
అంతొద్దు గురూ!
ఫన్
లింగారావుకు ఒక గట్టి నమ్మకం... తాను ఈ ప్రపంచంలో ఎవరినైనా తేలికగా మోసం చేయగలనని. ఒకరోజు పేపర్లో డాక్టర్ సుబ్బారావు ప్రకటన చేశాడు. అందులో ఇలా ఉంది:‘ఎలాంటి జబ్బుకైనా మెరుగైన చికిత్స ఇవ్వబడుతుంది. ఒకవేళ జబ్బు నయం కాకపోతే మీ ఫీజు 300లు తిరిగి ఇవ్వడంతో పాటు 1000 రూపాయలు ఇవ్వబడుతుంది’ డాక్టర్ సుబ్బారావును మోసం చేసి 1000 రూపాయలు కొట్టేయాలనుకున్నాడు లింగారావు. సుబ్బారావు ఆస్పత్రికి వెళ్లి ‘‘సార్... నా నాలుక ఏ రుచినీ గుర్తించడం లేదు’’ అన్నాడు. ‘‘బాక్స్ నంబర్ 22 నుంచి మెడిసిన్ డ్రాప్స్ పట్టుకు రా’’ అని నర్స్‌కు చెప్పాడు డాక్టర్ సుబ్బారావు.
నర్స్ ఆ మెడిసిన్ తెచ్చి నాలుగైదు చుక్కలు లింగారావు నాలుక మీద వేసింది. ‘‘ఛీ...ఛీ... ఇవి పేడనీళ్లు’’ అని అరిచాడు లింగారావు.
‘‘కంగ్రాచ్యులేషన్స్... మీ నాలుకకు రుచులను గుర్తు పట్టే శక్తి వచ్చింది’’ అన్నాడు డాక్టర్. 300 రూపాయలు కోల్పోయినందుకు తెగ బాధ పడిపోయాడు లింగారావు. ఈసారి ఎలాగైనా డాక్టర్‌ను మోసం చేయాలని రెండు వారాల తరువాత ఆస్పత్రికి వచ్చాడు లింగారావు. లింగారావు: డాక్టర్ నేను పూర్తిగా జ్ఞాపకశక్తిని కోల్పోయాను. డాక్టర్: బాక్స్ నెంబర్ 22 నుంచి మెడిసిన్ తెచ్చి ఇవ్వు.
లింగారావు: డాక్టర్.. నా నాలుకకు ఎలాంటి సమస్యా లేదు. సమస్య నా జ్ఞాపకశక్తి గురించే!
డాక్టర్: కంగ్రాచ్యులేషన్. మీ జ్ఞాపకశక్తి తిరిగి వచ్చింది!