భుజంగాసనం
భుజంగం అంటే సర్పం. ఈ ఆసనం వేసినప్పుడు ఛాతీ, మెడ, తల పెకైత్తి ఉండడంతో ఈ భంగిమ పడగ విప్పిన పామును పోలి ఉంటుంది. కాబట్టి దీనిని భుజంగాసనం అంటారు. ఇదే ఆసనాన్ని కొద్దిపాటి మార్పులతో నాలుగు రకాలుగా సాధన చేయవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది వాటిలో ఒక పద్ధతి.
ఎలా చేయాలి?
బోర్లా పడుకుని రెండు చేతులను (ఎడమ అరచేతి మీద కుడి అరచేతిని ఉంచాలి. ఫొటోని గమనించండి) గడ్డం కింద ఉంచుకుని కొద్ది క్షణాలు విశ్రాంతి స్థితిలో ఉండాలి.
బోర్లించి ఉంచిన అరచేతులను ఛాతీ కిందకు తెచ్చుకోవాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకుని దేహం బరువుని రెండు చేతుల మీద మోపుతూ తలను పైకి లేపాలి.
ఇలానే ఉండి, నాభి దిగువ ప్రాంతం వరకు పైకి లేపాలి. ఈ స్థితిలో చేతులు నిటారుగా (మోచేతుల దగ్గర వంచకుండా) ఉండాలి, చూపు ఆకాశం వైపు ఉండాలి. రెండు కాళ్లు భుజాలకు సమాంతరంగా ఉండాలి. మనసును వీపు దిగువ భాగం మీద కేంద్రీకరించాలి.
ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత తిరిగి యథాస్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
ఉపయోగాలు
వెన్నుపాము శక్తిమంతం అవుతుంది. వెన్నునొప్పి తగ్గిపోతుంది. ఛాతీ విశాలమవుతుంది. ఉబ్బసం వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. మెడ కండరాలకు బలం వస్తుంది. గొంతు సంబంధ వ్యాధులు నయవుతాయి. స్వరం సరళతరమవుతుంది కాబట్టి గాయకులు, న్యూస్ రీడర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు ఈ ఆసనం బాగా దోహదం చేస్తుంది.
పొట్ట కండరాలు, పొట్టలోని ఇతర భాగాలు సాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.
చేతులకు, భుజాలకు శక్తి పెరుగుతుంది.
రుతుక్రమ సమస్యలు నివారణ అవుతాయి, ఇతర గర్భాశయ సమస్యలతోపాటు గర్భధారణ సమస్యలు కూడా తొలగిపోతాయి.
జాగ్రత్త
హెర్నియా ఉన్నవాళ్లు, భుజాలు అరిగిపోయిన వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు.
మోడల్
ఎస్. దుర్గాహర్షిత
నేషనల్ యోగా చాంపియన్
ఫొటోలు: శివ మల్లాల
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
హైదరాబాద్