
గేమింగ్ పిచ్చి ఆడవాళ్లకు ఎక్కువా?
కంప్యూటర్ గేమ్స్ మీద మహిళలకు మక్కువ ఎక్కువట. ఏ మాత్రం తీరిక దొరికినా ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారట ఎక్కువ మంది మహిళలు. నేటి నగర జీవితంలో కంప్యూటర్ అందుబాటులో ఉండి, దానిపై పరిజ్ఞానం ఉన్న వారిలో 50 శాతం మంది తీరిక వేళల్లో గేమ్స్ ఆడటాన్ని వినోదంగా భావిస్తున్నారట. డెయిలీ మెయిల్‌లో ప్రచురితం అయిన ఈ సర్వే ప్రకారం పురుషుల కన్నా మహిళల్లోనే ఈ గేమ్స్‌పై ఎక్కువ ఆసక్తి ఉంది.
ఇంతవరకు సాధారణంగా టీవీ సీరియల్స్, సినిమాలే మహిళలకు ప్రధాన వినోదమార్గాలు అనే అభిప్రాయాలున్నాయి. అయితే దాదాపుగా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందుబాటులో వచ్చిన తరుణంలో కంప్యూటర్ గేమ్స్‌నే తమ వినోదమార్గంగా భావిస్తున్నారు చాలామంది మహిళలు. అయితే ఇది ఆందోళనకరమైన పరిణామం అని అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. ఇలా కంప్యూటర్ గేమ్స్‌కు బానిస అయిపోవడం కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసే అవకాశాలున్నాయని వారు అంటున్నారు.