నాన్‌వెజ్ ప్రియులకు ఇప్పుడు ఫార్మలిన్ భయం పట్టుకుంది. చేపలను ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు హానికారక ఫార్మలిన్‌ను వాడుతున్నారనే వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీంతో చేపలంటేనే వినియోగదారులు భయపడిపోతున్నారు.
దేశ వ్యాప్తంగా భయాందోళనలు
ఏపీ, కేరళ నుంచి వస్తున్న చేపలు త్వరగా పాడైపోకుండా వాటిని తాజాగా ఉంచేందుకు ఫార్మలిన్ పూస్తున్నారనే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గోవా అసెంబ్లీని సైతం ఈ అంశం కుదిపేసింది. దీంతో కేరళ, ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి చేపల దిగుమతిని 15 రోజుల పాటు నిలిపివేస్తు గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ పలు ఆంక్షలు విధించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న చేపలను చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేస్తున్నారు. తాజాగా ఫార్మలిన్ అవశేషాలు ఉన్నాయంటూ ఏపీ నుంచి వెళ్లిన ఆరు వేల కేజీల చేపలను డంప్‌యార్డుకు పంపేశారు. ఫార్మలిన్ భయంతో తాజా(బతికివున్న) చేపలనే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
ఏమిటీ ఫార్మలిన్
మనుషుల మృతదేహాలను దీర్ఘకాలం పదిల పరిచేందుకు వినియోగించే రసాయనం ఫార్మాలిన్. ఈ రసాయనం ప్రయోగించడంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోకుండా ఉంటాయి. ఇలా చేయడంతో వారాల తరబడి చేపలు తాజాగా ఉంటాయి. ఫార్మాలిన్ ప్రయోగించిన చేపలు సాధారణ చేపల కంటే గట్టిగా ఉంటాయి. దీనిపై పొలుసు సాధారణ చేపల కంటే రాటుదేలి ఉంటుంది. ఫార్మాలిన్ రసాయనం ప్రయోగంతో చేపమొప్పలు ఎర్రగా నిగనిగలాడతాయి. ఈ చేపల్ని వండే సమయంలో భిన్నమైన వాసన వస్తుంది. ఫార్మలిన్ మానవ శరీరంలో చొరబడితే కేన్సర్ సంభవించే ఆస్కారం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. కడుపులో నొప్పి, వాంతులు అయి ఒక్కోసారి కోమాలోకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
కిట్‌తో పరీక్ష ఇలా..
చేపలు తాజావా కావా? వాటిలో ఏమైనా విషపూరిత రసాయనాలు ఉన్నాయా? అనేవి చాలా సులభంగా తెలుసుకోవచ్చంటోంది... సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్‌టీ) డిపార్ట్‌మెంట్. వినియోగదారులు సులభంగా పరీక్షించి చేపల తాజాదనాన్ని, అందులో ఫార్మలిన్ అవశేషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు వీలుగా ఐసీఏఆర్‌సీఐఎఫ్‌టీ ఈ కిట్‌ను రూపొందించాయి. ఇందులో 25 స్ట్రిప్‌లు ఉంటాయి. కెమికల్ పూసిన ఈస్ట్రిప్‌లను చేపలపై మూడు నాలుగు సార్లు రుద్దాలి. ఈ స్ట్రిప్‌పై ఉన్న పేపర్‌పై డ్రాపర్ సహాయంతో కిట్‌లో ఉన్న సొల్యూషన్‌ను వేయాలి. లేత పసుపు రంగు కలర్‌లోకి పేపర్ మారుతోంది. తక్కువ మోతాదులో ఫార్మలిన్ ఉంటే లేత ఆకుపచ్చ రంగులోకి మారుతోంది. ఎక్కువ మోతాదులో ఉంటే ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ రంగులను గుర్తించవచ్చు. ప్రతీ కిట్‌లోనూ ఓ కలర్ కార్డు ఉంటుంది. ఒక్కో టెస్టుకు సుమారు రెండు రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పటికే ఈ కిట్‌లను కేరళలోని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని, జులై 29 నుంచి వీటిని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇలా చేయాలి..
చేపలను నీటితో పరిశుభ్రంగా కడగాలి. కుళాయి కింద చేపలు ఉంచి నీటిని వదిలి శుభ్రం చేయాలి... నీటితో కడిగినా చెడువాసన వస్తుంటే అవి తాజా చేపలు కాదని గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అలాగే 75 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద కూరను ఉడికించాలి. ఇలా చేయడం ద్వారా కొంత వరకు విషపూరిత రసాయనాలను కొంత వరకు తగ్గించవచ్చు.
ఫార్మలిన్‌ను పట్టేస్తుంది..!
Published Mon, Jul 23 2018 11:26 PM | Last Updated on Tue, Jul 24 2018 3:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment