పరీవృత త్రికోణాసనం
ఈ ఆసన భంగిమ నడుము వద్ద మెలి తిరిగి ఉండి త్రికోణాసనభంగిమను పోలి ఉంటుంది. అందుకే దీనిని పరీవృత త్రికోణాసనం అంటారు.
ఎలా చేయాలి?
పాదాలు దగ్గరగా ఉంచి సమస్థితిలో నిలబడాలి.
పాదాలను కొంచెం దూరంగా ఉంచి రెండు చేతులను పక్కలకు చాపాలి. చేతులు చాచినప్పుడు భుజాలకు సమాంతరంగా ఉండాలి.
ఇప్పుడు శ్వాస పూర్తిగా తీసుకుని, నిదానంగా వదులుతూ, ముందుకు వంగి, ఎడమ చేతిని కుడిపాదం చివరన ఉంచాలి. ఛాతీ పూర్తిగా కుడివైపుకి తిరిగి ఉండాలి. ఈ స్థితిలో మోకాళ్లు వంచకూడదు. కుడిచేయి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా పైకి ఉండాలి. తలతిప్పి కుడి అరచేతిని చూస్తుండాలి.
ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి. అలాగే రెండవవైపు కూడా చేయాలి. కుడి, ఎడమలు కలిపి 8-10 సార్లు చేసి విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగాలు
నడుము వద్ద కొవ్వు తొలగిపోవడంతో దేహాకృతి చక్కగా తయారవుతుంది.
భుజాలు, మోకాళ్లు శక్తిమంతం అవుతాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి.
మానసిక ఒత్తిడి దూరమవుతుంది.
కడుపు భాగంలో కదలికల వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.
పిరుదుల దగ్గర చేరిన అదనపు కొవ్వు తగ్గుతుంది. నడుము దగ్గర కీళ్లు సరళతరమవుతాయి.
ఎవరెవరు చేయకూడదు
వెన్ను నొప్పి ఉన్న వాళ్లు
స్పాండిలోసిస్ ఉన్న వాళ్లు, హైబీపీతో బాధపడుతున్న వాళ్లు
భుజాలు అరిగిపోయిన వాళ్లు
బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్లు
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు,
సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
హైదరాబాద్
మోడల్
ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్
ఫొటోలు: శివ మల్లాల