ముస్తాబు వస్తాదులకు మేకప్ ఉమన్ కోటింగ్!!
‘చారూ’... కేసు గెలిచారు
అప్పుడప్పుడే రెక్కలు విప్పుకుని ఉపాధి కోసం లోకంలోకి వచ్చిన వారికి ఏమంత ప్రోత్సాహకంగా ఆహ్వానం లభించదు. అలా లోకం మీదికి వచ్చిన వాళ్లు మహిళలైతే ఇక చెప్పే పనే లేదు, ‘‘నీకిక్కడేం పని ఫో’’ అని లోకం తరిమికొడుతుంది. 32 ఏళ్ల చారూ ఖురానానే తీసుకోండి. గత పదేళ్లుగా ఈ ఢిల్లీ యువతి తనకు బాగా వచ్చిన పనిని ముంబైలో చేయడం కోసం పోరాడుతున్నారు. కానీ అక్కడి ‘సినీ కాస్ట్యూమ్ మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ హెయిర్ డ్రెస్సెర్స్ అసోసియేషన్’ ఆమెకు సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరిస్తూ వస్తోంది.
అసోసియేషన్ వాదన ఏమిటంటే మహిళలకు మేకప్ పని అంతగా రాదని! నిజానికి చారూ ఖురానా తన పాతికేళ్ల వయసు నుంచీ ఢిల్లీలో ఫ్యాషన్ షోలు, వాణిజ్య ప్రకటనల షూటింగ్‌లలో మోడళ్లకు మేకప్ వేస్తున్నారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే తన ప్రతిభకు ఢిల్లీలో ఉన్నవి పరిమిత అవకాశాలేనని గ్రహించిన చారూ పదేళ్ల క్రితం బాలీవుడ్ చేరుకున్నారు. చారూ మాదిరిగా ఎవరైనా బాలీవుడ్‌లోని ఏ విభాగంలోనైనా ఉపాధి కోసం ప్రయత్నించదలచుకుంటే ముందుగా ఆ విభాగానికి సంబంధించిన సంఘంలో సభ్యులై ఉండాలి.
అందుకే ఆమె 2004లోనే సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ మేకప్ ఆర్టిస్టుల అసోసియేషన్ ఆమె దరఖాస్తును స్వీకరించలేదు. ‘‘ఆడవాళ్లు ఇక్కడ నిషిద్ధం. అయినా ఆర్టిస్టులకు మేకప్ వేయడం మగవాళ్ల వల్ల మాత్రమే అయ్యే పని’’ అని అసోసియేషన్ నాయకులు చారూ అభ్యర్థనను తిరస్కరించారు. నిజానికి వారి భయం ఏమిటంటే చారూ లాంటి ప్రతిభావంతుల రాకతో తమ ఉపాధికి గండి పడుతుందని.
అయితే చారూ ఈ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు. గత ఆరు దశాబ్దాలుగా మహిళలు తమకు పోటీగా రాకుండా స్వయం ప్రకటిత నిషేధంతో జాగ్రత్తపడుతూ వస్తున్న బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల అసోషియేషన్ లైంగిక వివక్షపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనేక వాయిదాలు, వాదోపవాదాల అనంతరం గతవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల అసోసియేషన్ మహిళలకు సభ్యత్వం ఇవ్వవలసిందేనని స్పష్టం చేసింది.
దీనిపై చారూ ఖురానా హర్షం వ్యక్తం చేశారు.
అయితే ఆ హర్షం... కేసులో తను గెలిచినందుకు కాదు, బాలీవుడ్‌లో తనేమిటో నిరూపించుకునే అవకాశానికి పూర్తి అవరోధం తొలగిపోయినందుకు. అలాగే సాటి మహిళా మేకప్ ఆర్టిస్టులకు ఈ తీర్పు ద్వారా పురుషులతో సమానంగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆమె ఆశిస్తున్నారు. ఇక అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ షెలార్ అయితే తమ సంఘం సుప్రీం కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తుందని ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రకటించారు!
చారూ ఖురానా తరఫు న్యాయవాది జ్యోతిక కల్రాకు ఈ విజయంలో కీలక భాగస్వామ్యమే ఉందని చెప్పాలి. ‘‘ఇది స్త్రీల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం తప్ప మరొకటి కాదు’’ అని వాదించేందుకు ఆమె అనేక ఉదాహరణలను న్యాయమూర్తి ఎదుట ప్రభావవంతంగా ప్రస్తావించగలిగారు. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఇటీవల జరిగిన ఒక సర్వే... ప్రపంచ దేశాలలో (ఇండియా సహా) చలనచిత్ర రంగానికి సంబంధించిన 11 అత్యంత లాభదాయకమైన మార్కెట్లలో బలమైన లైంగిక వివక్ష కొనసాగుతోందని తేల్చి చెప్పిన విషయాన్ని కూడా జ్యోతిక .. న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన సంగతి. మేకప్ ఆర్టిస్ట్ చారూ ఖురానా సాధించిన ఈ విజయం నవతరం మహిళా మేకప్ కళాకారులు బాలీవుడ్‌లో రాణించేందుకు తోడ్పడుతుందని జ్యోతిక వ్యాఖ్యానించారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నవారు... ఒక స్త్రీ (జ్యోతిక) తన విజయాన్ని సాటి స్త్రీ (చారూ ఖురానా) విజయంగా చెప్పడంలోని ఔన్నత్యాన్ని గమనించాలి.