వివరం: మాట్లాడుకోవాల్సిన మహమ్మారి
డిసెంబర్ 1 ఎయిడ్స్ డే
డిసెంబర్ 1 ‘ఎయిడ్స్ దినోత్సవం’ కాదు; అది ఎయిడ్స్ దినం మాత్రమే! అందులో ఉత్సవం ఎక్కడ?
ప్రపంచాన్ని భయపెట్టే యుద్ధ బీభత్సాలు, ప్రకృతి ఉత్పాతాలు, కరువు కాటకాల లాంటి జాబితాలో ‘ఎయిడ్స్’ కూడా చేరిపోయింది. అధికంగా వినడం వల్ల కొంత పలుచబారిపోయినట్టనిపించినా, అదింకా మెడికల్ ఛాలెంజే!
మధ్యయుగాల్లో మశూచి, ప్లేగులాగా ఈ ఆధునిక కాలంలో ఎయిడ్స్ అటు చికిత్సలేని వ్యాధి; కొంత ‘నైతికత’తో
ముడిపడివుండటం వల్ల ఇటు వివక్షను ఎదుర్కునేది కూడా! అందుకే దానిగురించి ఇంతగా ప్రచారం!
మనమూ హెచ్‌ఐవి/ఎయిడ్స్ గురించి మాట్లాడుకుందాం; మాట్లాడకుండా దాచుకోవడమే కదా ప్రమాదం!
ఐక్యరాజ్యసమితి అంచనా మేరకు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ‘ఎయిడ్స్’తో సుమారు 3.6 కోట్ల మంది చనిపోయారు. ఈ సంఖ్య దాదాపుగా కేరళ లాంటి ఒక రాష్ట్ర జనాభా మొత్తం!
అదే ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఒక్క 2012 సంవత్సరంలోనే ఎయిడ్స్ సోకినవాళ్లు 16 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య ప్రకాశం లాంటి జిల్లా జనాభాలో దాదాపుగా సగం!
ఇంత ప్రచారంలో కూడా, ప్రతిరోజూ 900 మంది పిల్లలు పుడుతూనే కొత్తగా హెచ్‌ఐవి బారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతోంది. ఈ సంఖ్య ఒక పెద్ద పాఠశాలలోని విద్యార్థుల మొత్తానికి సమానం!
మరణించేవారంతా ఎక్కువగా పేద, వెనకబడిన దేశాల్లోనివారే! హెచ్.ఐ.వి. అంటే ఏమిటో, ఎయిడ్స్ అనే పదాన్ని ఎలా విస్తరించాలో తెలియనివాళ్లు కూడా వీటివల్ల అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
హెచ్‌ఐవి ఏమిటి? ఎయిడ్స్ ఏమిటి?
హెచ్‌ఐవి (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) మనిషిలో రోగనిరోధకశక్తిని హరింపజేసే ఒక వైరస్. ఇది ప్రధానంగా శరీరంలోని ద్రవాల్లో ఉంటుంది. రక్తం, వీర్యం, మహిళల్లోనైతే యోనిద్రవాలు, చనుబాలు దీని స్థావరాలు. ఇది ఎవరికైనా ఉందని నిర్ధారణ కావడమేహెచ్‌ఐవి పాజిటివ్. అయితే, దీనికిదే జబ్బు కాదు.
వైరస్ సోకిన ఒకటి నుంచి నాలుగు వారాల్లో అది మనిషి శరీరంలో పూర్తిగా వ్యాపిస్తుంది. తన సంఖ్యను తాను పెంచుకుంటూ పోతుంది. పెంచుకోవడమే కాకుండా, మనిషికి రోగనిరోధక శక్తినిచ్చే సీడీ-4 కణాలను చంపుతూ ఉంటుంది. దీనివల్ల, మరేదైనా వ్యాధికారక వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, దాన్ని సహజంగా ఎదుర్కోగలిగే రక్షణ వ్యవస్థ మనిషికి ఉండదు. దాంతో అతడికి ఏ స్వల్ప రుగ్మత సోకినా ప్రాణాలమీదికి వస్తుంది. ఇదీ ఎయిడ్స్! (ఎ.ఐ.డి.ఎస్.- ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్).
తొలుత ‘4హెచ్’ వ్యాధి
హెచ్‌ఐవి సోకిన తర్వాత, మనిషిలో సీడీ కౌంట్ 200/ఎంఎం క్యూబ్ దాకా పడిపోయినప్పుడు ఎయిడ్స్‌కు దాదాపుగా చేరువైనట్టు! ఈ స్థితి కొందరికి ఒకట్రెండేళ్లకే రావొచ్చు; కొందరికి 10-12 ఏళ్లదాకా ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చు. 1981లో అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ తొలిసారిగా ఎయిడ్స్ వ్యాధిని గుర్తించింది. తర్వాత, దీనికి కారణం హెచ్‌ఐవి వైరస్ అని తేల్చింది. 1970ల ప్రాంతంలో కొందరు అమెరికా యువకుల్లో- ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వాడేవారు, హోమోసెక్సువల్సులో రోగనిరోధక శక్తి పోయి, అరుదుగా సంభవించే చర్మవ్యాధులు వారికి సోకాయి. అంతుబట్టని, పేరులేని రుగ్మతలుగానే ఇవి కొన్నాళ్లు కొనసాగాయి. కొంతకాలం దీన్ని ‘4హెచ్ వ్యాధి’ అని పిలిచేవారు. ఎందుకంటే-హైతియన్స్(అమెరికాలోని హైతీమూలాలున్న ప్రజలు), హోమోసెక్సువల్స్(స్వలింగ సంపర్కులు), హీమోఫీలియాక్స్(రక్తం ఆగనివాళ్లు), హెరాయిన్ యూజర్స్(మాదకద్రవ్యం హెరాయిన్ వాడేవాళ్లు)లో మాత్రమే ఈ వ్యాధిని తొలుత ఎక్కువగా గుర్తించడంవల్ల! మరికొన్నాళ్లు ‘గ్రిడ్’ (జి.ఆర్.ఐ.డి.- గే రిలేటెడ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ)గా కూడా పిలిచారు. ఇది స్వలింగ సంపర్కులకు మాత్రమే పరిమితమైన జబ్బు కాకపోవడం వల్ల దీనికి మించిన పేరు అవసరమైంది. అలా ‘ఎయిడ్స్’ అనే మాట ఉనికిలోకి వచ్చింది.
ఆఫ్రికా కోతుల్లో మొదలు...
ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలో పశ్చిమ మధ్య ఆఫ్రికాలో హెచ్‌ఐవి వైరస్ ప్రాణం పోసుకుందని అంచనా వేస్తున్నారు. కామెరూన్ దేశంలో కొన్ని రకాల పెద్ద కోతులకు ఎస్.ఐ.వి. (సిమియన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) సోకింది. ఇందులో వైల్డ్ చింపాంజీల్లాంటివాటి శరీరంలో ‘ఎస్‌ఐవి’ నిరోధకత లేదు; అదే, గుడ్లగూబకోతుల్లాంటివి మాత్రం తట్టుకోగలవు. వేటగాళ్లకుగానీ, వన్యమృగాల మాంస విక్రేతలకుగానీ ఈ వైరస్ పాకివుంటుంది. అయితే మనిషి శరీరంలోని రోగనిరోధకత ఈపాటి వైరస్‌ను సులభంగా అణచివేయగలదు!
బ్రిటన్ వలస దేశాలుగా ఉన్న ఆఫ్రికా దేశాల్లో సమాజ మార్పులు జరిగి, వ్యభిచారం తీవ్రంగా పెరిగింది. 1928 ప్రాంతంలో కాంగో రాజధాని కిన్షాసాలో 45 శాతం మంది స్త్రీలు వ్యభిచార వృత్తిలో ఉన్నారు. మామూలు శృంగారంలో ఈ వైరస్ వ్యాప్తి తక్కువే అయినా, భాగస్వాముల్లో ఒకరికి సుఖవ్యాధులు ఉన్నప్పుడు, మర్మాంగాల్లో పొక్కులు ఉన్నప్పుడు వైరస్ బలం ఎక్కువ.
అలాగే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మలేరియా నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా శుభ్రం చేయని సిరంజీలతో టీకాలు గంపగుత్తగా వేయడం వల్ల ఈ వైరస్ అతి త్వరగా వ్యాప్తిచెందిందనీ, అక్కణ్నుంచి ప్రపంచాన్ని చుట్టుకుపోయిందనీ చెబుతారు. హెచ్‌ఐవి వైరస్‌లో రెండు రకాలున్నాయి. హెచ్‌ఐవి -1. ఇది చింపాంజీ, గొరిల్లాలాంటివాటిల్లో కనబడింది. హెచ్‌ఐవి-2 మరికొన్ని రకాల కోతులకు సోకుతుంది. అయితే, వాటికి దాన్ని తట్టుకునే నిరోధకశక్తి ఉంది. హెచ్‌ఐవి-1ను తిరిగి ‘ఎం’, ‘ఎన్’, ‘ఒ’ , ‘పి’ అని నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. మిగతావి కూడా ఎయిడ్స్‌ను కలగజేసినప్పటికీ ‘ఎం’ మనకు ఎక్కువ ప్రమాదకారి. 90 శాతం ఎయిడ్స్ రోగుల్లో ఉండేది ఇదే! హెచ్‌ఐవి అని మనం సాధారణంగా వ్యవహరిస్తున్నది నిజానికి ‘హెచ్‌ఐవి-1 ఎం’.
మూడు ముఖ్యమైన మార్గాలు
‘‘హోమోసెక్సువల్స్‌కు దేవుడు విధించిన శిక్ష మాత్రమే కాదు ఎయిడ్స్; హోమోసెక్సువల్స్‌ను సహిస్తున్నందుకు దేవుడు సమాజానికి విధించిన శిక్ష కూడా’’ అన్నారు మతగురువు జెర్రీ ఫాల్‌వెల్. టాన్స్‌జెండర్స్, హోమోసెక్సువల్స్, బై సెక్సువల్స్... భాగస్వాముల్ని మార్చుతారు కాబట్టి, హై రిస్కు గ్రూపుగా ఉన్నప్పటికీ, అది వాళ్లకు మాత్రమే పరిమితం చేయడం వివక్ష మాత్రమే! సురక్షిత శృంగారంలో పాల్గొనని ఎవరికైనా రిస్కులో తేడాలేదు. అత్యాధునిక సమాజమనుకునే అమెరికాలో కూడా ఇంత ప్రచారం జరిగినా, యువకుల్లో యాభై శాతం మంది కండోమ్‌ను ఉపయోగించట్లేదు.
వైరస్ శరీరంలో ఉన్నవారితో లైంగిక సంబంధాలవల్ల, రక్తమార్పిడి వల్ల, బిడ్డ నుంచి తల్లికి ఇది ముఖ్యంగా సోకుతుంది. వెంటనే లక్షణాలు కనిపించవు. హెచ్‌ఐవి సోకినట్టు కూడా తెలియదు. కొంత కాలం గడిచాక జ్వరం రావడం, ముఖం, మెడ, ఛాతీ మీద రాష్ రావడం, లింఫ్‌నోడ్స్ వాచడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్లనొప్పులు వస్తాయి. బరువు తగ్గుతుంది. వికారం, వాంతులు ఇతర లక్షణాలు. వ్యాధి ముదురుతున్నకొద్దీ జ్వరం అధికమవడం, నీళ్ల విరేచనాలు, మర్మావయల్లో మంట, కంటిచూపు మందగించడం, శ్వాస పీల్చడం కష్టంకావడం, రాత్రుళ్లు చెమటపట్టడం, డయేరియా కనబడతాయి. హెచ్‌ఐవి రోగుల్లో అనుబంధ రోగాలు కూడా ఉండే అవకాశముంది. మూత్రపిండాల వ్యాధి (హెచ్‌ఐవి అసోసియేటెడ్ నెఫ్రోపతి), మెదడు పనితీరులో మార్పులు, హెపటైటిస్ బి/సి, క్షయ.
సాధారణంగా అత్యధిక ప్రజానీకానికి (85శాతం) క్షయను కలిగించే ట్యూబర్‌క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే టీబీ వ్యాప్తికారక బ్యాక్టీరియా శరీరాల్లో ఉంటుంది. సహజంగా ఉండే వ్యాధి రోగనిరోధక శక్తి వల్ల బ్యాక్టీరియా నిద్రాణంగా ఉంటుంది. దీనికిదే టీబీ అవదు. హెచ్‌ఐవి సోకి రోగనిరోధక శక్తి తగ్గిపోవడం మొదలుపెట్టగానే బ్యాక్టీరియా విజృంభిస్తుంది. అప్పుడు లక్షణాలు కనబడతాయి. అందుకే టీబీ ఉన్నవాళ్లకు హెచ్‌ఐవి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.
చికిత్స
వైరస్ సోకివుంటుందని అనుమానం వ్యక్తం చేసినవాళ్లకు ముందుగా 72 గంటల్లోపు(మూడు రోజుల్లోపు) ఎమర్జెన్సీ హెచ్‌ఐవి పిల్స్ ఇస్తారు (పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్). ఈ చికిత్స నాలుగు వారాల పాటు సాగుతుంది. హెచ్‌ఐవి నిర్ధారణ పరీక్ష వైరస్ సోకిన నాలుగు నుంచి ఆరు వారాల్లో చేస్తారు. ‘పాజిటివ్’ అయితే గనక దానికి రోగి శరీరంలో రోగనిరోధకశక్తిని బయటినుంచి పెంచడమే మార్గం. దానికోసం ‘యాంటీ రెట్రోవైరల్’(ఎ.ఆర్.టి.) మందులు ఇస్తారు.
హెచ్‌ఐవి తనను తాను కాపీ చేసుకుంటూ సంఖ్య పెంచుకోవడమేగాక, మందులనుంచి నిరోధకతను కూడా పెంపొందించుకుంటుంది. అందుకని ఆ వైరస్‌ను తప్పుదారి పట్టించేందుకు రకరకాల ఎ.ఆర్.టి. మందులను భిన్న కాంబినేషన్లుగా ఇస్తారు. ఈ మందులు ఇవ్వడం కూడా మూడు దశల్లో జరుగుతుంది. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్, సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్, కాక్‌టెయిల్ ఆఫ్ మెడిసిన్స్! వీటిని దీర్ఘకాలం పాటు ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయి శరీరాకృతి మారిపోవచ్చు. కానీ జీవితకాలాన్ని పెంచుకోవడానికి వాటిని భరించాల్సిందే!
ఇక, గర్భధారణ, ప్రసవం, పాలిచ్చే సమయంలో తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ సంక్రమించవచ్చు. ఇది 20-45 శాతం రిస్కు. నిర్ధారణ అవగానే తల్లి చికిత్స తీసుకోవడం, ముందే సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీయడం, పాలివ్వకపోవడం, బిడ్డకూ ప్రొఫిలాక్సిస్ మందులు ఇప్పించడం ద్వారా హెచ్‌ఐవి సంక్రమణ రిస్కును 2 శాతానికి తగ్గించవచ్చు.
మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్!
హెచ్‌ఐవి ఉన్నప్పటికీ, అది ఎయిడ్స్‌లాగా మారినప్పటికీ అలాంటివారితో కరచాలనం చేసినా, కౌగిలించుకున్నా, ఒకే చోట నివసించినా, ఒకే పాత్రలు పంచుకున్నా వైరస్ సోకదు. ఆ రోగికి సేవలు చేసినా ప్రమాదం లేదు. వారితో కలిసి టాయ్‌లెట్ వాడుకోవచ్చు, టవల్స్ వాడుకోవచ్చు. రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టినా ఏమీకాదు. ఉమ్మి, కన్నీళ్లు హెచ్‌ఐవిని సంక్రమింపజేయవు.
శాశ్వత చికిత్స, వ్యాక్సిన్ ఇప్పటికి అందుబాటులో లేకపోయినా... బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ , క్రమంగా మందులు వాడుకుంటూ, నియమబద్ధమైన జీవితాన్ని గడిపేవాళ్లకు హెచ్‌ఐవి అంత భయపెట్టేదేమీ కాదు!
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 2012 నాటికి జనాభాలో శాతాల ప్రకారం అత్యధికంగాహెచ్‌ఐవి బారినపడ్డ పదిదేశాలు:
దేశం శాతం
స్వాజిలాండ్ 26.5
లెసోతో 23.1
బోట్స్‌వానా 23.0
దక్షిణాఫ్రికా 17.9
జింబాబ్వే 14.7
నమీబియా 13.3
జాంబియా 12.7
మొజాంబిక్ 11.1
మాలవి 10.8
ఉగాండా 7.2
నాలుగు కోట్ల బాధితులు!
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2012 నాటికి హెచ్‌ఐవీ బాధితులు సుమారు 3.53 కోట్ల మంది. అత్యధికంగా హెచ్‌ఐవి బారినపడ్డ పదిదేశాలు:
దేశం సంఖ్య- లక్షల్లో
దక్షిణాఫ్రికా 61
నైజీరియా 34
ఇండియా 21
కెన్యా 16
మొజాంబిక్ 16
ఉగాండా 15
టాంజానియా 15
జింబాబ్వే 14
మాలవి 11
జాంబియా 11