ఆకర్ణ ధనురాసనం
కర్ణం అంటే చెవి. ధనుర్ అంటే ధనుస్సు. కాలిని చేతితో చెవి దగ్గరకు లాగినట్లు పట్టుకున్నప్పుడు ఆ భంగిమ... బాణాన్ని ఎక్కు పెట్టిన ధనుస్సును పోలి ఉంటుంది. అందుకే దీనిని ఆకర్ణ ధనురాసనం అంటారు.
ఎలా చేయాలంటే!
ముందుగా రెండుకాళ్లను చాపి కూర్చోవాలి. కుడిచేతితో ఎడమకాలి బొటనవేలును, ఎడమచేతితో కుడికాలి బొటనవేలును పట్టుకోవాలి.
కుడిచేతితో ఎడమకాలి మడమను తీసుకువచ్చి కుడికాలి తొడ మీద ఉంచాలి.
శ్వాస తీసుకుని (శ్వాస వదలకుండా ఆపి ఉంచాలి) కుడిచేతితో ఎడమకాలి బొటనవేలును కుడిచెవి దగ్గరకు తీసుకురావాలి. ఈ స్థితిలో కుడిమోకాలు నేల మీద నుంచి పైకి లేవకూడదు. ఎడమ చేయి కుడికాలి బొటన వేలును పట్టుకునే ఉండాలి. వెన్నెముకను వీలైనంత నిటారుగా ఉంచాలి.
ఆసన స్థితిలోకి వచ్చిన తర్వాత దృష్టిని ఎదురుగా ఉన్న ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా యథాస్థితిలోకి రావాలి.
ఇలాగే రెండవకాలితోనూ చేయాలి. అప్పుడు ఆకర్ణ ధనురాసనం ఒక రౌండ్ పూర్తయినట్లు. ఇలా రోజుకు మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
ఉపయోగాలు!
కాళ్ల కండరాలు సాగినట్లయి సరళతరం కావడంతోపాటు, శక్తిమంతం అవుతాయి కూడ.
భుజాలు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు శక్తిమంతం అవుతాయి.
తుంటిభాగంలో చిన్న చిన్న లోపాలు తొలగిపోతాయి.
పొట్టకండరాల మీద తగినంత ఒత్తిడి కలిగి శక్తిమంతం అవుతాయి.
మలబద్దకం తొలగిపోతుంది. పొట్టకు సంబంధించిన ఇతర చిన్నచిన్న సమస్యలు పోతాయి.
జాగ్రత్తలు
మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు, భుజాల సమస్య లు ఉన్నవాళ్లు చేయకూడదు.
మోడల్
ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్
ఫొటోలు: శివ మల్లాల