సంజయ్‌ దత్తు | Biopic of Bollywood bad boy Sanjay Dutt drowns in self-evasion | Sakshi
Sakshi News home page

సంజయ్‌ దత్తు

Published Sat, Jun 30 2018 2:07 AM | Last Updated on Sat, Jun 30 2018 4:32 AM

Biopic of Bollywood bad boy Sanjay Dutt drowns in self-evasion - Sakshi

సినిమా హీరోలకు మేకప్‌ మామూలే. తళతళలాడిపోడానికి పూస్తారు. సమాజంలో కూడా రంగులు పులిమేవారుంటారు. నిజం సరిగ్గా తెలియకపోతే ఆ రంగులు భలే ఇంట్రెస్ట్‌గా అనిపిస్తాయి. ఒక్కోసారి ఆ రంగులే నిజం అనిపిస్తాయి. సంజయ్‌దత్‌ జీవితంలో అలాంటి రంగులు ఎన్నో! ఉగ్రవాది.. వ్యసనపరుడు.. స్త్రీలోలుడు.. వగైరా.. వగైరా..! ‘సంజూ’ సినిమాలో రాజ్‌కుమార్‌ హిరాణీ ఈ రంగుల్లో నిజానిజాల్ని ఇంకో కోణంలో చూపించాడు. సంజయ్‌ని ముత్యంలా చూపించడానికి దత్తత తీసుకున్నాడు!


డ్రగ్స్, ఆల్కహాల్, అమ్మాయిలు, గన్స్, గూండాలు.. ఇదంతా సినిమా సరుకు. సంజయ్‌దత్‌ జీవితాన్ని ‘సంజు’ సినిమాగా తీసిన రాజ్‌కుమార్‌ హిరాణీకి ఈ సరుకు ఎక్కడా వెతుక్కోకుండానే గంపగుత్తగా ఒకటే చోట దొరికింది. సంజయ్‌దత్‌ జీవితంలోనే ఇవన్నీ ఉన్నాయి. వాటికి హిరాణి కొంచెం ఎమోషన్‌ కలిపాడు. పిక్చర్‌ హిట్‌ అయింది. ఐదు స్టార్‌లకు అంతా నాలుగు స్టార్‌లు వేస్తున్నారు. సంజయ్‌ రోల్‌ వేసిన రణబీర్‌ కపూర్‌ కూడా మళ్లీ చాలాకాలం తర్వాత ఈ సినిమాతో స్టార్‌ అయ్యాడు.

‘నేను టెర్రరిస్టును కాదు’
పాతికేళ్లుగా సంజయ్‌దత్‌ తన నెత్తిమీద ‘టెర్రరిస్ట్‌’ అనే గంపను మోస్తున్నాడు. అది అతడి జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్నిప్పుడు దించి, సినిమాలో పెట్టి సంజయ్‌ మనో భారం తగ్గించాడు హిరాణీ. కళంకితుడన్న ఇమేజ్‌ని తొలగించి సంజయ్‌ని ప్రక్షాళన చెయ్యిడానికి హిరాణీ ఈ సినిమా తియ్యలేదు.

ఒక స్టార్‌ తనయుడు.. విలాసాలకు, విపరీతాలకు అలవాటు పడినవాడు.. జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో కూడా హిరాణీ చెప్పలేదు. నిరంతరం ప్రశ్నలతో విసిగించి, వేధించే మీడియా నుంచి పారిపోయి.. ‘నేను టెర్రరిస్టును కాదు’ అని అరిచి చెప్పడానికి బయోగ్రఫీని రాయించాలనుకుంటాడు రణబీర్‌కపూర్‌ (సంజు). పూర్తిగా అతడి సైడు నుంచి స్టోరీ చెప్పాలి. అనుష్క వస్తుంది బయోగ్రఫీ రాయడానికి. వస్తుంది కానీ, గొప్ప ఉద్వేగంతో వచ్చేం కూర్చోదు.

టెర్రరిస్ట్‌ బయోగ్రఫీలో తెలియంది ఏముంటుందీ?! ‘ఏముంటుందిలే అనుకునేదానిలో ఎంతో ఉండొచ్చు’ అని రణబీర్‌ భార్య దియా మీర్జా అంటుంది. రణబీర్‌ కూడా అంతా నిజమే చెబుతాను అంటాడు. అనుష్క రెడీ అవుతుంది. సినిమా మొదలౌతుంది. ఒక్కో ఘట్టం చెప్పుకుంటూ పోతాడు రణవీర్‌. ఒక్కో ఘట్టం రాసుకుంటూ పోతుంది అనుష్క. ఒక్కో ఘట్ట తీసుకుంటూ పోతాడు రాజ్‌ హిరాణీ.

రీలంతా రియల్‌ లైఫే
బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తున్న తరుణంలో సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌ జీవితగాథను సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించి, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ. పైగా సక్సెస్‌ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను ‘సంజు’ మూవీ రోల్‌కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది.

అయితే ట్రైలర్, ప్రొమోల్లో అచ్చం ‘సంజూబాబా’లా కనిపించిన రణ్‌బీర్‌.. ఆ అంచనాలను తారస్థాయికి చేర్చాడు. కథేమిటంటే.. స్టార్‌ వారసుడిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి, తొలి చిత్రం (రాకీ)తోనే స్టార్‌డమ్‌ సంపాదిస్తాడు సంజు. సినీ ప్రస్థానం కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్‌ అలవాటు, అక్రమాయుధాల కేసు అతడి జీవితాన్ని కుదిపేస్తాయి.

ఆయుధాల కేసులో  తనకు తానుగా లొంగిపోవాలని భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవితాన్ని కథగా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. బయోగ్రాఫర్‌ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె (అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. అనుష్కకు వివరిస్తూ ఉండగా కథ సాగుతుంది.

‘ఒక్క మనిషి.. పలు కోణాలు’
ఈ ట్యాగ్‌ లైన్‌తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు వివరించే ప్రయత్నం చేశాడు. వివాదాల నటుడు సంజయ్‌ దత్‌ లైఫ్‌ను తెరపై ఆయన డీల్‌ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్‌గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూస గుచ్చినట్లుగా వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది.

తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్‌ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు చేసే స్ట్రగ్రుల్, విమర్శలు వెల్లువెత్తినా తండ్రి (పరేష్‌ రావెల్‌) కొడుక్కి అండగా నిలవటం, ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్‌ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌గా నడిపిన దర్శకుడు.. సెకండాఫ్‌ను మొత్తం జైలు జీవితం, కేసు, కోర్టు ప్రధానాంశాలుగా నడిపించాడు.

తాను టెర్రరిస్ట్‌ను కాదంటూ సంజు పడే మానసిక సంఘర్షణ, భావోద్వేగపూరిత సన్నివేశాలతోనే ద్వితీయార్థాన్ని కానిచ్చేశాడు. ఈ క్రమంలో సంజు కెరీర్‌ను చూపించినా.. వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. హీరోయిన్లతో రిలేషన్‌షిప్స్, వైవాహిక జీవితంలోని లోతైన అంశాలను (మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశల గురించి) చూపించకుండా సంజు కథ సాగింది. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది.

దియా మెప్పించారు
సంజయ్‌ దత్‌ పాత్రలోకి రణ్‌బీర్‌ కపూర్‌ జీవించేశాడు. సంజు అంటే రణబీర్‌ అనేలా కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో రణ్‌బీర్‌ తనను తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. డ్రగ్స్‌ బాధితుడిగా చేసే సన్నివేశాలు అయితేనేం, వీధుల్లో అడుక్కునే సీన్‌ అయితేనేం, పోలీస్‌ విచారణలో, ఆస్పత్రిలో స్నేహితుడితో... ఒక్కటి కాదు.. చెప్పుకుంటూ పోతే బోలెడు సీన్లు. తండ్రి సునీల్‌ దత్‌ పాత్రలో పరేష్‌ రావల్‌ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనిపిస్తుంది.

ఇక సంజు బెస్ట్‌ ఫ్రెండ్‌ కమలేష్‌ (విక్కీ కౌశల్‌) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు–కమలేష్‌ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్‌ దత్‌ పాత్రలో సీనియర్‌ నటి మనీషా కొయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్‌ కపూర్, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా  సంజయ్‌ దత్‌ కనిపించటం ఆకట్టుకుంది.

ఏఆర్‌ రెహమాన్, రోహన్‌ రోహన్‌–విక్రమ్‌ మాంట్రెసె సంగీతం సినిమాకు తగ్గ మూడ్‌ను అందించింది. ‘కర్‌ హర్‌ మైదాన్‌ ఫతే సాంగ్‌’, ‘రుబీ రుబీ’ పాటలు అలరిస్తాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తోపాటు విజువల్‌గా కూడా సంజు మెప్పిస్తుంది.  రాజ్‌కుమార్‌ హిరాణీ అద్భుతమైన స్టోరీ టెల్లర్‌. అందులో ఏ మాత్రం సందేహం లేదు. దత్‌ ఫ్యామిలీతో ఉన్న స్నేహాన్ని పక్కనపెట్టి మరీ కథానుగుణంగా కొన్ని సన్నివేశాలను స్వేచ్ఛగా తెరకెక్కించారు. చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓవరాల్‌గా హిరాణీ సినిమాల్లో లభించే హ్యూమన్‌ ఎమోషన్స్, హ్యూమర్‌ ఎలిమెంట్స్‌ ‘సంజు’లో పుష్కలంగా లభిస్తాయి.


ప్రపంచవ్యాప్తంగా 5300 స్క్రీన్‌లు
‘సంజు’తో రణ్‌బీర్‌ కపూర్‌ కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌తో స్టార్టయ్యింది. శుక్రవారం సినిమాకి íß ట్‌ టాక్‌ వస్తే శని, ఆదివారాలు హౌస్‌ఫుల్‌ అవుతాయి. అటువంటిది ‘సంజు’ సినిమా ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌లతో హోరెత్తిందనే చెప్పాలి. ఇకపోతే బాలీవుడ్‌లో రెండు రకాలుగా సినిమా ఓపెనింగ్స్‌ ఉంటాయి. హాలిడే ఓపెనింగ్, నాన్‌ హాలిడే ఓపెనింగ్‌. శుక్రవారం నార్త్‌ ఇండియాలో నాన్‌ హాలిడే ఓపెనింగ్‌ 55 శాతంతో మార్నింగ్‌ షో స్టార్టయ్యింది.

అంటే అది చాలా పెద్ద ఓపెనింగ్‌ కింద లెక్క. మొత్తమ్మీద 4000 స్క్రీన్‌లతో పాటు విదేశాల్లోని 1300 స్క్రీన్‌లు కలుపుకుని 5300 స్క్రీన్‌లలో రిలీజైంది సంజు. మొదటిరోజు షేర్‌ 33 కోట్లనుండి 36 కోట్ల వరకు వస్తుందని బిజినెస్‌ అనలిస్ట్‌ల విశ్లేషణ. ఇది రీసెంట్‌గా రిలీజైన సల్మాన్‌ఖాన్‌ రేస్‌3 కంటే ఎక్కువ. (రేస్‌3 ఫస్ట్‌ డే షేర్‌ 29.5 కోట్లు) అని ‘సంజు’ విశేషాలను వివరించారు ఫాక్స్‌ స్లార్‌ ఇండియా హైదరాబాద్‌ ప్రతినిధి తెలిపారు.

‘సంజు’కు భారీ షాక్‌
కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ సినిమాకు ఇంతలోనే భారీ షాక్‌ తగిలింది. పైరసీ భూతం సంజు సినిమానూ వదల్లేదు. ప్రస్తుతం ‘సంజు’ పైరసీ కాపీ, అది కూడా హెచ్‌డీ ప్రింట్‌ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. అది కూడా పూర్తి నిడివి చిత్రం కావడం గమనార్హం. ఇది గమనించిన సోషల్‌ మీడియా యూజర్లు ఆ వెబ్‌సైట్‌ లింక్‌ను స్క్రీన్‌ షాట్స్‌ తీసి ఇంటర్నెట్‌లో షేర్‌  చేస్తున్నారు.

సినిమా విడుదలైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. సినిమా లీక్‌ అయిన విషయం తెలుసుకున్న రణ్‌బీర్‌ కపూర్‌ అభిమానులు ఈ విషయం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ‘సంజు లీక్‌ అయ్యింది. దయచేసి ఈ లింక్‌లను ఎవరికీ షేర్‌? చేయకండి’ అంటూ రణ్‌బీర్‌కు మద్దతు తెలుపుతున్నారు.


సంజుపై కామెంట్స్‌
సంజు చాలా బాగా నచ్చింది. తండ్రీకొడుకులు, ఇద్దరు ఫ్రెండ్స్‌ మధ్య రిలేషన్‌ మనసుని కదలించేలా చెప్పారు రాజ్‌ కుమార్‌గారు. రణ్‌బీర్‌ కపూర్‌ అవుట్‌స్టాండింగ్‌గా చేశారు. విక్కీ కౌశల్‌ మైండ్‌బ్లోయింగ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఎంగేజింగ్‌గా కథ చెప్పారు హిరాణీ. టీమ్‌ అందరికీ కంగ్రాట్స్‌. –  ఆమిర్‌ ఖాన్‌

కేవలం రెండున్నర గంటల్లో ఏడుస్తూనే, నవ్వించడం అచీవ్‌మెంట్‌. ప్రస్తుతం ఉన్న నెంబర్‌ 1 ఫిల్మ్‌ మేకర్‌ రాజ్‌ కుమార్‌ హిరాణీ. సంజయ్‌ దత్‌లా రణ్‌బీర్‌ అత్యద్భుతంగా పెర్ఫామ్‌ చేశాడు. మిమిక్రీ చేస్తున్నట్టుగా కాకుండా సంజయ్‌ దత్‌ క్యారెక్టర్‌ స్కిన్‌లోకి వెళ్లి మరి నటించాడు. మనందర్నీ స్క్రీన్‌కి కట్టిపారేస్తాడు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌కొట్టినందుకు టీమ్‌కి  కంగ్రాట్స్‌.  – దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌  

మాస్టర్‌ ఆఫ్‌ సినిమా నుంచి మరో బెస్ట్‌ జెమ్‌ బయటకు వచ్చింది. బెస్ట్‌ ఇవ్వడంలో రణ్‌బీర్, రాజ్‌ కుమార్‌ హిరాణీ ఇద్దరూ పోటీపడ్డారు.   – దర్శకుడు హరీష్‌ శంకర్‌.

రాజ్‌ కుమార్‌ సార్‌... మంచి సినిమా ఇవ్వడం ప్రతిసారీ మీకెలా సాధ్యం అవుతుంది? మైండ్‌బ్లోయింగ్‌ సినిమా. నవ్వించారు. ఏడిపించారు. రణ్‌బీర్, రాజు సార్‌ మీ ఇద్దరికీ పెద్ద హగ్‌. థియేటర్‌ నుంచి ఓ బెటర్‌ పర్సన్‌గా.. నన్ను బయటకు పంపించారు. – ధనుశ్, తమిళ నటుడు

మాస్టర్‌పీస్‌. బయోపిక్‌ తీయడమంటే ఆషామాషీ కాదు. కానీ, రాజు హిరాణీ, రైటర్‌ అభిజిత్‌ జోషీ అద్భుతమైన స్క్రీన్‌ప్లే రాశారు.  పవర్‌ఫుల్‌. ఎంగేజింగ్, ఎమోషనల్‌. రాజ్‌కుమార్‌ ఎందుకు మాస్టర్‌ స్టోరీ టెల్లరో మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. రణ్‌బీర్‌ కపూర్‌కి ఈ సినిమాతో అవార్డ్‌లు, అభినందనలు అందుకుంటాడు. సినిమాలో ప్రతి ఒక్కరు తమ పాత్రల్లో మెరిశారు. – తరణ్‌ ఆదర్శ్, ట్రెడ్‌ అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement