
1996లో ఒకరోజు తన పిల్లలు తుషార్, నకుల్‌లని– మరమ్మత్తుకిచ్చిన టీవీ తెమ్మని ఢిల్లీలో రద్దీగా ఉన్న లాజ్‌పత్‌నగర్ మార్కెట్‌కు పంపుతాడు వికాస్ ఖురానా. వాళ్ళిద్దరూ స్నేహితుడైన మన్సూర్‌ని కూడా తీసుకెళ్తారు. అక్కడ ఒక బాంబు పేలి పదమూడు మందిని చంపి, మరి ముప్పై మందిని గాయాలపాలు చేస్తుంది. మరణించిన వాళ్ళల్లో ఖురానా పిల్లలు కూడా ఉంటారు. మన్సూర్ చేతి మీద గాయాలతో, రక్తం కారుతూ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అబ్బాయి తల్లిదండ్రులకి సంతోషం కలిగినప్పటికీ, కుర్రాడు మాత్రం ఖురానా దంపతులు పడే దు:ఖాన్ని పంచుకుంటాడు.
కొడుకులు ఎందుకు చనిపోయారో, బాంబు విసిరినది ఎవరో, కారణాలేమిటో అని ఖురానా అతని భార్య దీపా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి దు:ఖం, కోపం, అపరాధభావం– వారి దాంపత్య జీవితం, ఆరోగ్యం, భవిష్యత్తు పైనా ప్రభావం చూపుతాయి.
బాంబుదాడి వల్ల మన్సూర్ భౌతికంగా, మానసికంగా కూడా కదిలిపోయి– పెద్దయి ఉద్యోగం కోసం యూఎస్‌కు వెళ్ళినప్పుడు, అతని పాత మణికట్టు గాయాలు ఎక్కువై, తన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయలేక ఇండియా తిరిగి వస్తాడు. ప్రపంచాన్ని మార్చాలన్న ఆశయం ఉన్న అయూబ్‌తో స్నేహం పెంచుకుంటాడు. వాళ్ళిద్దరి దృష్టి నుంచీ చూస్తే 9/11 తదుపరి లోకంలో పరిస్థితులూ, అనుభూతులూ ఎంత త్వరగా మారాయో అన్నది అర్థం అవుతుంది. అయూబ్ కానీ బాంబు తయారు చేసే షౌకీ కానీ, గతానుగతిక విషం చిమ్మే మూఢవిశ్వాసులుగా వర్ణించబడరు.
కరణ్ మహాజన్ రాసిన ఈ రెండో పుస్తకం ‘ది ఎసోసియేషన్ ఆఫ్ స్మాల్ బాంబ్స్’ అనూహ్యమైనది. ప్రభావితులైన వారి, బాధితుల, నేరస్థుల కథన దృక్కోణాలను ఇటూ అటూ మారుస్తూ రాయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. తీవ్రవాదానికి గల కారణాలూ, ప్రభావాలూ గురించిన ఆలోచనలని రేకెత్తిస్తుందీ పుస్తకం. అయినాగానీ కథనం మాత్రం విషాదకరంగా ఉండదు. కథనంలో నిపుణత, నిమ్మళం ఉన్నాయి.
తీవ్రవాదుల్లో ఎవరూ కరడుగట్టిన ముస్లింలూ, అల్లా పేరుని దుర్వినియోగిస్తూ హత్యలూ చేసేవారూ కారు. బదులుగా వారు రాజకీయ కార్యకర్తలు. కొందరు కశ్మీర్ కోసం స్వాతంత్య్రం కోరుకునేవారు. ముస్లింల హింసని అంతం చేయాలనుకునేవారు. అనేక సంవత్సరాలుగా సాగుతున్న శోకపు ఆసక్తికరమైన చిత్రాలనీ, విషాదాన్ని భరించగలిగే పద్ధతులనీ, సైద్ధాంతిక మార్పులనీ వివిధ దృష్టి కోణాలతో వర్ణిస్తారు రచయిత. జీవితపు వాస్తవాలని సమర్థవంతంగా ప్రతిబింబిస్తారు. పాఠకులనుండి సానుభూతి పొందే ప్రయత్నమేదీ చేయలేదు. తీవ్రవాదులకి ఒక మానవ ఆకారాన్ని ఆపాదించడం వల్ల చిన్న వివరాలు కూడా ప్రాముఖ్యతని సంతరించుకోవడమే కాక తికమక పరుస్తాయి కూడా. ఏ కారణాలవల్ల ఎవరైనా ఒక తీవ్రవాదిగా లేక హంతకుడిగా మారతారో అన్నది ఎప్పుడూ ఆసక్తి కలిగించేదే. బహుశా అందుకే తీవ్రవాదుల దృక్పథాలకీ, ఆలోచనా ధోరణికీ, భావజాలానికీ ఎక్కువ పేజీలు కేటాయించబడ్డాయి. కరణ్ మహాజన్ 1984లో పుట్టి, కొత్త ఢిల్లీలో పెరిగారు. ఈ నవల 2016 ‘నేషనల్ బుక్ అవార్డ్ ఫర్ ఫిక్షన్’ కోసం ఫైనలిస్టుగా పేర్కొనబడింది.
-క్రిష్ణవేణి