలు పట్టించుకోవని శాస్త్రజ్ఞులు వారి పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఆడమిడతలు గాజు గిన్నెలోని మగ మిడతల్ని చూడగలిగినప్పటికీ వాటిని వినలేకపోయినందువల్ల సరిగా గుర్తించలేకపోయాయి.
కాని ఒక మైక్రోఫోను ఆ మగ మిడుత శబ్దాన్ని స్పీకరుకు అందించినపుడు ఆడ మిడతలు ఎంతో సంతోషంగా ఆ గాజుగిన్నె చుట్టూ చేరినట్లు పరిశోధనల్లో తేలింది. అసలు విషయం ఏమిటంటే...మిడుతలకు చెవులుండవు. వాటికి బదులు వాటి ముందు కాళ్ళలో శబ్ద గ్రాహకాలు ఉంటాయి. అవి మద్దెలలాగ ఉంటాయి. ప్రతి ‘మద్దెల’ మధ్యలో ఒక గుండ్రటి కొమ్ములాంటి అమరిక ఉంటుంది. ఈ ‘మద్దెల’ పల్చటి చర్మాలు చుట్టుపక్కల ఉన్న శబ్దతరంగాలను - మిగతా క్రిమికీటకాలు చేసే చప్పుళ్ళను గ్రహించి ఆ మిడుత నాడీవ్యవస్థకు పంపుతాయి. అక్కడ ఆ శబ్దాల్ని డీకోడ్ చేసుకుంటాయి.