బట్టలు కట్టుకోవడం తెలుసు... మూటలు కట్టుకోవడం తెలుసు... పిల్లల్ని కట్టుకోవడం తెలుసా... సరదాగా ఉంది కదూ... నిజమే... పిల్లల్ని కట్టుకోవడం... ఈ మాట వినగానే తల్లిదండ్రుల మనసు పరవశిస్తుంది... నవమాసాలు కడుపులో మోసిన పాపాయి భూమి మీద పడగానే ఉయ్యాలలో నిదురిస్తుంది. తల్లి గుండె మీద నిదురిస్తుంది. అమ్మ కాళ్ల మీద నిదురిస్తుంది. మరి అమ్మ బయటకు వెళ్లినప్పుడు. అప్పుడు కూడా అమ్మ గుండెల మీదే పరవశంగా, ప్రశాంతంగా నిదురిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఎంఎస్‌ఎల్ సంస్థ ఈ సదుపాయం కల్పిస్తోంది.
నడుముకి పిల్లవాడిని కట్టుకున్న ఝాన్సీరాణి రూపం అందరికీ గుర్తే. అలా కట్టుకునే యుద్ధం కూడా చేసింది. కూలివారు సైతం పిల్లలను నడుముకి కట్టుకుని పనిచేసుకోవడం భారతదేశంలో చాలాకాలంగా ఒక సంప్రదాయం. పేదరికంతో కొన్నిసార్లు, అవసరం కోసం కొన్నిసార్లు ఇలా నడుముకి బిడ్డను బిగించి కట్టుకోవడం చూస్తూనే ఉంటాం. కారణం ఏమైనా ఇది పటిష్టమైన తల్లిబిడ్డల బంధానికి ప్రతీక.చాలా సంస్థలు బేబీవేరింగ్‌ను ఉత్పత్తి చేస్తునే ఉన్నాయి.
అయితే ఇప్పుడు ముంబైకి చెందిన ఆరుగురు మహిళలు లాభాపేక్షలేకుండా బ్రాండ్ న్యూట్రల్ స్లింగ్ లైబ్రరీని ప్రారంభించారు. దీని పేరు ‘ముంబై స్లింగ్ లైబ్రరీ’ (ఎంఎస్‌ఎల్). ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ బేబీవేరింగ్ దొరుకుతాయి. ఈ బేబీవేరింగ్‌ను, పిల్లల ఆటవస్తువులను కొనలేనివారు అద్దెకు కూడా తీసుకోవచ్చు. పిల్లలకు చుట్టే వస్త్రాలు, పిల్లలను ఆడించే గిలక్కాయలు, మెత్తగా ఉండే పరుపులు... వంటి పిల్లలకు కావలసిన అన్ని వస్తువులు ఈ లైబ్రరీలో అద్దెకు దొరుకుతాయి.
అనేక కంపెనీలు సైతం పిల్లలకు సంబంధించిన అనేక ఉత్పత్తులను వీరికి డొనేట్ చేస్తున్నారు. అన్‌మోల్ బేబీ యజమాని, ఆర్కిటెక్ట్ అయిన రష్మీ భటియా గాజ్రా జూలై, 2014లో ఈ సంస్థను రూపొందించారు. ‘‘కొత్త పేరెంట్స్... పిల్లలను ఎలా ఆడించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపడం కోసం రూపుదిద్దుకుంది ఎంఎస్‌ఎల్’’ అంటారు రష్మీ.
పిల్లలను ఎత్తుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు చేతిలో నుంచి జారిపోతుంటారు. ఒక్కోసారి చెయ్యి నొప్పి వచ్చి, చెయ్యి మార్చుకోవలసి వస్తుంది. చంటిపిల్లల్ని శరీరానికి కట్టుకుంటే ఎంత బావుంటుందోనని ఒక్కోసారి అనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది పిల్లలను ఇలా కట్టుకుని బజారుకి వెళ్లడం, పనులు చేసుకోవడం చూస్తున్నాం. మరింత సౌకర్యంగా ఈ అవకాశాన్ని ఎంఎస్‌ఎల్ కల్పిస్తోంది.ఈ సంస్థలో.. రష్మీతో పాటు, ఆర్కిటెక్ట్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ యమన్ బెనర్జీ కోరగావోంకర్, లాక్టేషన్ కౌన్సెలర్ అలోక్ మెహతా గంభీర్, మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రాచీ షా దేధియా, ఇంజనీర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ కోశలి దాల్వి, ఎంబీఏ హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్ షర్మిలా డిసౌజా.. భాగస్వాములు.
ఇది ఏ విధంగా సహాయపడుతుంది...
గిరిజన సంస్కృతి నుంచి విదేశీ సంస్కృతి వరకు బేబీవేరింగ్ అలవాటుగా వస్తోంది. ఇందులో పసిపిల్లలను భద్రంగా పట్టుకోవడం వల్ల, వాళ్లు సురక్షితంగా, భద్రంగా ఉన్న భావనతో హాయిగా చిరునవ్వులు చిందిస్తూ నిద్రిస్తారు. అంతేకాదు... ఇందులో పిల్లలకు కావలసిన ప్రాథమిక అవసరాలన్నీ తీరుతాయి. ప్రీటెర్మ్ బేబీలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కంగారూలాగ పొట్టలో దాచుకుంటే, వారి శరీరానికి తల్లి శరీరం తగులుతుంటే వెచ్చగా పడుకుంటారు, భద్రత భావనతో త్వరగా కోలుకొంటారు. బిడ్డకు తల్లి పాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక బిడ్డను అక్కున చేర్చుకోవడం వల్ల, తల్లి నుండి సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి. ఇదొక అందమైన, ఆనందకరమైన అనుభవం.
తల్లిపాలు, పాలు మాన్పించడం, తప్పటడుగులు వేసే సమయంలో ఇచ్చే ఆహారం, ఫిట్‌నెస్... వంటివి కూడా తెలియపరుస్తారు. బేబీ వేరింగ్ ఉత్పాదనలకు సంబంధించి కొత్త పేరెంట్స్‌లో ఎన్నో సందేహాలు! పసిపిల్లలు పాడైపోతారా, నడక అలవాటు చేసుకోలేరా, పిల్లల కాళ్లు పాడైపోతాయా, తల్లులకు వీపు నొప్పి వస్తుందా... అంటూ కొందరు తల్లులు సందేహాలు అడుగుతుంటారు. సరైన అవగాహన లేకపోవడం వల్లే వారికి ఇటువంటి అనుమానాలు కలిగి, ఆ అపోహలనే నమ్ముతుంటారని అంటారు రష్మీ. ఇలాంటి అనేక అనుమానాలను నివృత్తి చేస్తుంటారు రష్మీ, భాగస్వాములైన ఆమె స్నేహితులు.
‘‘మేం చేస్తున్న పని కంటే, ప్రేమను పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అభిరుచితో మొదలుపెట్టిందే ఈ ప్రాజెక్టు. మా కంపెనీకి చాలా బేబీ వేరింగ్ బ్రాండ్స్ నుంచి సహకారం లభించింది. ఇక మేం వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అంటారు ప్రాచీషా. రెండేళ్ల కాలంలో ముంబై, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ కంపెనీ 40 సమావేశాలు ఏర్పాటు చేసింది. 50 రకాల బేబీవేరింగ్ ఉత్పత్తులు
పరిచయం చేసింది.
– డా. వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment