మార్జాల వైభోగం | Care Centers For Dogs In Hyderabad | Sakshi
Sakshi News home page

మార్జాల వైభోగం

Published Mon, Dec 2 2019 2:53 AM | Last Updated on Mon, Dec 2 2019 2:53 AM

Care Centers For Dogs In Hyderabad - Sakshi

అదో పిల్లుల డే కేర్‌ సెంటర్‌. కేవలం డే కేర్‌ మాత్రమే కాదు... బోర్డింగ్‌ కూడా ఉంది. బోర్డింగ్‌ హోమ్‌లతో పాటు వాటికి ప్రత్యేక డిష్‌లతో విందు చేసే కేఫ్‌లు, జలకాలాడించే  స్పాలు ఎట్సెట్రాలున్నాయి. వీటికి తోడు బర్త్‌డే పార్టీలూ, రిటర్న్‌ గిఫ్ట్‌లు. అక్కడ వాటి వైభోగం చెప్పనలవి కాదు. కాబట్టి ఓసారి చూసొద్దాం రండి.

శ్రేయ.. ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. యానిమల్‌ అండ్‌ బర్డ్స్‌ లవర్‌ అయిన ఆమెకు సోలో ట్రావెలింగ్‌  హాబీ.  జాబ్‌ షెడ్యూల్‌లో ఏ కొంచెం సమయం దొరికినా వెంటనే ప్రయాణానికి ప్లాన్‌ చేసుకుంటుంది.  కాని చిక్కంతా  తను పెంచుకుంటున్న చిన్ని పిల్లి ‘బర్ఫీ’ దగ్గరే. దాన్నెక్కడ పెట్టాలి?  డాగ్‌ స్టే హోమ్స్‌లా .. పిల్లికీ బోర్డింగ్‌ హోమ్స్‌ ఉంటాయా అని  వెదికింది. దొరికింది. చక్కగా పిల్లిని తీసుకెళ్లి  ఆ ఇంట్లో పెట్టి  నిశ్చింతగా ట్రైన్‌ ఎక్కింది.  ఆమె వెళ్లిన దగ్గర్నుంచి బర్ఫీ  అల్లరి, ఆగడాలు,  సరదా, సంతోషాలు కొత్త పిల్లులతో స్నేహాలు.. శ్రేయకు వాట్సప్‌లో అప్‌డేట్‌ అవుతూనే ఉన్నాయి. పిల్లికింత వైభోగమా? పిల్లలకన్నా ఎక్కువ గారం అందుతున్నట్టుందే అంటూ విచిత్రపడకపోయినా విడ్డురమైతే చెంది ఉంటారు.

పెంపుడు కుక్కల రాజసం పరిపాటే కాని పిల్లికైతే కొత్త. అదీగాక మన పనుల గురించి, మన షెడ్యూల్‌ గురించి ఇసుమంతైనా ఇన్‌ఫర్మేషన్‌ లేని ఆ అమాయక జీవి తనమానాన తాను వెళుతూ మన కంటపడితే  అపశకునంగా లేబుల్‌ వేస్తాం. అలాంటి పిల్లిని కావాలని పెంచుకుంటారా? యెస్‌.. పెంచుకుంటున్నారు. పిల్లి ఎదురుపడితే అరిష్టమనే మూఢత్వాన్ని పటాపంచలు చేస్తూ శ్రేయనే కాదు అలాంటి యూత్‌ ఎందరో కుక్కలతోపాటు పిల్లుల్నీ పెంచుకుంటున్నారు. వాటి కోసం కేర్‌సెంటర్స్‌ వెలిశాయంటేనే అర్థం చేసుకోవచ్చు! ఎక్కడో ఢిల్లీ, ముంబైలాంటి మెట్రో నగరాల్లో కాదు.. అచ్చంగా హైదరాబాద్‌లోనే.  

పిల్లల కంటే ఎక్కువ..
హైదరాబాద్‌లోని క్యాట్‌ స్టే   కేంద్రాల్లో ’బెంజి క్యాట్‌ బోర్డింగ్‌’ ఒకటి. దాన్ని నిర్వహిస్తున్నది మహిళే. పేరు అశ్విని. స్వస్థలం పాలక్కాడ్‌. మాస్‌ కమ్యూనికేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అయిన  అశ్వినికి మొదటి నుంచీ జంతువులన్నా, పక్షులన్నా, ప్రకృతి అన్నా ప్రాణం. తన పెళ్లి చూపులప్పుడు కూడా చెప్పింది తనను చూడ్డానికి వచ్చిన అబ్బాయితో... తనకు యానిమల్స్‌ అంటే ఇష్టమని, పిల్లల కన్నా వీటినే ఎక్కువ ఇష్టపడ్తానని, పిల్లల్నీ వద్దనుకుంటున్నానని... అంతగా కావలనిపిస్తే అనాథ పిల్లను దత్తత తీసుకోవాలనుకుంటున్నాని.. ఇవన్నీ నచ్చితేనే ఓకే చెప్పమని. ఆమెతోపాటు ఆమె జీవకారుణ్యమూ నచ్చి  ఓకే చెప్పాడు.  ఆమెకు మాటిచ్చినట్టుగానే పెళ్లయ్యాక ఆమె ఇష్టాలకెప్పుడూ అడ్డుచెప్పలేదట భర్త. ‘‘నిజానికి మా ఆయనా యానిమల్‌ లవరే. ఇక్కడికి (హైదరాబాద్‌) రాకముందు చెన్నైలో ఉండేవాళ్లం.

అక్కడే నేనొక డిజిటల్‌ యాడ్‌ ఏజెన్సీలో పనిచేసేదాన్ని. కొన్నాళ్లకు మానేసి నిర్మిత, ప్రసన్న అనే ఇద్దరు మహిళలు  రన్‌ చేస్తున్న బెంజి క్యాట్‌ బోర్డింగ్‌లో వాళ్లకు అవసరమున్నప్పుడు హెల్ప్‌ చేసేదాన్ని. ఆ తర్వాత మా ఆయనకి హైదరాబాద్‌లో మంచి ఆపర్చునిటీ రావడంతో ఇక్కడికి మకాం మార్చాం. ఇక్కడా పిల్లుల్ని పెంచుకునేవాళ్లుండడం, వాటికి కేర్‌ సెంటర్స్‌ పెద్దగా లేకపోవడంతో ఇక్కడ  క్యాట్‌ బోర్డింగ్‌ స్టార్ట్‌ చేశాను. అల్కపురి టౌన్‌షిప్‌లో.. రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లో ఇంకా చెప్పాలంటే మేము ఉండే ఫ్లాట్‌లోనే క్యాట్‌ బోర్డింగ్‌ పెట్టా.

చుట్టుపక్కల వాళ్ల నుంచి నాకెలాంటి ఇబ్బంది లేదు. రావట్లేదు.  దీన్ని బిజినెస్‌లా చేయట్లేదు. హాబీగా రన్‌ చేస్తున్నా. నాకు సొంతంగా  ఓ పిల్లి, కుక్క, చిలక ఉన్నాయి. వాటిని పిల్లలకంటే ఎక్కువగా ప్రేమిస్తా.  ‘‘పెట్స్‌ సరే పిల్లల్నెప్పుడు కంటారు?’’ అంటూ  మా పేరెంట్స్, అత్తమామల కన్నా చుట్టాలే  అడుగుతుంటారు! పెళ్లికిముందే మా అమ్మకూ చెప్పాను .. దేశంలో ఇంతమంది అనాథలున్నారు. వాళ్లలో ఒకర్ని చూసుకుంటా. పిల్లల్ని కనను అని. అదే విషయం మా ఆయనకూ చెప్పాను. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. కాబట్టి ఇంకెవరికో ఆన్సర్‌ చేయాలనుకోను’’ అంటోంది అశ్విని.

కేఫ్‌లు... హ్యాంగవుట్స్‌
కేర్‌ సెంటర్లు, బోర్డింగ్స్‌ సరే.. పెట్‌ యానిమల్స్‌ కోసం కేఫ్‌లూ ఉన్నాయి హైదరాబాద్‌లో. ఇందులో వాటికోసం కుకీస్, కేక్స్, పఫ్స్, కేక్స్‌ వగైరా దొరుకుతాయి. గచ్చిబౌలిలోని  ‘కేఫ్‌ డి లోకో’ను ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ యజమాని  హేమంత్‌ నిర్వహిస్తున్నారు. ‘‘మా  కేఫ్‌లో మనుషులకు, పెట్‌ యానిమల్స్‌కు వేరువేరు కిచెన్స్‌ ఉన్నాయి.  ఈ కేఫ్‌ ద్వారా వచ్చే  ఆదాయాన్ని వీథి కుక్కల ఆరోగ్యం, సంరక్షణ మీద ఖర్చు పెడ్తున్నాం. వీథి కుక్కల దత్తత బాధత్యనూ చేపట్టాం. అర్థం చేసుకుని, బిడ్డల్లా పెంచుకునే ఓపిక, ప్రేమ ఉన్నవాళ్లకు వాటిని దత్తతకిస్తున్నాం. ఈ కుక్కపిల్లలకు బర్త్‌డే పార్టీలు అరేంజ్‌ చేస్తాం. కుక్కపిల్లలకు రిటర్న్‌ గిఫ్ట్స్‌ కూడా ఇస్తాం. పిల్లలకూ పర్యావరణం, జంతువులు, పక్షులు, ప్రకృతి మీద ప్రేమా  పెరుగుతోంది. వాటిని కాపాడుకోవాలనే బాధ్యతా తెలుస్తోంది. అన్నిటికీ మించి మనం అనే భావన కలుగుతోంది’’ అంటారు  హేమంత్‌. కొందరికి తమ జీవనశైలి చుట్టూ ఉన్న పరిసరాలపట్ల ఎంత స్పృహ లేకుండా ఉందోమరికొందరికి అంతే స్పృహ ఉందనడానికి ఇదే నిదర్శనమేమో!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement