
2013 విలయంలో ధ్వసంమైన కేదార్‌నాథ్ ఆలయం, చంచల్ (కింది ఫొటో)
చంచల్ వయసు ఇప్పుడు 17 ఏళ్లు. కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్) వరదల్లో తప్పిపోయినప్పుడు ఆమె వయసు పన్నెండు. చంచల్ 2013లో తల్లిదండ్రులతో కలిసి కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో ప్రకృతి విలయ తాండవం చేసినప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. చంచల్ తండ్రి వరదల్లో చనిపోయాడు. తల్లి నీటిలో కొట్టుకుపోయి.. కొన్నాళ్లు భర్త కోసం, కూతురి కోసం అక్కడక్కడే వెదికి, చివరికి అధికారుల సహకారంతో ఇంటికి వెళ్లిపోయింది. చంచల్ మాత్రం ఎవరికీ కనిపించలేదు! ఏమైపోయిందో తెలీదు. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆమె రాకతో ఆలీఘర్‌లో (ఉత్తర ప్రదేశ్)లో వాళ్లు నివాసం ఉండే బన్నాదేవి ప్రాంతంలో సందడి మొదలైంది. చంచల్ తాతగారు హరీష్ చంద్, అమ్మమ్మ శకుంతలాదేవి సంతోషాన్ని ఎవరూ పట్టలేకపోతున్నారు. తల్లయితే చంచల్‌ని తన చేతుల్లోంచి అసలే వదిలిపెట్టడం లేదు. ‘అంతా ఆ కేదారనాథుడి దయ’ అంటోంది. ఇంతకీ ఏం జరిగింది? పన్నెండేళ్ల వయసుకు పిల్లలు తెలివిగానే ఉంటారు.
అయితే చంచల్‌కు మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడంతో తానెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోతున్న స్థితిలో జమ్మూ నుంచి కేదార్‌నాథ్ వచ్చినవారు, తిరిగి జమ్మూ వెళుతూ చంచల్‌ని కూడా తమతో తీసుకెళ్లి అక్కడి అనాథాశ్రమంలో చేర్పించారు. ఈ ఐదేళ్లలోనూ మానసికంగా కొంత వికసించిన చంచల్.. తరచు అలీఘర్ గురించి మాట్లాడుతుండడం గమనించిన ఆశ్రమం నిర్వాహకులు ఆమె నుంచి మరికొన్ని వివరాలు రాబట్టి అలీఘర్ సిటీ లెజిస్లేటర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఈ సంగతిని ఒక ఎన్జీవోకు చెప్పారు. ఆ ఎన్జీవోలు బన్నాదేవి ప్రాంతంలోని చంచల్ కుటుంబ సభ్యులను గుర్తించారు. తర్వాత అలీఘర్ పోలీసుల సహాయంతో చంచల్ తన ఇంటికి చేరింది.