ప్యానిక్ అటాక్స్ అపాయకరం కాకున్నా...ఆందోళనకరం | Attacks can be dangerous if not disturbing pyanik ... | Sakshi
Sakshi News home page

ప్యానిక్ అటాక్స్ అపాయకరం కాకున్నా...ఆందోళనకరం

Published Mon, Jul 28 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

Attacks can be dangerous if not disturbing pyanik ...

అకస్మాత్తుగా మీరు పయనిస్తున్న విమానం కొద్దిసేపట్లో కూలిపోతుందన్న వార్త తెలిసిందనుకోండి. మీ మనఃస్థితి ఏమిటి? లేదా అదే విమానం అత్యంత భయంకరులైన ఉగ్రవాద హైజాకర్ల పాలైందని తేలిందనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఉద్రిక్తత, ఉద్వేగం, ఆవేశాలతో పాటు భయం, ఆందోళన ముప్పిరిగొంటే ఆ భావోద్వేగానికి పేరేమిటి? అకస్మాత్తుగా అంతులేని భయానక స్థితి తారస్థాయికి చేరుకోవడం... అంటే ఒక భయవిహ్వల స్థాయికి చేరుకోవడం అన్నమాట. ఇంగ్లిష్‌లో ఈ ఉద్వేగం పేరే ప్యానిక్ కావడం. ఇక చావుకు కొద్దిదూరంలోనే ఉన్నామనే లాంటి ఆ మానసిక స్థితి అయిన ప్యానిక్ అటాక్‌పై అవగాహన కోసం ఈ కథనం.
 
ప్యానిక్ అటాక్ అంటే...?

ప్యానిక్ అటాక్ అనేది ఉద్విగ్నతకు లోనైన పరిస్థితుల వల్ల వచ్చే ఒక రుగ్మత (యాంగ్జైటీ డిజార్డర్). ఇలాంటివి కొందరికి తరచూ వస్తుంటాయి. యుక్తవయస్కులైన వారిలో కనీసం 20 శాతం మందిలో ఇవి జీవితంలోని ఏదో ఒక దశలో కనిపిస్తాయి. ఏదో ఒక విషయంలో అంతులేని భయాందోళన స్థితి అన్నది కౌమారం నుంచి కిశోర దశలోకి వస్తున్నప్పుడు (15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో) ఏదో ఒక సమయంలో కలుగుతుంది. ఇలా ఏదో తెలియని బెంగతో మనసు ఆతృతతో ఉండి వ్యాకులతకు (యాంగ్జైటీకి) గురికావడం అన్నది ఆ వయసులో ఏదో ఒక సందర్భంలో కలిగే అనుభవమే.
 
 ప్రభావాలు
 
ప్యానిక్ అటాక్స్ ఒక వ్యక్తి జీవన శైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వాటికి అగోరాఫోబియా తోడైతే అతడి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఇక చిన్నపిల్లల్లో ఇలాంటి భయాలు ఏర్పడితే వాళ్లు స్కూల్ ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. బలవంతంగా వెళ్లినా అక్కడ చదువుల పట్ల ఆసక్తి చూపరు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు.
 
 రిస్క్ ఫ్యాక్టర్స్
 
 ఒక్కోసారి కొన్ని రకాల కండిషన్స్ అన్నీ కలగలిసి ప్యానిక్ అటాక్స్‌ను రప్పించే రిస్క్‌ను పెంచుతాయి. ఆలోచనలూ, బాహ్యవాతావరణం, ఒత్తిడి ఇవన్నీ ప్యానిక్ అటాక్స్‌ను పెంచే రిస్క్ ఫ్యాక్టర్లే.
 
 ఎంత సేపు కలుగుతాయీ  ప్యానిక్ అటాక్స్...?

 
 ప్యానిక్ అటాక్ వ్యవధి వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. కొందరిలో దాదాపు 10 నిమిషాల కంటే ఎక్కువసేపే ఇది కొనసాగుతుంది. దీని లక్షణాలు గుండెపోటు లక్షణాలను పోలి ఉంటాయి. కొందరిలో ఎలాంటి భౌతిక, భావోద్వేగ కారణాలు లేకపోయినా అకస్మాత్తుగా యాంగ్జైటీ కలిగి ప్యానిక్ అటాక్ రావచ్చు. కొందరిలో తీవ్రమైన ఒత్తిడి రుగ్మత తర్వాత పరిణామంగా (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తర్వాత) గానీ, స్కీజోఫ్రీనియా తర్వాతగానీ ఇలాంటి ప్యానిక్ అటాక్స్ కనిపించవచ్చు. మరికొందరిలో చాలా ఎక్కువగా మద్యం తీసుకున్న తర్వాత లేదా మత్తుపదార్థాలు వాడాక ఇవి కనిపించవచ్చు. ఇంకొందరిలో తమకు ఉన్న చెడు అలవాట్లు వదిలేస్తున్నప్పుడు విత్‌డ్రావల్ సింప్టమ్స్ రూపంలోనూ ప్యానిక్ అటాక్స్ కనిపించవచ్చు.
 
 ప్యానిక్ అటాక్స్‌లో రకాలు...

 ప్యానిక్ అటాక్స్ రెండు రకాలు. అవి...
 అగోరాఫోబియాతో కూడిన ప్యానిక్ అటాక్.
 అగోరాఫోబియా ఏదీ లేకుండానే కలిగే ప్యానిక్ అటాక్.
 
 అగోరాఫోబియా అంటే...?
 
 అగోరాఫోబియా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సందర్భాన్ని రోగి ఎంతగా అవాయిడ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి. వాస్తవానికి అగోరాఫోబియా అంటే పేషెంట్‌కు ఒక వాతావరణంగాని లేదా ఒక ప్రదేశంగాని సురక్షితమైనదిగా తోచదు. (నిజానికి అది పేషెంట్ అభిప్రాయం మాత్రమే. అలాంటి ఆందోళన కలిగించే ఎలాంటి పరిస్థితులూ ఆ వాతావరణంలోగాని లేదా ఆ ప్రదేశంలోగాని ఉండకపోవచ్చు). దాంతో అతడిలో కలిగిన ఆందోళన వల్ల అక్కడనుంచి తప్పించుకుని దూరంగా పోవాలన్న ఆలోచన అతడిలో బలంగా ప్రవేశిస్తుంది. కానీ ఆ ప్రదేశం నుంచి ఎంతగా తప్పించుకుందామన్నా అది సాధ్యం కానట్లుగా పేషెంట్‌కు అనిపిస్తుంటుంది. దాంతో నలుగురిలో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అది రోగికి చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. చాలామందిలో ఇలాంటి భయాలు (ఫోబియాలు) చాలా ఉంటాయి. ఉదాహరణకు ఆరుబయల్లా అనిపించే ప్రదేశాల పట్ల, ఎత్తై ప్రదేశాల పట్ల... ఇలాంటి భయాలు ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లేదా సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ తర్వాతి దశలోనూ ఈ తరహా అగోరాఫోబియాలు ఏర్పడుతుంటాయి. నిజానికి హేతుబద్ధంగా ఆలోచిస్తే తన భయం అర్థం లేనిదని పేషెంట్‌కూ తెలుసు. అయినప్పటికీ ఈ ఫోబియా అతడిని వెంటాడుతూనే ఉంటుంది. అగోరాఫోబియా ఉన్న వ్యక్తి ఆ వాతావరణాన్ని లేదా ఆ సందర్భాన్ని లేదా ఆ పరిస్థితులను అవాయిడ్ చేయడం కోసం ఇంట్లోంచి బయటకు కాలు పెట్టకుండా, ఇంట్లోనే ఉండిపోయేంతగా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా అగోరాఫోబియాను తెలుసుకోవచ్చు.
 
 ప్యానిక్ అటాక్స్ తీవ్రమైనవేనా?
 
 అవును... ప్యానిక్ అటాక్స్ ఒక్కోసారి ఉద్వేగభరితమైన పరిస్థితిలోకి నెట్టివేసి చాలా తీవ్రమైన మానసికబాధకు, వ్యాకులతకు గురిచేస్తాయి. ఒక్కోసారి ప్యానిక్ అటాక్స్ కారణంగా కనిపించే భౌతికమైన బాహ్య లక్షణాలతో పేషెంట్స్ తమకేదో చాలా తీవ్రమైన శారీరక రుగ్మత ఉందని భావిస్తుంటారు. నిజానికి ఇలా బాధపడేవారిలో 25 శాతం మంది ఏవో లక్షణాలతో ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ విభాగంలో ఉంచి చికిత్స చేసే పరిస్థితిని కల్పిస్తారు. ఎందుకంటే చాలామంది ఛాతీనొప్పితోనే ఇలా ఎమర్సెన్సీ విభాగంలో చేరుతుంటారు. అనంతరం విపులమైన వైద్య పరీక్షల తర్వాత వాళ్లకు గుండెజబ్బులేవీ లేవని అది కేవలం ప్యానిక్ అటాక్ మాత్రమేనని తేలుతుంది. అయితే చాలామందిలో (అంటే ఒక్కోసారి 90 శాతం మందిలోనూ) అది ప్యానిక్ అటాక్ అని గుర్తించడం చాలా కష్టమవుతుంటుంది. ప్యానిక్ అటాక్స్ వచ్చినప్పుడు చాలామంది డాక్టర్లు కూడా అదంత సీరియస్ సమస్య కాదనీ, పరిష్కారం మీ చేతుల్లోనే ఉందనీ, మీ ఆలోచనలు మార్చుకుంటే చాలని చెబుతుంటారు. దీనితో లక్షణాలను అధిగమించగలిగితే భౌతిక లక్షణాలూ తగ్గుతాయి. కానీ నిజానికి సమస్య ప్యానిక్ అటాక్స్ వల్ల గాక... ఒక్కోసారి అవి కనబరిచే భౌతిక లక్షణాలు వల్ల రావచ్చు. వాటివల్ల శరీరంలోని కొన్ని కీలక అవయవాలూ దెబ్బతినవచ్చు. అందుకే ప్యానిక్ అటాక్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి యాంగ్జైటీ తగ్గించుకునే మందులు వాడాలి. తద్వారా అవయవాలు దెబ్బతిని, ప్రాణాపాయ స్థితి వచ్చేంతవరకు తెచ్చుకోకుండా నివారించుకోవచ్చు.
 
 ఎంత తరచు... ఎంత తీవ్రం...?
 
 ప్యానిక్ అటాక్స్ అన్నవి యుక్తవయసులో చాలా సాధారణంగా చాలామందిలో కలిగే అనుభవం. యువతలోనైతే పురుషుల్లో కంటే స్త్రీలలో ఇది దాదాపు రెట్టింపు కనిపిస్తుంది. కానీ యాంగ్జైటీ లాంటి ఈ స్థితి చిన్నపిల్లల్లోనూ దాదాపు 0.7 శాతం మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నపిల్లల్లో మాత్రం అటు మగపిల్లల్లోనూ, ఇటు ఆడపిల్లల్లోనూ ఇది సమానంగా కనిపిస్తుంది. అప్పుడప్పుడూ ఇవి పునరావృతమవుతూ కూడా ఉండటం చాలామందిలో కనిపిస్తుంది.
 
 ప్రమాదకరమా?

 ఇది తక్షణం ప్రాణాపాయకరం కాదు. అంతేకాదు, దీనివల్ల మనలోని ఏ అవయవాలకూ తక్షణ హాని చేకూరదు. కాకపోతే దీనికి వెంటనే తగిన మానసిక చికిత్స అవసరం.
 
 లక్షణాలు

 ప్యానిక్ అటాక్ అకస్మాత్తుగా మొదలవుతుంది. అత్యంత వేగంగా గుండె కొట్టుకోవడం,  ఛాతీ తీవ్రంగా పైకీ కిందికీ కదలడం జరుగుతుంది. మామూలు సమయంలో నింపాదిగా జరిగే ఈ కదలిక చాలా వేగంగా జరుగుతుంటుంది. ఊపిరి అందకుండా ఉన్నట్లు అనిపించడం, లేదా ఆయాసపడటం, మత్తుగా, నిద్రవస్తున్నట్లుగా అనిపించడంతో పాటు శరీరమంతా మొద్దుబారినట్లుగా ఉండటం కూడా కనిపిస్తుంది.
 
 ఫోబియాగామారే ప్యానిక్ అటాక్...

 ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో వచ్చే ప్యానిక్ అటాక్... ఆ సందర్భం పట్ల తీవ్రభయాన్ని కలిగిస్తుంది. ఉదా: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్యానిక్ అటాక్ వస్తే డ్రైవింగ్ పట్ల ఆందోళన కలుగుతుంది. అలాగే జనం బాగా గుంపులుగా ఉన్న చోట్ల ప్యానిక్ అటాక్ వస్తే అది మరో రకం ఫోబియా. ఇక కొందరిలో లిఫ్ట్ పట్ల లేదా భయపడటానికి ఆస్కారం లేని సందర్భాల్లోనూ భయాలు కలుగుతుంటాయి. ఇలా కలిగే ప్యానిక్ అటాక్స్‌ను ఫోబియా అంటారు.
 
 కారణాలు

 సాధారణంగా ప్యానిక్ అటాక్స్‌కు కొన్నిసార్లు కారణాలు ఉండవు. అయితే కొన్ని మెడికల్ కండిషన్స్ తాలూకు దుష్ర్పభావాలు ప్యానిక్ అటాక్స్ రూపంలో వ్యక్తం కావచ్చు. ఉదాహరణకు థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలోనూ, కొన్ని రకాల మందులు వాడుతున్నవారిలోనూ (మరీ ముఖ్యంగా డయాబెటిస్ మందులైన మెట్‌ఫార్మిన్, ఇన్సులిన్ వంటివి) ఒక్కోసారి తీవ్రమైన ఆందోళన కలిగి ప్యానిక్ అటాక్స్ రావచ్చు. ఇక యాంటీమలేరియా మందులు వాడే వారిలోనూ  కనిపించవచ్చు.
 గుండెకు సంబంధించినవి: గుండెకు సంబంధించిన రుగ్మతలైన లాంగ్ క్యూటీ సిండ్రోమ్, కేటకొలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులార్ టాకికార్డియా, వూల్ఫ్-పార్కిన్‌సన్-వైట్ సిండ్రోమ్ వంటి జబ్బులు ఉన్నవారికి కూడా ప్యానిక్ అటాక్స్ చాలా సాధారణం.
 
 చిన్న చికిత్సకూ చాలా జాగ్రత్త అవసరం...

 
 ఇక మైట్రల్‌వాల్వ్ ప్రొలాప్స్ వంటి గుండె కవాటాల్లో తేడాలు (హార్ట్ వాల్వ్ అబ్‌నార్మాలిటీస్) ఉన్నవారికి ప్యానిక్ అటాక్స్ ఉంటే వారు హై-రిస్క్ వ్యక్తులుగా భావించి చికిత్స చేయాలి. వారికి చిన్నపాటి దంతవైద్య సంబంధమైన చికిత్స చేయాల్సి వచ్చినా అత్యంత సునిశితమైన జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స నిర్వహించాలి.
 
 పెద్దలు, పిల్లలు, యువకుల్లో ప్యానిక్ అటాక్స్ లక్షణాలు...
 
 ఇంతకు మునుపే చెప్పుకున్నట్లు ఈ ప్యానిక్ అటాక్స్ అన్నవి అకస్మాత్తుగా మొదలవుతాయి. తీవ్ర ఆందోళనకరంగా పరిణమిస్తాయి. ప్యానిక్ అటాక్స్‌లో కనిపించే లక్షణాలివి...
 గుండె తీవ్రంగా స్పందించడం (గుండెదడ - పాల్పిటేషన్)
 ఛాతీలో నొప్పి  
 కడుపు ఉబ్బరింత లేదా పొట్టలో ఇబ్బంది (స్టమక్ అప్‌సెట్)
 నిద్రవస్తున్నట్లుగా మత్తుగా అనిపించడం (డిజ్జీనెస్)  
 తలంతా తేలికైపోయినట్లుగా ఉండటం (లైట్‌హెడెడ్‌నెస్)  
 వికారం (నాసియా)
  ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది  
 అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చినట్లుగా అనిపించడం  
 శరీరం, కాళ్లూ చేతులు వణకడం  
 ఏదో కలలో ఉన్నట్లుగా భ్రాంతిచెందడం  
 ఎదుట ఉన్న దృశ్యాలను చక్కగా చూడలేకపోవడం  
 తీవ్రమైన భయం (టై), ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఎంతగా తప్పించుకోవాలనుకున్నా తప్పుకోలేనట్లుగా అనిపిస్తుండటం  
 దిగాలు పడటం / తనకు సంభవిస్తున్న అవాంఛిత పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నందుకు లేదా వాటినుంచి తప్పించుకోలేకపోతున్నందుకు దిగులుగా ఉండటం  
 చనిపోతానేమోనన్న ఆందోళన.
 
 యుక్తవయస్కుల్లో, కౌమారవయస్కుల్లో తేడా ఇలా...
 
 ప్యానిక్ అటాక్స్ గురయ్యే యువకులు, కౌమర బాలబాలికల లక్షణాలు చాలావరకు ఒకేలా ఉన్నా... కౌమార బాలబాలికల్లో కొన్ని లక్షణాలు కాస్తంత వేరుగా, కొంత అసంబధ్ధంగా ఉంటాయి. ఉదాహరణకు కౌమార వయసులోని కిశోరబాలబాలికలు ప్యానిక్ అటాక్స్‌కు గురైనప్పుడు వారు ఒక నిద్రలాంటి స్థితిలో ఉంటారు. వారు ఈ పరిస్థితిలో తాము చనిపోయినట్లుగా భావిస్తూ ఉండే చిత్రమైన పరిస్థితిలో చాలాసేపు ఉంటారు. ఈ ఫీలింగే వారిని మరింతగా ఆందోళనపరుస్తుంది.
 
 మరికొన్ని కారణాలు     కొంచెం మెతక... కాస్తంత బెరుకు
 
 ప్యానిక్ అటాక్స్ వచ్చేవారు కొద్దిగా మెతకగా ఉండే జీవనశైలిని అనుసరిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. వారు ఎదుటివారితో సంభాషించే సమయంలో (కమ్యూనికేషన్స్) లేదా వారితో వ్యవహారం నెరిపే విషయంలో తాము అనుకున్న విషయాన్ని బలంగా చెప్పలేరని (అసెర్టివ్‌గా ఉండలేరని) అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వీళ్ల మెతకదనం, బెరుకుస్వభావం కూడా ఒక్కోసారి ప్యానిక్ అటాక్స్‌కు కారణమవుతాయని కొన్ని అధ్యయనాలు వివరిస్తున్నాయి.
 
 నాక్చర్నల్ ప్యానిక్ అటాక్స్

 
 ఒక్కోసారి నిద్రలో ప్యానిక్ అటాక్స్ వస్తుంటాయి. వీటినే నాక్చర్నల్ ప్యానిక్ అటాక్స్ అంటారు. ఇవి పగటి సమయంలో వచ్చే వాటి కంటే దాదాపు 40 శాతం నుంచి 70 శాతం తక్కువ. అయితే ఇలా నిద్రలో ప్యానిక్ అటాక్స్ వచ్చే వారిలో లక్షణాలను తప్పక పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయాలి. ఇలా నిద్రలో ప్యానిక్ అటాక్స్ వచ్చే వారిలో చాలామందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ప్యానిక్ అటాక్స్‌కు గురైనప్పుడు కొందరు అకస్మాత్తుగా నిద్రనుంచి ఉలిక్కిపడి మేల్కొంటారు.  కేవలం తెలియని భయమే వాళ్లను నిద్రనుంచి లేచేలా చేస్తుంది. అయితే ఈ ప్యానిక్ అటాక్ వ్యవధి 10 నిమిషాల కంటే తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ ఇది వచ్చాక పేషెంట్ కుదుట పడి మామూలు స్థితికి రావడానికి చాలా సమయం తీసుకుంటుంది.
 
 ప్యానిక్ అటాక్స్ మంచివి కూడానా..?
 
 ఏదైనా అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు శరీరాన్ని అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థ మన శరీరంలో ఉంటుందన్నది ఒక అధ్యయన సిద్ధాంతం. దాన్ని అనుసరించి ఏవైనా భౌతిక పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు వాటిని తప్పించుకోవడం కోసంగాని, లేదా వాటిని ఎదుర్కొని అధిగమించడం కోసం గాని ఈ ప్యానిక్ అటాక్స్ వచ్చి అవి వ్యక్తిలోని అలారమ్ వ్యవస్థ ను అప్రమత్తం చేస్తుందన్నది ఒక థియరీ. అయితే ఇంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కొందరిలో ఏ లక్షణాలూ ఉండకపోగా... కొందిలో మాత్రం కొద్దిపాటి ఒత్తిళ్లకే ప్యానిక్ అటాక్స్ రావడం ఎందుకన్న విషయంపై పరిశోధకుల్లో ఇంకా స్పష్టత లేదు. అయితే కొన్ని కుటుంబాల్లో ఇవి జన్యుపరంగా/వారసత్వంగా మిగతా తరాలకూ వస్తుంటాయని తేలింది.
 
 అధిగమించడం ఎలా...?
 
 ప్యానిక్ అటాక్స్‌ను అధిగమించడం చాలా తేలికే. తమపై తమకు విశ్వాసం పెరిగేలాంటి జీవనశైలితో వీటిని అధిగమించవచ్చు. నిత్యం వ్యాయామం చేయడం కూడా ప్యానిక్ అటాక్స్‌ను నివారిస్తుంది. క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేసేవారిలో ఒత్తిడి పాళ్లు తగ్గుతుంది. ఫలితంగా ప్యానిక్ అటాక్స్ నివారితమవుతాయి. దీనివల్ల శరీరం కూడా బిగుసుకుపోయేలాంటి పరిస్థితి నివారితమవుతుంది. ఇక ఆహారాల్లోనూ కృత్రిమ రంగులు, అడెటివ్స్ కలిపినవి కాకుండా స్వాభావికమైన సమతులాహారం తీసుకునేవారిలో ప్యానిక్ అటాక్స్ తక్కువ. అలాగే మద్యపానం, కెఫిన్ వంటివి ప్యానిక్ అటాక్స్‌ను ప్రేరేపిస్తాయి కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండటం అవసరం.
 
 ఆహారం... ప్యానిక్ అటాక్స్
 
 కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలో ఉదాహరణకు ఆహారానికి తీపినిచ్చేందుకు వాడే నాన్ శాకరైడ్ స్వీటెనర్ అయిన ‘ఆస్పర్టమ్’ వంటి అడెటివ్స్ వాడిన ఆహారాలు తీసుకునే వారు కూడా ప్యానిక్ అటాక్స్ గురవుతుంటారని తెలుస్తోంది. ఇక కొందరిలో తాము తీసుకునే ఆహారంలోని పోషకాల్లో జింక్ లేదా మెగ్నీషియమ్ లోపించడం వల్ల ప్యానిక్ అటాక్స్ వస్తుంటాయన్నది ఒక అధ్యయనం. ఆహారంలో ఈ పోషకాల లోపం అన్నది ప్యానిక్ అటాక్స్‌కు ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
 
 చికిత్స:

 ప్యానిక్ అటాక్స్‌కు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు బెంజోడయజపైన్స్ ఉండే మందులు కూడా మానసిక నిపుణులు ఇస్తుంటారు. ఇక బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఆర్‌ఐ మెడికేషన్స్ వంటి కొత్త మందులు ఈ సమస్య నుంచి బయటపడటానికి బాగా ఉపకరిస్తున్నాయి. మందులతో పాటు కౌన్సెలింగ్ కూడా ప్యానిక్ అటాక్స్ నుంచి కాపాడతాయి. పానిక్ అటాక్స్ ఉన్నవారిని క్రమంగా ఆ పరిస్థితులకు కొద్ది కొద్దిగా ఎక్స్‌పోజ్ చేయడం, యోగా వంటి ప్రక్రియలు కూడా బాగా ఉపయోగపడతాయి.
 
 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement