ఎప్పటిలాగే భుజాన వేసుకుని... | born birth with blinded sundar rajan | Sakshi
Sakshi News home page

ఎప్పటిలాగే భుజాన వేసుకుని...

Published Tue, Mar 17 2015 12:23 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

ఎప్పటిలాగే భుజాన వేసుకుని... - Sakshi

ఎప్పటిలాగే భుజాన వేసుకుని...

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దింపి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడని భేతాళ కథల్లో చదువుకున్నాం. సుందర్‌రాజన్ కూడా విక్రమార్కుడి వంటివాడే. ఇరవై ఏళ్లుగా అతడు గట్టుపై నుండి చెరువులోకి దూకి, శవాన్ని వెదికిపట్టి, భుజానవేసుకుని పైకి తెస్తున్నాడు. భేతాళ కథల్లో విక్రమార్కుడికి శ్రమ తెలియకుండా ఉండడం కోసం శవంలోని భేతాళుడు కథలు చెబుతుంటాడు.

ఇక్కడ ఈయన శ్రమను పట్టించుకునేవారే లేదు. కనీసం ఆ శ్రమను గుర్తించేవారే లేదు. ఇంత చేస్తున్నా  ప్రభుత్వం దృష్టిలో తనకు విలువ లేదని, తనకు కళ్లు లేకున్నా కన్నీళ్లు ఉన్నాయని ఆవేదన చెందుతున్నాడు... పుట్టుకతోనే అంధుడైన
సుందర్‌రాజన్.
 
మిణుగురులు : సమాజానికి దివిటీలు
- కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై
చెన్నై నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో పల్లికరణై సమీపంలోని జల్లడియన్‌పేట సుందర్‌రాజన్ సొంతూరు. లారీ డ్రైవర్‌గా పనిచేసే బాలన్, వెల్లియమ్మ దంపతుల తొమ్మిది మంది సంతానంలో ఇతను ఏడవ బిడ్డ. పుట్టుకతోనే అంధుడు. బ్రెయిలీ పాఠశాలలో చదివించలేని నిరుపేద కుటుంబం వారిది. బాల్యం ఎలాగో గడిచింది. యవ్వనంలో ఉపాధి లేక, బతుకు భారమై దిక్కుతోచని స్థితిలో అన్న దేవనాథన్ సాయంతో ఈత నేర్చుకున్నాడు. ఆనాడు అతనికి తెలియదు ఒకనాటికి ఈ ఈతే తనకు పేరు తెస్తుందని, సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెస్తుందని.
 
ఈత... ఊతం అయింది
కాలక్షేపం కోసం నేర్చుకున్న విద్య అతడిని గజ ఈతగాడిని చేసింది. సుందర్‌రాజన్‌కు 20 ఏళ్ల వయస్సు ఉన్నపుడు అతని ఇంటి సమీపంలోని బావిలో పడి ఒకతను చనిపోయాడు. పురాతన బావి కావడంతో బొంతరాళ్ల నడుమ శవం ఇరుక్కుపోవడంతో ఎవ్వరూ బయటకు తీయలేకపోయారు. సుందర్‌రాజన్ వెంటనే బావిలోకి దూకి శవాన్ని ఒడుపుగా బావి గట్టుకు చేర్చాడు. ఇందుకు సంతోషించిన మృతుని బంధువులు కొంత మొత్తాన్ని ముట్టజెప్పారు. చూపులేని అతని జీవితంలో అదే అతని తొలి సంపాదన. పుట్టుకకు అర్థమే లేని జీవితాన్ని గడుపుతుండగా ఈ సంఘటన అతనిలోని ఆలోచనలను మేల్కొలిపింది. ఈతనే ఊతంగా చేసుకుని అంధకారమైన జీవితంలో వెలుగులు నింపుకోవాలని నిర్ణయించుకున్నాడు.
 
ఇచ్చింది పుచ్చుకుంటాడు
చెరువులు, బావుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారిని వెతికి ఒడ్డుకు చేర్చడమే క్రమేణా అతని వృత్తిగా మారింది. అగ్నిమాపకశాఖలో పనిచేసే గజ ఈతగాళ్లు సైతం నిస్సహాయతను వ్యక్తం చేసిన సంఘటనల్లో సుందర్‌రాజనే వారికి చేయూత నివ్వడం ప్రారంభమైంది. చూపున్నవారు సైతం వెతికిపట్టుకోలేని నీటి అడుగులోని శవాలను కాళ్లతోనే తడిమి అతను గుర్తిస్తాడు. వెంటనే ఆ శవాలను విక్రమార్కుడిలా భుజాన వేసుకుని ఒడ్డుకు చేరుస్తాడు. ప్రస్తుతం చెన్నై మహానగరంలోనే కాదు పరిసర గ్రామాలలో సైతం సేవలు అందిస్తున్నాడు. ప్రమాదకరమైన లోతులున్న నదులు, పాడుబడిన బావులలోని శవాలను పైకి తీసేందుకు అగ్నిమాపక అధికారులు సైతం సుందర్‌రాజన్‌పైనే ఆధారపడుతున్నారు.

ఇతను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి సకల మర్యాదలతో తీసుకెళతారు, పని పూర్తికాగానే కోరిన చోట విడిచిపెడతారు. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో శవాన్ని తీసినా ఇంత ఇవ్వాలని డబ్బు డిమాండ్ చేయడు. ఇచ్చినది పుచ్చుకుంటాడు లేకుంటే ఒకరికి సాయపడ్డానని సరిపెట్టుకుంటాడు. ప్రస్తుతం నలభైలలో పడిన సుందర్‌రాజన్ ఇప్పటి వరకు తాను 149 శవాలను వెలికి తీసినట్లు గర్వంగా చెప్పుకుంటాడు. సమాజానికి మేలు చేసేందుకు సర్వేంద్రియాలూ ఉండాల్సిన అవసరం లేదు, మంచి మనసుంటే చాలు అనేందుకు  సుందర్‌రాజన్ జీవితమే చక్కటి నిదర్శనం.
 
ఆపాటి విలువ కూడా చేయనా?!
కళ్లను లేకుండా చేసి శపించిన ఆ దేవుడు ఈత ద్వారా నాకు వరం ఇచ్చాడు. పదమూడు ఏళ్ల వయస్సులోనే ఈత నేర్చుకున్నా. నదులు, బావుల్లో అరవై అడుగుల లోతున్నా చాలాసేపు ఊపిరిబిగబట్టి లోపలికి వెళ్లి శవాన్ని వెతికిపట్టుకొస్తాను. కాళ్లే నాకు కళ్లు, శవాలను కాళ్లతోనే తడిమి గుర్తిస్తాను. వికలాంగుల కోటాలో  రెండునెలల కిందటే మంజూైరె న వెయ్యి రూపాయల పింఛనే నా జీవనాధారం. పెళి ్లకాలేదు, ఇల్లు లేదు. జల్లడియన్‌పేట పంచాయితీ కార్యాలయం ప్రాంగణంలోనే ఉంటూ, శవం తీయడానికి ఎవరు పిలుస్తారా అని ఎదురుచూస్తుంటా. గత ఇరవై ఏళ్లుగా నాతో పనులు చేయించుకుంటున్న అగ్నిమాపక శాఖ గానీ, ప్రభుత్వం గానీ వికలాంగుల కోటాలో ఉద్యోగం ఇవ్వలేదు.

అవసరమైనపుడు మాత్రం వచ్చి తీసుకెళ్లి తృణమో, పణమో చేతుల్లో పెట్టి పంపేస్తారు. అయినా నేను పెద్దగా బాధపడడం లేదు. కొన్ని లక్షల మంది జనాభా కలిగిన నగరంలో ఇంతటి ఈత సామర్థ్యం కలిగిన వాడిని నేనొక్కడినే అయినందుకు గర్వపడుతున్నా. చూపు లేని కళ్లతోనే శవాల వెలికితీత ద్వారా సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నా. బాంబులను గుర్తించేందుకు కుక్కలను, బందోబస్తు విధులకు గుర్రాలను పెంచి పోషించే పోలీస్ శాఖకు కళ్లు లేని నేను భారమవుతానా? నేను కుక్కపాటి విలువ కూడా చేయనా? కంటిచూపులేని నన్ను ఎందు కోసమైతే వాడుకుంటున్నారో అదే ఉద్యోగం ఇచ్చేలా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement