
అరచేతుల్లో ఆషాఢం
పెళ్లికాని అమ్మాయిల ఊహలకు
గోరింట అందాలు అద్దడానికే
ఆషాడం వచ్చి ఉంటుంది.
ఎర్రగా పండిన అతివ అరచేతులను
కళ్లింతలు చేసుకొని చూడటానికే
ఆషాఢం పుట్టి ఉంటుంది.
చినుకు తడిని చిద్విలాసంగా తట్టుకునేలా
తరుణులకు అండగా ఉండటానికే
ఆషాఢం సిద్ధపడి ఉంటుంది.
ఆషాఢమాసాన అరచేతుల్లో అందంగా మెరిసిపోయే గోరింట ఆధునిక జీవనంలో ఎన్ని పుంతలు తొక్కిందో తెలుసుకుందాం...
కోమలమైన చేతుల కోసం ఎర్రన్ని గోరింట మోసుకువచ్చే ఊసులేమిటో కనుక్కుందాం...
గోరింట చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, చేతులకు పెట్టి, రెండు నుంచి ఆరు గంటల సేపు ఉంచితే ఎరుపు రంగులో మారుతుంది. ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. చర్మసంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజెన్లైన్నో సృష్టించారు సృజనకారులు.
వేదాలలో...
గోరింట రంగును సూర్యునికి ప్రతీకగా చెప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. జ్ఞాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు.
అరబిక్ భాషలో...
‘హిన్నా’ అనే పదం నుంచి ‘హెన్నా’ వచ్చింది. గోరింటాకు పొడిని హెన్నాగా పేర్కొంటుంటారు. సంస్కృతంలో గోరింట చెట్టును ‘మేంధికా’ అంటారు. ఆ పదం నుంచే మెహిందీ వచ్చింది.
ఐదు వేల ఏళ్ల వయసు...
అదృష్టానికి, ఆరోగ్యానికి గోరింటను ప్రతీకగా అరబ్‌దేశాలలో ఐదు వేల ఏళ్ల క్రితమే వాడినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్లు ఇంట్లో ఉంటే ఆత్మలు దరిచేరవని, మంచి భావాలను కలిగిస్తుందని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకునేవారు. వీటి వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని భావించేవారు.
ఈజిప్ట్ నుంచి...ఈజిప్ట్ ‘మమ్మీ’ల జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకును వాడేవారని వార్త ఉంది. క్రీ.పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిప్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
మతాలకు అతీతం... క్రిస్టియన్, హిందూ, ముస్లిమ్.. ఇలా ఏ మతం వారికైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు. క్రిస్టియన్ పెళ్లివేడుకలలో వెలిగిపోతుంది. తెలుగింటి పల్లెపడుచు చేతుల్లో ఒదిగిపోతుంది. ముస్లిమ్ మగువ ముంజేతులను చక్కగా అలంకరిస్తుంది.
ఇంట్లోనే కోన్ తయారి...
► గోరింటాకు ఆకులను తెచ్చి, శుభ్రపరిచి, ఎండబెట్టాలి. తర్వాత పొడి చేయాలి. (పొడి మెత్తగా రావాలని మిక్సర్‌లో గ్రైండ్ చేయకూడదు. రోట్లో దంచి, పొడి చేసుకుంటే మేలు)
► 100 గ్రాముల గోరింటాకు (మెహెందీ) పొడి (4 కోన్స్ తయారుచేసుకోవచ్చు)ని, నైలాన్ వస్త్రంపై వేసి, కనీసం రెండు మూడు సార్లు జల్లెడ పట్టాలి.
► అర కప్పు నీటిలో టీ స్పూన్ తేయాకును కలిపి ఆ నీళ్లను మరిగించాలి.
► నాలుగు రేకల చింతపండు, టీ స్పూన్ పంచదార కప్పు నీటిలో వేసి 10 నిమిషాలు ఉంచాలి.
► మూడు వంతుల నీటికి, ఒక వంతు నిమ్మరసం, మూడు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి కలపాలి. దీంట్లో గోరింటాకు పొడి వేసి, మృదువుగా అయ్యేంతవరకు కలపాలి.
► దాదాపు 6 గంటలు అలాగే ఉంచి, ఆ తర్వాత మెహెందీ కోన్‌లో నింపి, నచ్చిన డిజైన్‌తో చేతులను, పాదాలను అలంకరించుకోవచ్చు.
► మరిగించిన కాఫీ నీళ్లు, లవంగాలు మరిగించిన నీళ్లు, నిమ్మరసం, ఎండబెట్టిన నిమ్మముక్కలను మరిగించిన నీరు, వెనిగర్/ఆమ్ల రసం (అసిడిక్ లిక్విడ్)..
అన్నింటినీ కలిపి 10 నిమిషాలు ఉంచి, వడకట్టాలి. ఈ నీటిలో 100 గ్రా॥గోరింటాకు పొడి కలిపి, పది చుక్కల యూకలిప్టస్ ఆయిల్, అంతే మోతాదులో మోహిందీ ఆయిల్ కలపాలి. బాగా కలిపి ఈ మిశ్రమాన్ని గంటసేపు ఆలాగే ఉంచాలి. 24 గంటలలోపు ఈ మిశ్రమాన్ని వాడాలి.
మెహెందీ డిజైన్స్ సింధూరం రంగులో ..
చమెహెందీ పొడిలో బెల్లం నీళ్లు, సిందూర్ వేసి, కలిపి, డిజైన్లకు ఉపయోగించాలి. 30 నిమిషాల్లో సహజసిద్ధమైన రంగుతో డిజైన్ ఆకట్టుకుంటుంది. చర్మ సమస్యలూ దరిచేరవు.
మరింత ఎర్రగా...
► నిమ్మరసంలో తగినంత పంచదార కలిపి, ఆ చిక్కటి మిశ్రమం లో దూది ఉండను ముంచి, ఎండిన డిజైన్‌పై అద్దాలి. దీని వల్ల డిజైన్ మరింత ఎరుపురంగులోకి మారుతుంది.
► మెహెందీని తొలగించడానికి సబ్బు నీటిని ఉపయోగించకూడదు. అలాగే వెంటనే నీళ్లతో కడిగేయకుండా, మెహిందీని టూత్‌బ్రష్‌తో తొలగింయాలి.
► పాన్‌లో లవంగాల పొడిని వేసి, వేడి చేయాలి. ఆ పొగకు డిజైన్ చేతులను ఉంచాలి.
► ఆలివ్/కొబ్బరి/నువ్వుల నూనెను రంగుపై అద్ది, మృదువుగా రాయాలి.
మెహెందీ డిజైన్లలో వైవిధ్యం...
► సంప్రదాయ డిజైన్లంటే విసుగు చెందినవారు కొత్త డిజైన్లను సృష్టిస్తూనే ఉన్నారు. వాటిలో సాధారణ, బ్రైడల్, ఇండియన్, అరబిక్... డిజైన్లు పోటీ పడుతున్నాయి.
► షేడెడ్, బ్యాంగిల్, ఫ్లోరల్, మోటిఫ్స్... ఇలా తీర్చిన డిజైన్లలో రంగురంగుల రాళ్లు, పూసలు, గ్లిట్టర్ (మెరుపుతో ఉండే పచ్చని రంగు)ను కూడా ఉపయోగిస్తున్నారు.
► డిజైన్‌ను వేయించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అలాగే ఖర్చుతో కూడుకున్నపని కూడా. మార్కెట్లో మెహెందీ స్టిక్కర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కావల్సిన పరిమాణంలో ఒంటిమీద అతికించుకొని, ఖాళీలలో మెహెందీని నింపాలి. డిజైన్ ఆరిన తర్వాత స్టిక్కర్‌ను తొలగించాలి.
► మెహెందీ అవసరం లేకుండానే డిజైన్లను వేసుకోవచ్చు. డిజైనర్ స్టిక్కర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని తెచ్చి, అతికించుకోవడమే.
పరీక్షించుకోవాలి...
మెహెందీ డిజైన్ బాగా ముదురు రంగులోకి రావడానికి మిశ్రమంలో సింథటిక్ రసాయనాలను కలుపుతారు. ఇవి అలెర్జిక్ రియాక్షన్లకు కారణం అవుతుంది. డిజైన్ వేయించుకోవడానికి ముందు ఆ మెహెందీ చర్మానికి సరిపడుతుందా అనేది పరీక్షించుకోవాలి. చెవి వెనుక భాగంలో లేదా మోచేతి దగ్గర మెహెందీ రాసుకొని, 3-4 రోజుల తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేదంటే అప్పుడు డిజైన్ వేయించుకోవాలి. కోన్‌కు- కోన్‌కు మధ్య తయారీలో, నాణ్యతలో తేడా ఉంటుంది. అందుకని ప్రతీసారి జాగ్రత్తపడటం ముఖ్యం. బ్లాక్ మెహెందీ వల్ల ఎక్కువ చర్మ సమస్యలు వస్తున్నాయి. ఈ మెహిందీ డిజైన్ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోయి, పొక్కులు, చీము కనిపిస్తుంటుంది. ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకును ఉపయోగించడమే శ్రేయస్కరం.
శైలజ సూరపనేని
కాస్మటిక్ డెర్మటాలజిస్ట్, హైదరాబాద్