
సాక్షి, హైదరాబాద్: సామాజికసేవ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ యానిమల్ సర్వీస్ చేసేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్. సౌదీ అరేబియాలో జాబ్ చేసిన ఇతను భారత్‌కు తిరిగి వచ్చాక సమాజసేవ చెయ్యాలనుకున్నాడు. దీంతో ఘటకేసర్‌లో ఆర్ఫనేజ్ మొదలు పెట్టాడు.
అయితే ల్యాండ్ సమస్య వల్ల అది మూసివేయాల్సి వచ్చింది. గత 12 సంవత్సరాల నుంచి మాత్రం ఈయన డాగ్ లవర్‌గా మారిపోయారు. ఎల్లారెడ్డిగూడ నుంచి ఎస్‌ఆర్‌నగర్ వరకు రోజూ 200 నుంచి 250 వీధి కుక్కలకు ఈయన భోజనం పెడుతుంటాడు. వివిధ ప్రమాదాల నుంచి కాపాడిన కుక్కలు కూడా ఈయన దగ్గర 10 వరకు ఉన్నాయి.
రోజూ ఉదయం 4 గంటలకు లేచి కుక్కలకోసం వంట వండడం స్టార్ట్ చేస్తారు. ఉదయం దాదాపు 70 కుక్కలకు, సాయంత్రం 200 నుంచి 250 కుక్కలవరకు పోషిస్తున్నాడు. పైగా చికెన్ బిర్యానీ లాంటివి కూడా వండి పెడుతుంటాడు. వీటికి నెలకు 60 వేలు ఖర్చవుతుంది. అయినా కూడా ఈయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. స్నేహితులు, చుట్టాలు, యానిమల్ లవర్స్ సహాయంతో దీనిని నేటికి కొనసాగిస్తున్నాడు. ఆయన చేస్తున్న ఈ పనికి తన కుటుంబం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.