
కరెంట్ వచ్చింది... కట్నం పెంచింది!
ఆ ఊరిలో అడుగుపెట్టిన ప్రతి కోడలు పిల్ల ఒక టీవీని వరకట్నంగా వెంట పెట్టుకుని వస్తోంది.
అతి త్వరలో ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలున్న ‘భారతదేశం’లో ఇప్పుడిప్పుడే విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్న గ్రామాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచి, మరో ఆరేళ్లు గడిచాక చిబావుఖేరా గ్రామానికి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విద్యుత్‌సరఫరా ప్రారంభమైంది. అలాగని ఇది ఏ మారుమూల గ్రామమో అనుకుంటే పొరపాటు. లక్నోకు 20 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం ఇది. ఈ ఊరికే విద్యుత్ సరఫరా ‘కాస్తంత’ ఆలస్యంగా మొదలైంది.
ఈ సౌకర్యం ఇక్కడి ప్రజల జీవితాలను ఏ విధంగా మార్చింది? కరెంట్ సరఫరా మొదలైన ఐదు నెలలకు ఇక్కడి ప్రజలను జీవితాలు ఏ విధంగా ప్రభావితమయ్యాయి? ఈ విషయం గురించి ఒక వార్తా సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన పరిణామాలెన్నో ఆవిష్కృతమయ్యాయి. 150 ఇళ్లు ఉండే ఈ ఊరికి విద్యుత్ సరఫరా మొదలవ్వడం పెళ్లి సంబంధాలను ప్రభావితం చేస్తోంది. ఊరికి కరెంట్ వచ్చింది కాబట్టి.. ఇంట్లో టీవీ ఉంటే బావుంటుందన్న ఆశ మొదలైంది ఇక్కడి ప్రజల్లో. టీవీలను సొంతంగా కొనుక్కోవడం కాకుండా, పెళ్లిళ్లలో కట్నంగా ఇవ్వాలని అడిగి తెప్పించుకునే పనిలో పడ్డారు వీరు.
ఈ మధ్యకాలంలో ఈ ఊరిలో అడుగుపెట్టిన ప్రతి కోడలు పిల్ల ఒక టీవీని వెంటపెట్టుకుని వస్తోంది. మరికొందరు తమ తాహతును బట్టి.. టీవీతో పాటు డీవీడీ ప్లేయర్, టీవీ స్థాయి కట్నం ఇవ్వలేని వాళ్లు టేప్‌రికార్డర్‌లను కట్నంగా తెస్తున్నారు. అయితే టీవీల వల్ల అమాంతం కట్నం పెరిగిపోయిందని అమ్మాయిల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవేం కరెంటు కష్టాలో!