భారత దేశంలో ప్రతి జీవన సందర్భాన్ని, ప్రతి ప్రకృతి సందర్భాన్ని పండుగ చేశారు. మానసిక, శారీరక ఆరోగ్యాల కోసం మాత్రమే కాక ఉల్లాసం కోసం ఉత్సాహం కోసం కూడా పండగలను స్థిర పరిచారు. సంస్కృతిని బల పరచడానికి ఇవి అవసరం అని భావించడం వల్లే వాటి కొనసాగింపుపై శ్రద్ధ పెట్టారు. అలాంటి పరంపరలో ఒక భాగమే అట్ల తదియ నోము. ఈ నోమును ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానంతో జరుపుకుంటారు. ఈ నోములో సూర్యోదయానికి ముందే భుజించాలి. దీనిని ఉట్టి కింద ముద్ద అంటారు.
అనంతరం రాత్రివరకు జరిగే ఉపవాసంలో రకరకాల ఫలాలు (అరటి, జామ, బత్తాయి, దానిమ్మ మొదలైనవి) సేవించవచ్చు. తాంబూలసేవన చెయ్యొచ్చు. చీకటి పడుతూనే చంద్రమాదేవత (చంద్రుడు) కు పూజ చేసి అనంతరం అట్లను వాయినాలివ్వటం, సేవించటం జరుగుతుంది. కుటుంబపు అలవాట్లను బట్టి అట్లలోకి నంజుకోవడానికి నువ్వుల పప్పు, వేరుసెనగపప్పు వంటి పచ్చళ్లు, తేనె, తిమ్మనం (పాయసం లాంటిది) తయారు చేసుకుంటారు. పగలంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. పైన ప్రస్తావించిన ఆహారపదార్థాలలో కొన్ని ముఖ్యమైన వాటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్దాం.
అరటి పండు: ఈ పండుకు కదళీ, వారణా, మోచా మొదలైన సంస్కృత పర్యాయపదాలు ఉన్నాయి. బొంత అరటి, అమృతపాణి, చక్కెరకేళి మొదలైనవి అరటిపళ్లలో కొన్ని రకాలు.
గుణాలు: తియ్యగా రుచికరంగా ఉంటుంది. ఆకలి తీరటానికి మంచి ఫలం. దౌర్బల్యాన్ని, నీరసాన్ని పోగొడుతుంది. కండను పెంచి పుష్టిని కలిగిస్తుంది. వీర్యవర్థకం. నేత్ర, మూత్ర, హృదయ రోగాలను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును తగ్గించటానికి, నెత్తురు (హీమోగ్లోబిన్)ను పెంచటానికి ఉపయుక్తం.
(మోచఫలం... స్వాదు వృష్యంచ బృంహణం; క్షుత్ తృష్ణా నేత్ర గత హృత్ మేహఘ్నం, రుచి మాంసకృత్)
దానిమ్మ: దాడిమ, దంతబీజ, లోహితపుష్ప మొదలైనవి కొన్ని సంస్కృత పర్యాయపదాలు. తియ్యగా ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతాయి. రుచికరం, బలకరం,
ఆకలిని పుట్టిస్తాయి. గుండె రోగాలలో చాలా ప్రయోజనకారి. మేధాశక్తిని పెంచుతాయి. రక్త, వీర్య ఓజోవర్థకంగా పనిచేస్తుంది. జ్వరహరం, నోటి పూతల విషయంలో, కంఠ రోగాలలోకు గుణకారి.
(దాడిమః.... తృట్ దాహ జ్వరనాశనం; దీపనం, రుచ్యం, మేధా బలావహం, హృత్కంఠ ముఖరోగనాశకం, తర్పణం, శుక్రలమ్)
బత్తాయి: దీనినే తియ్య నిమ్మ అని కూడా అంటారు. మధుజంబల, శంఖద్రావీ, శర్కరక మొదలైనవి కొన్ని సంస్కృత పర్యాయపదాలు. అరుచిని, దప్పికను పోగొడుతుంది. వాంతిహరం, బలకరం, దేహపు బరువుని పెంచుతుంది. రక్తదోషాలను హరిస్తుంది. విషాన్ని హరించి, గుండెకు కూడా బలాన్నిస్తుంది.
తమలపాకు: నాగవల్లీ, తాంబూల, ఫణివల్లీ, భుజంగలతా మొదలైనవి కొన్ని సంస్కృత పర్యాయపదాలు. వగరు, కారం, చేదులతో కూడిన రుచి కలిగి ఉంటుంది. జీర్ణక్రియను పెంచి, వేడి చేస్తుంది. కఫహరం. నోటి దుర్వాసనను పోగొడుతుంది. బలకరం, కామోద్దీపనం. తమలపాకు రసాన్ని కొంచెం తేనెతో కలిపి సేవిస్తే దగ్గు తగ్గిపోతుంది. కంఠం శుద్ధి అవుతుంది.
పోక (వక్క): పూగీ, పూగ, గువాక అనేవి పోక చెట్టుకు పర్యాయపదాలు. పూగీఫల, ఉద్వేగ... పోక కాయకు సంస్కృత నామాలు. పచ్చి పోకకాయ ఆకలిని మందగింప చేస్తుంది. సిరా
ధమనులలో అవరోధం కలిగిస్తుంది. ఉడకబెట్టి, ఎండబెట్టి తయారుచేయబడినవి ఆకలిని పెంచి, రుచికరంగా ఉండి, చలవ చేస్తాయి. మోహకరం, కఫపిత్త హరం. ఏది ఏమైనా దీనిని ఎక్కువగా సేవిస్తే హానికరం.
మినుములు: దీనిని సంస్కృతంలో మాష అంటారు. జిగురు కలిగి ఉంటాయి. గుర్వాహారం (ఆలస్యంగా జీర్ణమై, శరీరం బరువెక్కిన అనుభూతి కలిగిస్తుంది). బలకర, శుక్రకర, శరీరంలో కొవ్వును, బరువును పెంచుతుంది. మలమూత్రాలను సాఫీగా చేస్తుంది. మూలవ్యాధిని తగ్గిస్తుంది. కడుపులోని పుళ్లను తగ్గించి, నొప్పిని తొలగిస్తుంది. ఆయాసాన్ని పోగొడుతుంది. ముఖ పక్షవాతం (అర్దితవాతం) విషయంలో గుణకారి. బాలింతలలో చనుబాలను వృద్ధి చేస్తుంది.
(మాషో... స్రంసన, తర్పణ, బల్యః, శుక్రల, బృంహణః.... గుదకీల, అర్దిత, శ్వాస, ఉదర శూలాని నాశయేత్)
గమనిక: నోములో భాగంగా వాయినాలకి చ్చే అట్లను మినప్పిండి, వరిపిండి కలిపి దోసెలా చేస్తారు. ఈ అట్లను రాత్రి చంద్రుడిని చూసిన తరవాత, వ్రతం చేసిన మహిళలు సేవించాలి.
తిమ్మనం: అట్లలో నంజుకొనే పచ్చళ్లు ఒక రకమైతే, ఈ తిమ్మనం (పాయసం వంటిది) మరొక రకం. దీని తయారీలో పాలు, శర్కర ప్రధాన ద్రవ్యాలు. మూడవది బియ్యప్పిండి (వరి పిండి). ఏలకులు, పచ్చ కర్పూరం సుగంధ్ర ద్రవ్యాలు. వరిపిండికి బదులు కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పాలగుండ పలుకులు వాడతారు. వాస్తవానికి ఇది అడవి పెండలం అనే దుంపను సుదీర్ఘంగా శుద్ధి చేసి, దానిలోని పీచు పదార్థాన్ని తొలగించి, వేడి నీటిలో ఉడికించి తయారుచేస్తారు. తరవాత పలుకులుగా ఉన్నవాటిని పిండిగా తయారు చేస్తారు. దీనికి వృక్షశాస్త్ర సాంకేతిక నామం డయాస్కోరియా బల్బిఫెరా.
ఈ పేరుపై చాలారకాల దుంపలు ఉన్నాయి (తినదగినవి, హాని చేసే తినకూడనివి కూడా). ఈ పిండినే ఈ సందర్భంలో పాలగుండ అంటారు. ఇది దేహానికి చలవ చేసి (శీతలం), అత్యధిక శక్తిని ఇస్తుంది. మంచి పోషకాహారం. ఎసన్షియల్ ఎమైనా యాసిడ్సు, అధికస్థాయి పిండి పదార్థాలు దీంట్లో లభిస్తాయి. అందుకే కొందరు గిరిజనులు ఈ దుంపను ప్రధాన ఆహారంగా వాడతారు. కొన్ని ప్రాంతాలలో పాలు, శర్కరకు బదులు చెరకు రసం ఉపయోగించి తిమ్మనం తయారుచేస్తారు.
గుర్తుంచుకోవలసిన సారాంశం...
ఫలములన్నియు మిక్కిలి బలకరంబు
పోకతాంబూలసేవన ముదకరంబు
ఇష్టమైనట్టి మినపట్లు తృప్తి కరము
తిరుగులేనిది తెలుగింటి తిమ్మనంబు
మధుపాయస ద్రవ్యంబు మనసు దోచు.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment