ఊపిరి బిక్కిరి | Bombard breath | Sakshi
Sakshi News home page

ఊపిరి బిక్కిరి

Published Thu, Oct 8 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

ఊపిరి బిక్కిరి

ఊపిరి బిక్కిరి

కాలుష్యం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది... ఊపిరితిత్తుల్లో ఊపిరాడకుండా చేస్తోంది. రోజుకు 22 వేల సార్లు ఊపిరి తీసుకుంటాం... ప్రతిశ్వాసా విషశ్వాసే. ఏం చేయగలం? ఎంతసేపని ఊపిరి బిగపట్టగలం? కొన్ని చర్యలు మన పరిధిలో లేవు. కొన్ని జాగ్రత్తలు మాత్రం మన చేతుల్లోనే ఉన్నాయి.మీ ప్రశ్నలకు ఈ కథనమే కొన్ని సమాధానాలిస్తుంది.  స్వేచ్ఛగా గాలి పీల్చుకోండి. సంతోషంగా జీవించండి.
 
ఊపిరాడితేనే మనం బతకగలం. ఊపిరి స్వచ్ఛంగా ఉంటేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఉండగలం. అయితే, ఆధునికత మనం పీల్చుకునే గాలిలోని స్వచ్ఛతను హరించేస్తోంది. దుమ్మూ ధూళీ కలగలసిన గాలి మన ఊపిరితిత్తుల్లోకి చేరి, ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు గాలిని మరింతగా కలుషితం చేసి పారేస్తుంటే, స్వచ్ఛమైన గాలి కూడా కరువైపోతోంది. నగరాలే కాదు, ఒక మోస్తరు పట్టణాలు, పల్లెలు కూడా వాయుకాలుష్యం బారిన పడుతున్నాయి. కలుషితమైన గాలిని పీల్చడం వల్లనే పసిపిల్లలు దగ్గు జలుబులు మాత్రమే కాదు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మితిమీరిన కాలుష్యానికి గురైన వారు ఊపిరితిత్తుల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకూ బలవుతున్నారు. సహజ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువతీ యువకుల్లో సైతం చాలామంది శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతున్నారంటే, వయసు మళ్లిన వృద్ధుల పరిస్థితి చెప్పేదేముంది? కాలుష్యాల బారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకే ఈ కథనం.
 
సెల్ఫ్‌డిఫెన్స్

గాలి ద్వారా చేరే కాలుష్యాలను అరికట్టేందుకు మన ఊపిరితిత్తులు సెల్ఫ్‌డిఫెన్స్ చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు తుమ్ము కూడా ఒక ఆత్మరక్షణ చర్యే. ఏదైనా సరిపడని పదార్థాలు గాలిలో కలసి లోపలికి చేరితే, ఊపిరితిత్తులు వెంటనే వాటిని తమ్ముల ద్వారా బయటకు పంపిస్తాయి. ఇంట్లో దుమ్ము దులిపేటప్పుడు తుమ్ములు రావడం అందరికీ అనుభవమే. అంతేకాదు, ఊపిరితిత్తులు ఉత్పత్తి చేసే మ్యూకస్ అనుక్షణం ఎగువకు ప్రయాణిస్తూ, కాలుష్యాలను ముక్కు నుంచి వెలుపలకు పంపేస్తుంది. కాలుష్యాలు ఎక్కువగా ముక్కులోకి చేరితే, ఊపిరితిత్తులు కూడా మ్యూకస్‌ను ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తాయి. ఇదే కఫంగా వెలువడి, కాలుష్యాలను బయటకు పోయేలా చేస్తుంది.
 
 పొల్యూషన్‌తో పరేషాన్

 వాతావరణంలో ఉండే 21 శాతం ఆక్సిజన్‌లో మన ఊపిరితిత్తులు తీసుకునేది కేవలం 5 శాతమే. ఈ ఆక్సిజన్‌తో పాటే వచ్చే కాలుష్యాలను ఊపిరితిత్తుల్లోని సెల్ఫ్‌డిఫెన్స్ మెకానిజం శాయశక్తులా వెలుపలకు పంపేస్తూ ఉంటుంది. అయితే, గాలిలో ప్రతినిత్యం చేరే అత్యంత సూక్ష్మ ధూళికణాలు (సస్పెండెడ్ ఎయిర్ పార్టికల్స్), ఇతర పదార్థాలు కూడా ఊపిరి తిత్తుల్లోకి చేరుతుంటాయి. ఇవే పలు వ్యాధులకు కారణమవుతుంటాయి.

ఇలాంటి కాలుష్యాలు కొందరిలో ఆస్తమా (ఉబ్బసం) కలిగించవచ్చు. మరికొందరిలో నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు.నగరాల్లోనే కాదు, పల్లెల్లోనూ స్థానిక కారణాల వల్ల వాయుకాలుష్యం ఏర్పడవచ్చు. ఒక్క నిమోనియాలోనే కాలుష్యాన్ని బట్టి చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు రైతులు ధాన్యాన్ని నిల్వచేసే చోట గింజలపై ఉండే తేమ కారణంగా థర్మోయాక్టినోమైసిటిన్ అనే ఫంగస్ ఏర్పడి, ఒకరకం నిమోనియా వస్తుంది. కోళ్లు, బాతుల వంటి వాటి పెంపకం చేపట్టే చోట్ల కూడా, వాటి మీదుగా వచ్చే గాలిలో క్లెమీడియా అనే సూక్ష్మజీవులు కలవడం వల్ల మరో రకం నిమోనియా వస్తుంది. గొర్రెల మంద మీదుగా ఒక రకమైన వాసనతో వచ్చే గాలిలో కాక్సియల్లా అనే సూక్ష్మజీవులు కలవడం వల్ల కూడా ఇంకో రకం నిమోనియా వస్తుంది.పట్టణాల్లో నిర్మాణ పనులు జరిగే చోట, గనుల తవ్వకాలు జరిగే చోట సన్నటి ధూళికణాలు గాలిలో చేరి, సిలికోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధిని కలిగిస్తాయి.చాలాకాలం వాడని ఏసీలు, కూలర్లలో లెజినెల్లా అనే సూక్ష్మజీవులు పెరిగి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు దారితీస్తాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లు ముదిరి, దీర్ఘకాలంలో క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ)కి దారితీసే అవకాశాలూ ఉంటాయి.
 
నివారణ మార్గాలు

గాలిలోకి వెలువడే కాలుష్యాలను మనం తక్షణమే నివారించలేకపోవచ్చు. అయితే, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా కాలుష్యాన్ని క్రమేణా అదుపులోకి తేవడం దుస్సాధ్యమేమీ కాదు. మనం ఉండే ఇళ్లలోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. చాలాకాలం మూసి ఉంచిన గదుల్లోకి వెళ్లేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకుని వెళ్లడం మంచిది. చాలాకాలం వాడకుండా ఉన్న కూలర్‌ను బయటకు తీసినప్పుడు కాసేపు ఆరుబయట దాన్ని ఆన్‌చేసి ఉంచి, ఆ తర్వాతే దానిని వాడాలి. లిఫ్ట్ వంటి క్లోజ్‌డ్ ప్రదేశాల్లో తుమ్మడం, దగ్గడం వంటివి చేసేటప్పుడు ముక్కు దగ్గర ఏదైనా అడ్డు పెట్టుకోవాలి. పొగతాగే అలవాటుంటే, వెంటనే మానేయాలి. పొగరాయుళ్లందరూ తమ అలవాటును మానేస్తే ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షల మరణాలను నివారించవచ్చు.
     
రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పడేచోట వాహనాల ఇంజన్‌ను ఆపేయాలి. దీనివల్ల ఇంధన వృథాను అరికట్టడమే కాదు, కర్బన కాలుష్యాన్నీ చాలా వరకు తగ్గించవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో కారు వాడే బదులు, కార్ పూలింగ్ వంటి ప్రక్రియల ద్వారా నలుగురూ కలిసి ఒకే కారులో ప్రయాణించవచ్చు. దీనివల్ల ఇంధన వ్యయం తగ్గడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యనూ చాలావరకు నివారించవచ్చు. వ్యక్తిగత వాహనాల బదులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ కింద నడిపే బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించడం వల్ల కూడా ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు. ఒకేచోట ఎక్కువమంది గుమిగూడటాన్ని నివారించడం ద్వారా గాలితో వ్యాపించే స్వైన్‌ఫ్లూ, హెచ్1ఎన్1 వంటి చాలా వైరల్ వ్యాధులను నివారించవచ్చు.జనావాసాల్లో చుట్టుపక్కల మొక్కలు పెంచడం ద్వారా కూడా వాతావరణ కాలుష్యాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు.
 
 బాడీలో ఏసీ మెకానిజం
 ఊపిరితిత్తులకు సహజంగానే సామర్థ్యం చాలా ఎక్కువ. కాబట్టే మన పరిసరాలు కాలుష్య కాసారాల్లా మారిపోయినా మనం ఇంకా ఊపిరి తీసుకోగలుగుతున్నాం. అయితే, పరిసరాల్లోని కాలుష్యం ఊపిరితిత్తుల సామర్థ్యానికి మించినప్పుడే మనకు సమస్యలు మొదలవుతాయి. వెలుపలి నుంచి ఊపిరితిత్తులోకి చొరబడే కాలుష్యాలను తిరిగి బయటకు నెట్టేసే ప్రక్రియ మన శ్వాస వ్యవస్థలో నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ముక్కు నుంచి మొదలైన శ్వాస వ్యవస్థ ఎయిర్ కండిషనర్‌లా పనిచేస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే, మనం లోపలకు పీల్చుకునే గాలిని ముక్కు చల్లబరుస్తుంది. వాతావరణం చల్లగా ఉంటే, ఆ గాలిని వెచ్చబరుస్తుంది. అలా మన ముక్కు ఊపిరితిత్తులకు ఒక స్థిరమైన ఉష్ణోగ్రతలో గాలిని సరఫరా చేస్తూ ఉంటుంది.     
 
మల్టీస్టోరీడ్ సిస్టమ్

 
మన శ్వాసవ్యవస్థ ఒక బహుళ అంతస్థుల నిర్మాణం. ఇందులో మొత్తం 28 అంతస్థులు ఉంటాయి. ఊపిరికి తొలిమెట్టు ముక్కు. అక్కడి నుంచే ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రయాణం మొదలవుతుంది. ముక్కులోని వెంట్రుకలు కాస్త పెద్దపరిమాణంలో ఉండే కలుషిత కణాలను అడ్డుకుంటాయి. ప్రతిరోజూ మనం 22 వేల సార్లు శ్వాసిస్తాం. సగటున 16 వేల లీటర్ల గాలిని పీలుస్తాం.
 మన ఊపిరి తిత్తుల బరువు 1.3 కిలోలు. రెండు తెమ్మెలుగా (లోబ్స్) ఉండే ఊపిరితిత్తుల్లో 30 కోట్ల గాలిగదులు, 60 కోట్ల రక్తనాళాలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలన్నింటినీ కలిపి లెక్కిస్తే, వాటి పొడవు 2400 కిలోమీటర్లు ఉంటుంది. ఊపిరితిత్తుల వైశాల్యం దాదాపు ఒక టెన్నిస్ కోర్టు అంత (70-100 చదరపు మీటర్లు) ఉంటుంది.ముక్కు చివర ఉండే వాయునాళం (ట్రాకియా) శ్వాసవ్యవస్థలోని మొదటి అంతస్తు అయితే, ఊపిరితిత్తుల్లోని గాలిగది (ఆల్వియోలై) చిట్టచివరి అంతస్తు.

శ్వాసవ్యవస్థలోని 14వ అంతస్తు నుంచే ఊపిరితిత్తుల్లోని నిర్మాణాలు కంటికి కనిపించనంత సంక్లిష్టంగా ఉంటాయి.చివరి అంతస్తు అయిన ఆల్వియోలైకి గాలి చేరినప్పుడు, అక్కడ ద్రవంలా ఉండే రక్తం పల్చని కాగితం పొరలా ఏర్పడి, గాలి మార్పిడికి వీలుగా అలా నిలుచుని ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి ఆక్సిజన్ శరీరంలోని కణాలకు అంది, కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళుతుంది.గాలి మాత్రమే శ్వాసవ్యవస్థలోని చివరి అంతస్థు చేరేందుకు వీలుగా ఊపిరితిత్తుల్లోని సన్నటి సీలియో అనే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు సహకరిస్తుంటాయి. శ్వాసవ్యవస్థలో ఎస్కలేటర్లు కూడా ఉంటాయి. ఊపిరితిత్తుల్లోని సీలియోలు ఒక క్రమపద్ధతిలో కదులుతూ, మనకు సరిపడని దుమ్ము, ధూళి కణాలను ఎస్కలేటర్లపైకి ఎక్కించి, బయటకు పంపేస్తూ ఉంటాయి.
 
లంగ్ థింగ్స్
మన ఊపరితిత్తులు రెండూ సమాన పరిమాణంలో ఉండవు. కుడివైపు ఊపిరితిత్తి కాస్త పెద్దగా, ఎడమవైపు చిన్నగా ఉంటాయి.
 మృతశిశువులను పరీక్షించేటప్పుడు ఆ శిశువు చనిపోయే పుట్టిందా లేక పుట్టాక చనిపోయిందా తెలుసుకునేందుకు శవపరీక్ష సమయంలో ఊపిరితిత్తులను నీటిలో వేస్తారు. అవి నీటిలో మునిగితే బిడ్డ చనిపోయే పుట్టిందని, అవి నీట్లో తేలితే పుట్టిన తర్వాత చనిపోయిందని నిర్ధారిస్తారు.మన ప్రాచీన ఆయుర్వేద నిపుణులు శ్వాసక్రియకు ఊపిరితిత్తులే కీలకం అని గుర్తించారు. ఆస్తమాను వారు ‘తమకశ్వాస’గా వ్యవహరించేవారు.

పొగరాయుళ్లు నిత్యం దాదాపు 4 వేల రసాయనాలను ఊపిరితిత్తులకు చేరవేస్తూ ఉంటారు. ఊపిరితిత్తుల్లోని సీలియా సాధ్యమైనంత వరకు వాటిని శుభ్రం చేస్తూ పోతున్నా, తారు వంటి ప్రమాదకర పదార్థాలు ఊపిరితిత్తుల్లో పోగుపడుతూనే ఉంటాయి. పొగతాగడం మానేస్తే... అలా మానేసిన ఐదు గంటల్లోనే ఊపిరితిత్తులు తమలోకి చేరిన కాలుష్యాలను శుభ్రం చేయడం ప్రారంభిస్తాయి. కొంతకాలాన్ని కాలుష్యాలన్నింటినీ క్రమంగా బయటకు పంపేస్తాయి. అందువల్ల పొగతాగే అలవాటును ఎప్పుడు మానేసినా మంచిదే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement