సింపుల్‌గా ఒక చిన్న లైన్ చెప్పారు.. కథ రెడీ అయిపోయింది.. పాత్రలు ఎలా ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో చెప్పారు.. రేంజ్ సినిమా సిద్ధమైపోయింది.. పిల్లలను బడికి పంపారు.. రోబో టీచర్ వచ్చి పాఠాలు చెప్పింది.. ఏదో పనిమీద బయటికి వెళ్లి బస్సెక్కారు.. పక్కనే ఓ రోబో వచ్చి కూర్చుని పలకరించింది.. ఇవన్నీ జస్ట్ ఏడెనిమిదేళ్లలో.. అంటే 2030 సంవత్సరానికల్లా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వాస్తవంలోకి వచ్చేస్తాయట. ఇవేకాదు అమెరికా, యూకేలకు చెందిన ఏఐ నిపుణులు ఇలాంటి మరెన్నో అంచనాలను వెలువరించారు. అందులోకీలకమైన ఎనిమిదింటిని ప్రఖ్యాత డెయిలీ మెయిల్ వెబ్‌సైట్ తాజాగా ప్రచురించింది.
ఒక్క రోజులో సినిమా..
భవిష్యత్తులో కృత్రిమ మేధ సాంకేతికత కేవలం ఒక్కరోజులోనే మొత్తం సినిమాను రెడీ చేసి ఇచ్చే స్థాయికి చేరుతుందని న్యూయార్క్‌కు చెందిన ప్రఖ్యాత సైన్స్–ఫిక్షన్ రచయిత హఫ్ హోవే అంచనా వేశారు. ‘‘ప్రస్తుతం మేం వాడుతున్న కొన్ని ఏఐ ప్రోగ్రామ్‌లు నిజమైనవా, కల్పితమా అని తెలియని స్థాయిలో అద్భుతమైన ఫొటోలను సృష్టిస్తున్నాయి. అదే రెండేళ్ల కింద ఈ స్థాయి లేదు. ఇప్పుడు సినిమాలను సృష్టించే ఏఐ ప్రోగ్రామ్‌లు కూడా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. కొన్నేళ్లలో కేవలం ఒక్కరోజులోనే సినిమాలను సృష్టించగలవు..’’అని చెప్పారు. ఏఐ ప్రోగ్రాములు ఇప్పటికే కథలు రాసేస్తున్నాయని గుర్తుచేశారు.
విద్యార్థులకు తగినట్టుగా ఏఐ పాఠాలు
ఒక్కో విద్యార్థికి సంబంధించి వారిలో ఉన్న లోపాలు, అభిరుచులు, మెరుగుపడాల్సిన అంశాలకు తగినట్టుగా.. వేర్వేరుగా పాఠాలను బోధించే ఏఐ రోబోలు రానున్నాయని లండన్‌లోని రావెన్స్‌బోర్న్ యూనివర్సిటీ కంప్యూటింగ్ అండ్ బిజినెస్ విభాగం హెడ్ అజాజ్ అలీ చెప్పారు. దీనితోపాటు అగుమెంటెడ్ రియాలిటీ (ఏఐ)తో వర్చువల్ తరగతులు, పాఠాలు కూడా.. విద్యార్థులకు అద్భుతమైన శిక్షణను ఇస్తాయని అంచనా వేశారు.
అందరి సంపద జూమ్
ఏఐ సాయంతో.. అవసరాలకు, వ్యక్తులకు తగిన ఉత్పత్తుల రూపకల్పన జరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుందని లండన్‌కు చెందిన ‘బిగ్ ఫోర్’అకౌంటెన్సీ సంస్థ అనలిస్టులు పేర్కొన్నారు. వచ్చే ఏడేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ ఏకంగా 45శాతం పెరుగుతుందని.. ఇది భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలను కలిపినదానికంటే ఎక్కువని
అంచనా వేశారు.
ఇంధన కొరతకు చెక్
త్వరలో ఏఐ సాయంతో క్లిష్టమైన అణు సంలీనం (న్యూక్లియర్ ఫ్యుజన్) సాంకేతికత అందుబాటులోకి వస్తుందని చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ సంస్థ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్‌మ్యాన్ చెబుతున్నారు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక సంక్షోభాలు వంటి పరిస్థితుల్లో ఇంధనం, కరెంటు కొరత సమస్యగా మారిందని.. 2030 నాటికి ఏఐ ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment