బర్త్‌డే బార్బీ
అందమైన లోకం!
నేడు ఐశ్వర్యారాయ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఐశ్వర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, విశేషాలు... ఐశ్వర్య సినిమా యాక్టర్ అవాలని కలలు కనలేదు! మెడిసిన్ చదవాలని అనుకున్నారు. అదీ పూర్తి చేయలేదు. చదువుకునే రోజుల్లో ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్ జువాలజీ. ఐశ్వర్య యంగ్ మోడల్‌గా ఉన్నప్పుడు ముంబైలో ఓరోజు ఐశ్యర్యను బాలీవుడ్ నటి రేఖ చూశారు. వెంటనే ఆ అమ్మాయిని గుర్తుపట్టి, ఆమెను పలకరించి, భుజం తట్టి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు రేఖ. ఐశ్వర్య తొలి పెప్సీ యాడ్‌ని 1992-93లో ముంబై అల్లర్లు జరుగుతున్న సమయంలో సింగిల్ నైట్‌లో తీశారు. అందులో ఆమిర్ ఖాన్‌తో ఆమె నటించారు. పెప్సీకీ, కోక్‌కి నటించిన ఏకైక మహిళా మోడల్ ఐశ్వర్యే!
ఐశ్వర్యకు ఇష్టమైన చిత్రం ‘కాసాబ్లాంకా’. ఇన్‌గ్రిడ్ బెర్గ్‌మన్ (హీరోయిన్), హంఫ్రీ బోగార్ట్ (హీరో) అందులో నటించారు. 1942 నాటి హాలీవుడ్ మూవీ అది. ఐశ్వర్యకు వాచీలను సేకరించడం ఇష్టం. ఆభరణాలు ధరించడం అయిష్టం. 2005లో బ్రిటన్‌లో ఐశ్యర్యను పోలిన బార్బీ డాల్స్ పరిమితంగా విడుదలయ్యాయి. మార్కెట్‌లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అవన్నీ అమ్ముడయ్యాయి!అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తున్న సమయంలో ఓ టీవీ సీరియల్‌కు డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే ఐశ్వర్య దానిని వదులుకున్నారు. 2005లో ప్లేబాయ్ మేగజన్ ఓనర్ హ్యూ హెఫ్‌నర్.. ఇండియన్ ఎడిషన్ కవర్ పేజీగా నిండైన వస్త్రాలతో ఐశ్వర్య ఫొటోను వెయ్యాలనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు.
అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ 2006లో ఇండియా వచ్చినప్పుడు ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఆమిర్‌ఖాన్‌తో పాటు ఐశ్వర్యకూ ఆహ్వానం అందింది. అయితే అప్పుడు ఐశ్వర్య ధూమ్-2 షూటింగ్ కోసం బ్రెజిల్‌లో ఉండడం వల్ల ఎంతో అరుదైన ఆ విందుకు వెళ్లలేకపోయారు. ఓసారి ఐశ్యర్య దుబాయ్‌లో భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణం అయ్యారు! ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో ఆమెను చూడడానికి అభిమానులు ఎగబడడంతో అలా జరిగింది.
‘ఓప్రా విన్‌ఫ్రే షో’లో పాల్గొన్న తొలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్యారాయ్. మేడమ్ తుస్సాడ్స్ మైనపు బొమ్మల మ్యూజియంలో స్థానం దక్కించుకున్న తొలి భారతీయ నటి ఐశ్వర్య. నర్గీస్ తర్వాత, తనకన్నా వయసులో చిన్నవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న భారతీయ నటి.. ఐశ్వర్య.