కనీసం మీరైనా అర్థం చేసుకోరూ..!
అమ్మానాన్నలతో కలిసి మా పెదనాన్న కూతురి పెళ్లికి వెళ్లానో రోజు. పెళ్లికొడుకుతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు. అతను పెళ్లికొడుక్కి బెస్ట్ ఫ్రెండ్ అట. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం. బాగా సంపాదిస్తున్నాడు. మనిషి కూడా బావున్నాడు. ఆ రోజు అతను స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. కానీ అతను మాత్రం నాకు అట్రాక్ట్ అయ్యాడు. నేనెక్కడుంటే అక్కడికి వచ్చేవాడు. ఇబ్బందిగా అనిపించేది. పెళ్లికొడుకు తరఫువాడు కాబట్టి ఏమీ అనలేను. దాంతో అతడు మరింత చనువు తీసుకున్నాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దగ్గరికొచ్చి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ముక్కూ ముఖం తెలియనివాడితో పెళ్లేంటి! అందుకే ‘నో’ చెప్పి వెళ్లిపోయాను.
అక్కడితో వదిలేస్తాడనుకున్నాను. కానీ విషయాన్ని మా అమ్మానాన్నల వరకూ తీసుకెళ్లాడు. అమ్మా నాన్నా ఎగిరి గంతేశారు. ఓకే అనేశారు. కనీసం నా ఇష్టం తెలుసుకోకుండా, ముహూర్తాలు కూడా పెట్టించేశారు. నన్ను ఆయన చేతిలో పెట్టేశారు. మొదటిరాత్రి ఆయన తనకున్న సరదా అఫైర్ల గురించి చెప్పారు. నన్నూ చెప్పమని బలవంతపెట్టారు. దాంతో నేను మా క్లాస్‌మేట్‌ని ఇష్టపడిన విషయం, అతడికి నా మనసులో మాట చెప్పేలోపే నాకు పెళ్లి కుదిరిపోయిన విషయం చెప్పాను. అతనేదో సరదాగాతీసుకుంటాడనుకున్నాను. అయితే అంతెత్తున లేచారు. మోసం చేశావన్నారు. నిందలు వేశారు. నిప్పులు కక్కారు. నన్ను దోషిని చేసి పదిమందిలో నిలబెట్టారు.
అమ్మానాన్నలు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు సరికదా, నీ ప్రేమకథలన్నీ ఎవడు చెప్పమన్నాడు అంటూ విరుచుకుపడ్డారు. నేనతన్ని ఇష్టపడ్డానే కానీ, కనీసం అతనికి చెప్పనైనా చెప్పలేదు అని ఎంత మొత్తుకున్నా ఎవరికీ బుర్రకెక్కలేదు. మా వారయితే... మనసులో మరొకరిని పెట్టుకున్న నీతో కాపురం చేస్తే వ్యభిచారంతో సమానం అన్నారు. ఆ మాట నా మనసును విరిచేసింది. ప్రేమించానంటూ వెంటపడి, అందరినీ ఒప్పించి పెళ్లాడిన వ్యక్తి చిన్న విషయానికే అంతగా రియాక్ట్ అవ్వడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాంటివాడు ముందు ముందు ఎంత నరకాన్ని చూపిస్తాడో! అందుకే విడాకులు ఇవ్వమంటే మారు మాట్లాడకుండా ఇచ్చేశాను. ఎంత వేగంగా పెళ్లి జరిగిందో... అంతే వేగంగా మా బంధం విచ్ఛిన్నమైపోయింది.
ఆ తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకున్నాడు. కానీ నాకు మాత్రం మరో మగాడికి నా మనసులో కానీ, జీవితంలో కానీ చోటివ్వాలనిపించలేదు. అమ్మానాన్నలు కూడా నన్ను చేరదీయకపోవడంతో తెలిసినవారి సాయంతో బెంగళూరు వెళ్లిపోయాను. కష్టపడి బోలెడు సంపాదించాను. అమ్మ చనిపోయినప్పుడు కనీసం కబురైనా చెప్పలేదు నాన్న. కానీ నాన్న చనిపోయినప్పుడు మాత్రం బంధువులు కబురు పెట్టారు. దాంతో తిరిగొచ్చేశాను. అన్ని కార్యాలూ జరిపించి, ఆపైన ఇక్కడే ఉండిపోయాను. మొదట్లో నాకంటూ ఎవరూ లేరే అన్న బాధ తొలిచేసేది. కానీ ఓ పాపను దత్తత తీసుకున్నాను. దాంతో ఒంటరిదాన్ని అన్న భావన తొలగిపోయింది.
ఇప్పటికీ చాలామంది నావైపు అదోలా చూస్తుంటారు. జరిగినదాంట్లో నా తప్పు లేదన్న విషయం వాళ్లెవరికీ అర్థం కాదు చెప్పినా. కన్న తల్లిదండ్రులే నన్ను అర్థం చేసుకోనప్పుడు బయటివాళ్లెలా అర్థం చేసుకుంటారు! అర్థం చేసుకోలేని వ్యక్తితో జీవితాన్ని పంచుకోకపోవడమే మంచిది. నా నిర్ణయాన్ని మీరైనా సమర్థిస్తారని నమ్ముతున్నాను.
- దమయంతి, ఆముదాలవలస