
జన్యుమార్పులను కచ్చితంగా చేయగల క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ ద్వారా హెచ్‌ఐవీకి చెక్ పెట్టడం సాధ్యమేనని అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మందిని పట్టి పీడిస్తున్న ఈ వ్యాధికి ప్రస్తుతం సరైన చికిత్ప లేదు. యాంటీ రెట్రోవైరల్ మందులు వాడుతూంటే జీవితకాలం కొంత మెరుగయ్యే అవకాశం మాత్రమే ఉంది. హెచ్‌ఐవీ వైరస్ శరీర కణాల్లో తన జన్యుభాగాలను జొప్పించడం వల్ల.. మందులు వాడుతున్నంత సేపు అవి నిద్రాణంగా ఉంటాయి. ఆ తరువాత విజంభిస్తాయి. క్రిస్పర్ క్యాస్9 జన్యువుల్లో మార్పులు చేసేందుకు సమర్థంగా ఉపయోగపడుతుందన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో జపనీస్ శాస్త్రవేత్తలు ఆరు రకాల హెచ్‌ఐవీ వైరస్‌లలోని డీఎన్‌ఏ భాగాలను క్రిస్పర్ క్యాస్9లో ఉపయోగించారు.
ఫలితంగా హెచ్‌ఐవీ వైరస్‌ను నియంత్రించే జన్యువులు పని చేయకుండా పోయాయి. ప్రస్తుతం తాము ప్రయోగశాలలో హెచ్‌ఐవీతో కూడిన కణాలపై ప్రయోగాలు చేశామని, క్రిస్పర్ క్యాస్9ను మానవుల్లో ప్రవేశపెట్టడం ఎలా? తద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చూడటం ఎలా అన్న అంశాలపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కామెఓకా తెలిపారు. హెచ్‌ఐవీకి పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment