
ఇంకో మూడేళ్లలో జంతువులు ఏవీ పెంచకుండానే మాంసపు బర్గర్ తినొచ్చు. నెదర్లాండ్స్ స్టార్టప్ కంపెనీ మోసా మీట్ ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. జంతు కణాలను పరిశోధన శాలల్లో కృత్రిమ పద్ధతుల్లో పెంచడం ద్వారా తయారయ్యే మాంసం ఇప్పటికే తయారవుతున్నప్పటికీ ఖరీదు చాలా ఎక్కువ. ఈ సమస్యను అధిగమించేందుకు మోసా మీట్ భారీఎత్తున నిధులు సమీకరిస్తోంది. ఎక్కువ ఖర్చుతో పరిశోధనశాలను ఏర్పాటు చేసినా.. ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం ద్వారా కృత్రిమ మాంసం ధరలను తగ్గించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు.
అన్నీ సవ్యంగా సాగితే 2021 నాటికి కృత్రిమ మాంసంతో తయారయ్యే బర్గర్ ఖరీదు తొమ్మిది డాలర్ల వరకూ ఉండవచ్చునని.. రానున్న ఏడేళ్లలో ఈ ధర మరింత తగ్గవచ్చునని అంచనా. మోసా మీట్ ప్రయత్నానికి గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సెర్గీ బ్రిన్, స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ ఒకటి మద్దతు పలుకుతున్నట్లు, నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. తాము ఉత్పత్తి చేసే కృత్రిమ మాంసం జంతువుల కండరాల నుంచి సేకరించిన కణాలతో తయారవుతుందని, జంతువులకు మత్తు మందు ఇచ్చి బయాస్పీ ప్రోబ్ ద్వారా కణాలను సేకరిస్తామని, ఆ తరువాత పరిశోధనశాలలో కొన్ని రసాయనాలను జోడించి కణాలు ఎదిగేలా చేస్తామని ఒక శాస్త్రవేత్త వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment