ముఖ కాంతికి...
బ్యూటిప్స్
ఉడికించిన ఓట్స్, తేనె బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ప్యాక్ వేసుకోవాలి. ఇది పొడి చర్మం గలవారికి మేలైన ప్యాక్. మాయిశ్చరైజింగ్‌గానే కాకుండా చర్మానికి మంచి క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కప్పు పెరుగులో టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ నిమ్మరసం క లపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది.
గుమ్మడికాయ, బొప్పాయి గుజ్జు సమపాళ్లలో తీసుకోవాలి. అందులో గుడ్డు సొనను కలపాలి. వేళ్లతో ఈ మిశ్రమాన్ని అద్దుకుంటూ ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది మలినాలను శుభ్రపరచడమే కాకుండా, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సున్నితమైన చర్మ తత్త్వం గలవారు ప్యాచ్‌టెస్ట్ చేసుకోవడం మంచిది.
రెండు బాదం పప్పులు నానిన తర్వాత కొద్దిగా నీళ్లు కలిపి వాటిని పేస్ట్ చేయాలి. అందులో పది చుక్కల నిమ్మరసం, అర టీ స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.